Begin typing your search above and press return to search.

నెలలోనే 500 కోట్ల ఏఐ ఫొటోలు.. నానా బనానా’నా మజాకా

జెమినీ యాప్‌ ద్వారా నానో బనానా ఫీచర్‌ను ఉపయోగించి వినియోగదారులు విభిన్న శైలుల్లో ఫొటోలు సృష్టించుకుంటున్నారు.

By:  A.N.Kumar   |   26 Sept 2025 8:00 AM IST
నెలలోనే 500 కోట్ల ఏఐ ఫొటోలు.. నానా బనానా’నా మజాకా
X

డిజిటల్‌ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ మొదలైంది. ‘నానో బనానా’ అనే 3డీ ఏఐ మోడల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. గూగుల్‌ ఇటీవల జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్‌ టూల్‌లో భాగంగా ఈ ఫీచర్‌ను విడుదల చేయగా, అది అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఆదరణ పొందుతోంది.

* నెలలోనే 500 కోట్ల ఇమేజ్‌లు

జెమినీ యాప్‌ ద్వారా నానో బనానా ఫీచర్‌ను ఉపయోగించి వినియోగదారులు విభిన్న శైలుల్లో ఫొటోలు సృష్టించుకుంటున్నారు. రెట్రో స్టైల్‌ నుంచి నవరాత్రి లుక్స్‌ వరకు అనేక క్రియేటివ్‌ డిజైన్లు రూపొందించుకుంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ అంతగా పెరిగిపోవడంతో ఒక్క నెలలోనే 500 కోట్లకుపైగా ఏఐ ఫొటోలు సృష్టించబడ్డాయి. ఈ విషయాన్ని గూగుల్‌ ల్యాబ్స్‌ & జెమినీ వైస్‌ ప్రెసిడెంట్‌ జోష్‌ వుడ్‌వార్డ్ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. దీనికి గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ స్పందిస్తూ.. “500 కోట్ల తర్వాతి ఫొటో నాదే” అంటూ తన ఇమేజ్‌ను షేర్‌ చేశారు.

* నానో బనానా అసలు ఏమిటి?

ఇది నిజంగా బొమ్మ కాదు, పూర్తిగా డిజిటల్‌ మోడల్‌. గూగుల్‌ ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ఈ టూల్‌ సహాయంతో ఎవరైనా కేవలం కొన్ని సెకన్లలోనే తమ ఫొటోను 3డీ బొమ్మలా మార్చుకోవచ్చు. నాణ్యమైన ఫొటోను అప్‌లోడ్‌ చేసి, సరైన ప్రాంప్ట్‌ ఇవ్వడం చాలు. క్షణాల్లోనే ప్రత్యేకమైన డిజిటల్‌ బొమ్మ తయారవుతుంది.

* ఎలా ఉపయోగించాలి?

గూగుల్‌ ఏఐ స్టూడియో (aistudio.google.com)లో లాగిన్‌ కావాలి. “ట్రై నానో బనానా” అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఫొటోను అప్‌లోడ్‌ చేసి, కావాల్సిన ప్రాంప్ట్‌ ఇవ్వాలి. వెంటనే డిజిటల్‌ 3డీ మోడల్‌ రెడీ అవుతుంది.

* కొత్త ట్రెండ్‌కు ఊపిరి

జీబ్లీ స్టైల్‌ ఇమేజ్‌లు హంగామా చేసిన తర్వాత ఇప్పుడు నానో బనానా క్రేజ్‌ టెక్‌ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. సెలబ్రిటీల నుంచి సాధారణ యూజర్ల వరకు అందరూ ఈ ఫీచర్‌ను ట్రై చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దీని వల్ల రాబోయే రోజుల్లో ఏఐ ఇమేజ్‌ టూల్స్‌ వినియోగం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి నానో బనానా ఇప్పుడు డిజిటల్‌ ప్రపంచంలో కొత్త జ్వాల రేపుతోంది!