లోకేష్ ఎంట్రీ: ఆ పాలిటిక్స్ సెట్ రైట్ అవుతాయా..?
ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేయాలని చంద్రబాబు చెబుతుంటే వారిలో వారే విమర్శలు చేసుకోవడం వారిలో వారే విభేదాలు సృష్టించుకోవడం అన్నది కనిపిస్తుంది.
By: Garuda Media | 9 Nov 2025 2:00 PM ISTమంత్రి నారా లోకేష్ తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించారు. శుక్రవారం రాత్రి ఆయన అనంతపురం జిల్లాకు వెళ్లారు. పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. వాస్తవానికి దీనికి పెద్దగా కారణం ఏమీ లేకపోయినా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో లోకేష్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పైకి ఈ విషయం చెప్పలేదు కానీ అంతర్గతంగా ఉన్న విభేదాలను పరిష్కరించేలాగా మరీ ముఖ్యంగా సొంత పార్టీ నాయకులే రోడ్డు మీదకు వచ్చే వివాదాలకు కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో వారిని దారిలో పెట్టేలాగా మంత్రి నారా లోకేష్ పర్యటన చేశారన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
గత కొన్నాళ్లుగా తాడిపత్రి నియోజకవర్గం నుంచి అనంతపురం అర్బన్ వరకు, కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం వరకు, పుట్టపర్తి నుంచి రాప్తాడు నియోజకవర్గం వరకు పలు విభేదాలు, విమర్శలు తెరమీదకు వచ్చాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు మధ్య ఎంపీలు ఎమ్మెల్యేలకు మధ్య ఎమ్మెల్యేలు స్థానిక నాయకు లకు మధ్య కూడా విభేదాలు వివాదాలు రోడ్డున పడుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు న్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేయాలని చంద్రబాబు చెబుతుంటే వారిలో వారే విమర్శలు చేసుకోవడం వారిలో వారే విభేదాలు సృష్టించుకోవడం అన్నది కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు నాయకులను దారిలో పెట్టాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ అక్కడ పర్యటించారు. ఈ క్రమం లో ఆయన ఎవరినీ బలంగా విమర్శించకపోయినా ఒక కీలక లక్ష్యాన్ని మాత్రం నాయకులకు చేరవేశారు. అందరూ ఐక్యంగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకోవాలంటే అందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అంతేకాదు అంతర్గత విభేదాలు విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీ బలహీనపడుతుందని అలాంటి సమయంలో పార్టీ ఉపేక్షించదని.. ఎంతటి పెద్ద నాయకులైనా పక్కన పెట్టడం ఖాయమని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. దీనిని ఒకరికి ఆపాదిస్తూ చెప్పకపోయినా అంతర్గతంగా ఉన్న లక్ష్యం మాత్రం ప్రతి ఒక్కళ్ళని హెచ్చరించడమే అన్నది వాస్తవం. దీనిని అర్థం చేసుకొని నాయకులు గాడిలో పడితే అనంతపురం పాలిటిక్స్ లైన్ లోకి వస్తాయి అన్నది పార్టీ అధిష్టానం ఆలోచన.
ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ అందరిని ఒకే వేదికపై కూర్చోబెట్టి నేరుగా పేరు పెట్టి ఎవరిని విమర్శించక పోయినా పార్టీ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని గతంలో అనంతపురం జిల్లా టిడిపికి ఏ విధంగా మేలు చేసిందన్న విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. తద్వారా కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎవరైనా అంతర్గత విభేదాలు పెట్టుకొని రచ్చ చేసుకుంటే అది వారికే నష్టం వస్తుందని కూడా తేల్చి చెప్పారు. తద్వారా పార్టీలో ఐకమత్యానికి పెద్దపేట వేస్తున్నామనే సంకేతాలను స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిని సీనియర్ నాయకులు అర్థం చేసుకుంటారా లేక ఇలాగే విభేదాలతో కొనసాగుతారా అనేది చూడాలి.
