Begin typing your search above and press return to search.

ఏపీలో సోషల్ మీడియా నిషేధం.. ఐటీ మంత్రి లోకేశ్ సీరియస్ యాక్షన్

ఏపీలో సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అంశంపై యువనేత, ఐటీ మంత్రి నారా లోకేశ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   29 Jan 2026 1:00 PM IST
ఏపీలో సోషల్ మీడియా నిషేధం.. ఐటీ మంత్రి లోకేశ్ సీరియస్ యాక్షన్
X

ఏపీలో సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అంశంపై యువనేత, ఐటీ మంత్రి నారా లోకేశ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. విచ్చలవిడిగా సోషల్ మీడియా వినియోగం వల్ల యువత ముఖ్యంగా చిన్నారులు పెడతోవ పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించుకుండా ఆంక్షలు విధించాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించిన ఈ అంశంపై ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. బుధవారం సమావేశమైన ఈ కమిటీ ఇతర దేశాల్లో అమలు అవుతున్న విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇతర దేశాల్లో అమలు చేస్తున్న పద్ధతులు మన రాష్ట్రంలో అమలు చేయడం సాధ్యమా? అనే అంశంపై విస్తృతంగా చర్చించింది.

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వాడకంపై కొన్ని పరిమితులు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా 16 ఏళ్లలోపు పిల్లలు (మైనర్లకు) సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేయాలనే ప్రతిపాదనపై ప్రస్తుతం ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తోంది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకునేంత మానసిక పరిపక్వత చిన్నపిల్లలకు ఉండటం లేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న అసత్య, తప్పుడు ప్రచారం పిల్లల ఆలోచనా విధానాన్ని దెబ్బతీస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నపిల్లలు సైబర్ వేధింపులు, ఆన్‌లైన్ మోసాలకు గురవుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

అంతేకాకుండా గంటల తరబడి స్క్రీన్‌లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతోంది. ఇది శారీరక శ్రమను తగ్గించి ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇతరుల విలాసవంతమైన జీవితాలను చూసి తమను తాము తక్కువగా పోల్చుకోవడం వల్ల యువతలో 'ఫోమో' (Fear of Missing Out), మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. ఇటీవల ఇన్ ష్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాల్లో పరిచయాలు పెంచుకుని కొందరు చిన్నపిల్లలు ఇళ్లు విడిచి వెళ్లిపోవడం, తర్వాత మోసపోవడంపై వస్తున్న వార్తలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల విజయవాడ, తిరుపతిల్లో చోటుచేసుకున్న ఘటనలు ఈ కోవకు చెందినవే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్రంలో చిన్న పిల్లలు అంటే 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వినియోగించకుండా ఆంక్షలు విధించాలని భావిస్తోంది. దీనిపై విధివిధానాలను తయారు చేసేందుకు తాజాగా మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో మిగిలిన మంత్రులు సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సమాచార మంత్రి కొలుసు పార్థసారథి, హోంమంత్రి అనిత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరైన ఈ సమావేశంలో చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ప్రాన్స్ లో సోషల్ మీడియాపై విధించిన ఆంక్షలను అధ్యయనం చేయాలని మంత్రులు అధికారులను సూచించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై సూచనలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మలేసియాలో మై డిజిటల్ ఐడీ, పాస్ పోర్టు వివరాలతో ఈ-కేవైసీ అనుసంధానం ద్వారా 16 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఉందని తెలిపారు. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనపై ఈ సమావేశంలో మిగిలిన మంత్రులు మద్దతు పలికారు. అయితే ఈ విషయంలో వయోపరిమితి ఎంత విధించాలనే విషయమై వివిధ దేశాల్లో చట్టాలను పరిశీలించాలని మంత్రుల బృందం అధికారులకు సూచించింది.

కాగా, సోషల్ మీడియా వినియోగంపై మైనర్లకు పరిమితులు విధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై సానుకూల స్పందన కనిపిస్తోంది. దేశంలో తొలిసారిగా ఏపీలో ఈ అంశంపై కదలిక వచ్చిందని, ఇక్కడ రూపొందించే చట్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా కంటెంట్ వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. వీటిని అరికట్టేలా ఏపీలో తొలి అడుగు పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రస్తుతం మంత్రుల స్థాయిలో జరిగిన సమావేశంలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం, విధివిధానాలు రూపొందించడానికి తదుపరి సమావేశమవ్వాలని మంత్రులు నిర్ణయించారు. దీనికి సోషల్ మీడియా రన్ చేస్తున్న మెటా, ఎక్స్, గూగుల్, షేర్ చాట్ వంటి సంస్థల ప్రతినిధులను ఆహ్వానించాలని భావిస్తున్నారు.