‘NRI కాదు MRI’... పవన్ 15 ఏళ్ల ఆకాంక్షపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్ లో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
By: Raja Ch | 19 Oct 2025 7:25 PM ISTప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబు అరెస్ట్, ఏపీకి గూగుల్, పవన్ 15ఏళ్ల కూటమి కోరిక మొదలైన విషయాలతో పాటు ఎన్నారైలకు కొత్త పేరు పెట్టారు నారా లోకేష్.
అవును... ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్ లో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారని.. తెలుగు వాళ్ళు లేని దేశమే లేదని.. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మనదే డామినేషన్ అని అన్నారు.
తెలుగువాడి సత్తాను ప్రపంచానికే పరిచయం చేశారు!:
ఈ సందర్భంగా... తెలుగువాడి సత్తాను ప్రపంచానికే పరిచయం చేసింది చంద్రబాబునాయుడు అని చెప్పిన లోకేష్.. 1995లో పెద్దఎత్తున సంస్కరణలు తీసుకువచ్చి ఐటీ విద్యను దగ్గర చేశారని తెలిపారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా.. ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్లా.. ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల ఏం జరుగుతుంది.. అని ఆనాడు ఎగతాళి చేసినవారి నోటి నుంచి నేడు మాట రావడం లేదని అన్నారు.
అలాంటి చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు మీరంతా ఎంతో బాధపడ్డారని.. ఆస్ట్రేలియాలోని ప్రతి సిటీలో మీరు నిరసన కార్యక్రమాలు చేశారని.. మా కుటుంబానికి అండగా నిలబడ్డారని లోకేష్ అన్నారు. ఆ రోజు హైదరాబాద్ లో 45వేల మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారని.. అప్పుడే ప్రజలకు సేవ చేయాలని, ప్రజల మెప్పు పొందాలని సంకల్పించానని స్పష్టం చేశారు.
కేంద్ర సహకారం వల్లే రాష్ట్రానికి గూగుల్!
ఇదే సమయంలో... కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మాసిటీ.. ఇలా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామని చెప్పిన లోకేష్... వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారమని తెలిపారు.
పవన్ కల్యాణ్ 15 ఏళ్ల కోరికపై స్పందిస్తూ..!:
తాజాగా ఇటీవల ప్రధాన మంత్రి కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సభలో ప్రసంగించిన పవన్... ఇబ్బందులున్నా, ఏమున్నా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని లోకేష్ ప్రస్థావించారు.
ఇందులోభాగంగా... సోదర సమానుడైన పవనన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పారని.. పొత్తు ఉన్నప్పుడు చిన్న, చిన్న సమస్యలు ఉంటాయని.. వచ్చే 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ఏపీని ముందుకు తీసుకెళ్దామని పదేపదే చెబుతున్నారని అన్నారు. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెం.1గా ఉండాలనేదే ఏకైక అజెండాతోనే ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఎన్నారై లు ఎమ్మారైలు!:
ఈ సందర్భంగా... 'అందరూ మిమ్మల్ని ఎన్నారైలు (నాన్ రెసిడెంట్ ఇండియన్స్) అంటారు.. కానీ, నేను మాత్రం మిమ్మల్ని ఎమ్మారై లు అంటాను.. ఎమ్మారై లు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్.. సముద్రాలు దాటినా సొంత ఊరు, సొంత రాష్ట్రం అంటే మీకు ప్రేమ" అని చెప్పిన లోకేష్... మీరు మీ కంపెనీల్లో బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని అక్కడున్న తెలుగువారిని కోరారు.
