తెలంగాణా రాజకీయాల్లో లోకేష్ !
అదేమిటి నారా లోకేష్ ఏపీ మంత్రి కదా తెలంగాణా రాజకీయాల్లోకి ఏమిటి అని కంగారు పడాల్సినది లేదు.
By: Satya P | 4 Aug 2025 9:45 AM ISTఅదేమిటి నారా లోకేష్ ఏపీ మంత్రి కదా తెలంగాణా రాజకీయాల్లోకి ఏమిటి అని కంగారు పడాల్సినది లేదు. అయినా టీడీపీ జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణా రాజకీయాల్లో లోకేష్ కనిపించినా తప్పు లేదు. అయితే అది వేరే విషయం కానీ ఇపుడు సడెన్ గా లోకేష్ తెలంగాణా రాజకీయానికి హాట్ టాపిక్ గా మారిపోయారు. ఆయన అంతలా అక్కడ రాజకీయ పార్టీల మధ్యన డిబేట్ పాయింట్ గా ఉంటున్నారు.
వ్యూహాత్మకంగానే :
నారా లోకేష్ తన తండి సీఎం చంద్రబాబుతో కలసి తాను మంత్రిగా ఈ మధ్యనే సింగపూర్ టూర్ కి వెళ్ళి వచ్చారు ఆ టూర్ విశేషాలను చెప్పడానికి ఆయన మీడియా సమావేశం పెట్టారు. అందులో అన్నీ చెబుతూనే మధ్యలో బనకచర్ల ఇష్యూ మీద మాట్లాడారు. మరి అది ఆయన కోరి చెప్పారా లేక మీడియా ప్రశ్నలకు జవాబు ఇస్తూ రెస్పాండ్ అయ్యారో తెలియదు కానీ బనకచర్ల మీద కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటో పక్కాగా చెప్పేశారు.
కుండబద్దలు కొట్టేశారు :
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అనుమతులు సాధించి తీరుతామని లోకేష్ కుండబద్ధలు కొట్టారు. ఈ విషయంలో తాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అయినా వరద జలాలు నీటినే వాడుకోవాలని చూస్తూంటే తెలంగాణాలో రాజకీయంగా విమర్శలు వస్తున్నాయని అన్నారు. అంతే లోకేష్ మాటని పట్టుకుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ కి ఇది ఆయుధంగా మార్చుకోవాలని ఉంది. బనకచర్ల ఇష్యూని అసలు కెలికిందే బీఆర్ఎస్. ఈ ఇష్యూతో మరోసారి ఏపీ తెలంగాణాల మధ్య సెంటిమెంట్ ని రాజేయాలన్నదే ఆ పార్టీ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
కాంగ్రెస్ మీద విమర్శలు :
మంత్రి నారా లోకేష్ అంత గట్టిగా బనకచర్ల గురించి చెబుతున్నారు అంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే అని మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్ర నేత హరీష్ రావు మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు గురువుకు శిష్యుడు ఇస్తున్న దక్షిణ అని చాలానే కామెంట్స్ ఆయన చేశారు. నీళ్ళను ఏపీకి నిధులను ఢిల్లీలో తమ బాస్ రాహుల్ కి ఇస్తున్నారు అని కూడా విమర్శించారు. లోకేష్ మీద కూడా ఈ సందర్భంగా హరీష్ రావు విమర్శలు చేశారు. బనకచర్ల ఎలా అవుతుందో తామూ చూస్తామని ప్రతి సవాల్ చేశారు. అలా లోకేష్ ని గట్టిగానే టార్గెట్ చేశారు.
కాంగ్రెస్ నోటి వెంట కూడా :
మరో వైపు చూస్తే బీఆర్ఎస్ తమ మీద విమర్శలు సంధించడంతో కాంగ్రెస్ నుంచి కూడా మంత్రి లోకేష్ విషయంలో స్పందించాల్సి వచ్చింది. మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వంటి వారు లోకేష్ తీరు మీద ఫైర్ అయ్యారు. సీనియర్ నేతగా చంద్రబాబుని గౌరవిస్తామని అంటూనే లోకేష్ కి నికర జలాలకు మిగులు జలాలకు వరద జలాలకు మధ్య తేడా తెలియడం లేదని కూడా ఎద్దేవా చేశారు. ఈ నీటి లెక్కలు తేలేవరకూ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఏపీ కట్టేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.
లోకేష్ ఇంకా చాలా నేర్చుకోవాలని కూడా సూచిస్తూ వచ్చారు. మొత్తం మీద చూస్తే నాడు చంద్రబాబు ఏమైనా అంటే గట్టిగా విరుచుకుపడే బీఆర్ఎస్ ఇపుడు లోకేష్ బాబు మాటల మీద రియాక్ట్ అవుతూ సెంటిమెంట్ ని రాజేస్తోంది అని అంటున్నారు. దాంతో బీఆర్ఎస్ కి జవాబు చెప్పే పనిలో కాంగ్రెస్ కూడా తన పని తాను చేయాల్సి వస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో లోకేష్ తెలంగాణా రాజకీయాల్లో నలుగుతున్నారని అంటున్నారు. ఇది అయితే ఒకింత మంచిదే అని అంటున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం తాము పాటుపడుతూంటే తెలంగాణా నుంచి అడ్డంకులు వస్తున్నాయని చెప్పుకోవడానికి టీడీపీకి ఇది ఉపయోగపడేలా ఉంది అని అంటున్నారు.
