Begin typing your search above and press return to search.

మోడీ ముందు మొంథా నష్టం...గుడ్ న్యూసేనా ?

సరిగ్గా ముప్పయి అయిదు రోజుల క్రితం ఏపీ మీద మొంథా తుఫాన్ విరుచుకుపడింది.

By:  Satya P   |   3 Dec 2025 9:31 AM IST
మోడీ ముందు మొంథా నష్టం...గుడ్ న్యూసేనా ?
X

సరిగ్గా ముప్పయి అయిదు రోజుల క్రితం ఏపీ మీద మొంథా తుఫాన్ విరుచుకుపడింది. అక్టోబర్ నెలాఖరులో ఏపీ మీద భారీ దాడి చేసింది. జల ఖడ్గం తో పంటను మొత్తం నరికేసింది. రోడ్లు పోయాయి, విద్యుత్ రంగం కుదేలు అయింది నీటి పారుదల రంగం కూడా ఇబ్బందులు పడింది. ఒకటేంటి అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. ప్రాథమిక నష్టంగా ఒక నివేదికను ఆనాడు ఏపీలోని కూటమి ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఇపుడు పూర్తి స్థాయిలో నివేదికతో సహా మంత్రి నారా లోకేష్ హోం మంత్రి అనిత ఢిల్లీకి వెళ్ళి మరీ కేంద్ర ప్రభుత్వానికి అందించారు.

రాష్ట్రానికి 6,352 కోట్ల నష్టం :

ఏపీకి మొంథా తుపాను కారణంగా 6,352 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని లెక్కలు పక్కాగా తేల్చారు. ఈ నివేదికతో నారా లోకేష్ అనిత కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కల్సి ఏపీలో ఉన్న మొత్తం పరిస్థితి గురించి తెలిపారు. మొంథా తుపానుతో దాదాపుగా 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని మంత్రులు పేర్కొన్నారు. అలాగే 24 జిల్లాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని కూడా చెప్పారు. తుపాను ప్రభావిత ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా రాష్ట్రం ప్రభుత్వం తరఫున మూడు వేల రూపాయలు అందించామని మంత్రులు కేంద్ర మంత్రికి వివరించారు. అదే విధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మంత్రులు ఇద్దరూ సమావేశమై తుపాను నష్టాన్ని వివరించారు.

లక్షల హెక్టార్లలో :

ఇక మొంథా తుపాను కారణంగా సుమారు 1.61 లక్షల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని నివేదికలో తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 271 కోట్ల రూపాయలు, రోడ్లు, మౌలిక సదుపాయాలకు 4,324 కోట్ల రూపాయలు, విద్యుత్‌ రంగానికి 41 కోట్ల రూపాయలు, నీటి వనరులు ప్రాజెక్టులకు 369 కోట్ల రూపాయలు, శాశ్వత నిర్మాణాలకు 1302 కోట్ల రూపాయలు మేర నష్టం వాటిల్లిందని మంత్రులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరే ఇదంతా ఒక రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళి నివేఎదిక అందించే ఒక అధికారిక ప్రక్రియగానే చూడాలి. అయితే మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఏపీ కాదు, పైగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య మిత్రుత్వం ఉంది. కేంద్రంలో ప్రభుత్వానికి బాసటగా టీడీపీ ఎంపీలు నిలుస్తున్నారు. దాంతో పాటు ఏపీలో బీజేపీ మంత్రి ఉన్నారు ఇలా చూసుకుంటే ఎన్ డీయే ప్రభుత్వమే ఏపీలో ఉంది. దాంతో భారీగానే కేంద్రం సాయం చేయాలి. మరి ఏపీ ఇచ్చిన నివేదిక మేరకు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేస్తారా అన్నదే చూడాల్సి ఉంది. చేస్తే కనుక ఏపీ కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడినట్లే. ఇపుడు బంతి మోడీ ప్రభుత్వం కోర్టులో ఉంది. ఏపీకి గుడ్ న్యూస్ కోసమే అంతా ఎదురుచూస్తున్నారు.