Begin typing your search above and press return to search.

టీడీపీ కార్యకర్తల కోసం పదవులు రిజర్వు.. 150 మందికి లోకేశ్ బంపర్ ఆఫర్

ఇక మంత్రి లోకేశ్ తీసుకున్న నిర్ణయంతో టీడీపీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 150 మందికి త్వరలో పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   7 Oct 2026 5:17 PM IST
టీడీపీ కార్యకర్తల కోసం పదవులు రిజర్వు.. 150 మందికి లోకేశ్ బంపర్ ఆఫర్
X

తెలుగుదేశం పార్టీపై తనదైన ముద్రవేసేలా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప మహానాడులో కార్యకర్తే అధినేత అంటూ పిలుపునిచ్చిన లోకేశ్ ఇప్పుడు ఆ నినాదాన్ని నిజం చేసేలా అడుగులు వేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న పార్టీ కోసం పనిచేసిన నాయకులను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, వారి కోసం నామినేటెడ్ పదవులను రిజర్వు చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఆయన అనుమతి కూడా తీసుకున్నారని అంటున్నారు. దీంతో టీడీపీలో క్షేత్రస్థాయిలో పనిచేసిన సుమారు 150 మందికి త్వరలో నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీలో తన ఆరంగేట్రం నుంచి నారా లోకేశ్ తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. తొలిసారిగా కార్యకర్తల సంక్షేమ నిధికి రూపకల్పన చేసి కార్యకర్తల మనసులను గెలుచుకున్నారు. ఆపద సమయంలో అపన్నహస్తం అందించేలా టీడీపీ సభ్యత్వం ఉన్నవారికి బీమా చేయించారు. ఆ తర్వాత కార్యకర్తల కోసం తాను ఉన్నానంటూ పలు కార్యక్రమాలను లోకేశ్ తీసుకువచ్చారు. ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా కార్యకర్తలకు అందుబాటులో ఉండటమే కాకుండా, టీడీపీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య వంటివారి కుటుంబ సభ్యులకు వెన్నుదన్నుగా నిలిచారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లోనూ కార్యకర్తలకు అగ్ర తాంబూళం దక్కాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఇక మంత్రి లోకేశ్ తీసుకున్న నిర్ణయంతో టీడీపీలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 150 మందికి త్వరలో పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబరులో తొలివిడతలో 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వీరి పదవీ కాలం ఈ నెలతో ముగియనుందని అంటున్నారు. పార్టీలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ప్రస్తుతం పదవుల్లో ఉన్న చాలా మందికి రెన్యువల్ చేసే అవకాశం లేదని అంటున్నారు. వీరిస్థానంలో గత ప్రభుత్వంపై ధైర్యసాహసాలతో పోరాడి తెగువ చూపిన కార్యకర్తలకు పెద్దపీట వేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

2024లో రెండు విడతలు సుమారు 148 పదవులను భర్తీ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవులు అన్నింటిని ఇప్పుడు కొత్తవారికి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అయితే సహజంగా పదవుల కోసం ఏ పార్టీలో అయినా పైరవీలు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సుతోనే పదవులు కట్టబెట్టే సంస్కృతి ఇప్పటివరకు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ కూడా ఇప్పటివరకు ఇదే విధానాన్ని అవలంబించిందని అంటున్నారు. అయితే నారా లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఈ విధానాన్ని సంస్కరించాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. సిఫార్సులు లేకుండా వచ్చే నెలతో ఖాళీ అయ్యే పదవులు అన్నింటిని భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ బహిరంగంగా ప్రకటించారు.

పనితీరే ఆధారంగా కార్యకర్తల ఎంపిక ఉంటుందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన కార్యకర్తలను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. గతంలో చేపట్టిన ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేసిన వారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు, రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాల్లో బాగా పనిచేసిన వారిని గుర్తించనున్నట్లు చెబుతున్నారు. మొత్తం ఆరు అంశాలను పరిశీలించి కనీసం ఐదింటిలో మెరుగైన ఫలితాలు సాధించేలా పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతో మంత్రి లోకేశ్ నిర్ణయం పార్టీ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.