ఆస్ట్రేలియాతో కలిసి ముందుకు.. లోకేష్ పలు ఒప్పందాలు!
విద్యారంగం సహా యువతకు ఉపాధి కల్పించే వివిధ రంగాలకు పెద్ద పీట వేస్తున్న మంత్రి నారా లోకేష్ తాజాగా ఆస్ట్రేలియాతో పలు విభాగాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు.
By: Garuda Media | 3 Aug 2026 3:39 PM ISTవిద్యారంగం సహా యువతకు ఉపాధి కల్పించే వివిధ రంగాలకు పెద్ద పీట వేస్తున్న మంత్రి నారా లోకేష్ తాజాగా ఆస్ట్రేలియాతో పలు విభాగాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. వీటిలో ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, క్లీన్ ఎనర్జీ వంటి కీలక రంగాలు ఉన్నాయి. గతంలో ఆయన ఆస్ట్రేలియాలో తొలిసారి పర్యటించిన సమయంలో ఈ రంగాలకు సంబంధించి పలు సంస్థలతో చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు.. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయి.
ఇవీ ఒప్పందాలు..
1) ఎడ్యుకేషన్: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్, అదేవిధంగా ఆధునిక విద్యపై అవగాహన కల్పించనున్నారు. తద్వారా.. విద్యార్థులు ఉన్నత విద్య కోసం.. ఎక్కడికైనా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలానే ప్రాధమిక విద్యలోనే ప్రపంచ స్థాయి అవగాహన, నేర్పు వంటివి అలవడనున్నాయి.
2) ఇండస్ట్రీస్: ఆస్ట్రేలియాకు చెందిన పరిశ్రమల అధిపతులు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నారు. వీటి ద్వారా యువతకు మెరుగైన ఉపాధి లభించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించనుంది.
3) క్లీన్ ఎనర్జీ: హరిత ఇంధనానికి ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. క్లీన్ ఎనర్జీకి అవకాశాలను మరింత మెరుగు పరచనుంది. దీనిలో భాగంగా సౌర విద్యుత్ ఫలకాలను తయారు చేసేందుకు ఆస్ట్రేలియా నైపుణ్యాలను వినియోగించుకోనుంది. అలానే సోలార్ పీవీ తయారీ యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.
4) మెంటల్ హెల్త్: మానసిక ఆరోగ్యంలో కూడా ఆస్ట్రేలియా సహకారంతో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగనుంది. ముఖ్యంగా ఐటీ వంటి పరిశ్రమల్లో పనిచేసేవారికి, విద్యార్థులకు మెంటల్ హెల్త్‌కు సంబంధించి అవగాహన కల్పించనున్నారు. తద్వారా బలవన్మరణాలను నిరోధించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో వర్చువల్ కౌన్సెలింగ్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తాయి.
5) నైపుణ్యాభివృద్ధి: విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలో పేరెన్నికగన్న.. సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సంయుక్తంగా ఐఐటీ తిరుపతిలో ‘సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నాయి.
