Begin typing your search above and press return to search.

'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో రూ.120 కోట్లు వసూలు.. భారీ ఆర్థిక మోసం!

దొర్నిపాడు కేంద్రంగా కొందరు స్థానిక నేతలు, వారి బంధువులు కలిసి "వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సాల్యూషన్స్" అనే పేరుతో ఓ నకిలీ సంస్థను స్థాపించారు.

By:  A.N.Kumar   |   10 Oct 2025 4:30 PM IST
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో రూ.120 కోట్లు వసూలు.. భారీ ఆర్థిక మోసం!
X

ఆకర్షణీయమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఉద్యోగాల పేరుతో గ్రామీణ ప్రజలకు వలవేసి, నంద్యాల జిల్లా దొర్నిపాడు కేంద్రాన్ని చేసుకుని సుమారు రూ.120 కోట్లకు పైగా భారీ ఆర్థిక మోసం జరిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వేలాది మంది నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు ఈ మోసానికి బలయ్యారు.

* 'వెల్త్ అండ్ హెల్త్' నకిలీ సంస్థతో వల

దొర్నిపాడు కేంద్రంగా కొందరు స్థానిక నేతలు, వారి బంధువులు కలిసి "వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సాల్యూషన్స్" అనే పేరుతో ఓ నకిలీ సంస్థను స్థాపించారు. వీరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్నారు. "రోజుకు కేవలం ఒక గంట పనిచేస్తే చాలు, నెలకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు జీతం వస్తుంది" అంటూ నమ్మించారు. కంపెనీలో చేరడానికి, ఉద్యోగం పొందడానికి ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షల చొప్పున భారీగా డబ్బులు వసూలు చేశారు. ఏజెంట్లు గ్రామాల వారీగా రూ.3 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

కుటుంబ గ్యాంగ్ – మొదట నమ్మకం

ఈ మోసం వెనుక దొర్నిపాడుకు చెందిన ఓ పార్టీ నేత , ఆయన అల్లుళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్న వారు, మరో వ్యక్తి ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొదట వీరు తమ బంధువులను ఉద్యోగాల్లో చేర్చుకుని, కొంతకాలం వారికి నిజమైనట్లుగా జీతాలు చెల్లించారు. ఈ బంధువులకు జీతాలు రావడం చూసి, గ్రామాల్లో కంపెనీపై విశ్వాసం పెరిగింది. ఇదే అదనుగా వీరు నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లోని వందలాది కుటుంబాలను వలలోకి లాగారు.

* పొలాలు అమ్మి, బంగారం తాకట్టు పెట్టి...

సుమారు 5 వేల మంది ఈ మోసానికి గురై ఉంటారని అంచనా. ఉద్యోగం వస్తుందనే ఆశతో బాధితులు కొందరు తమ పొలాలను అమ్మి, మరికొందరు బంగారాన్ని తాకట్టు పెట్టి నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు.

బాధితుల ఆవేదన

"నాకు, నా ఇద్దరు కొడుకులకు ఉద్యోగం వస్తుందని నమ్మి ఎకరం పొలం అమ్మి రూ.13.50 లక్షలు కట్టాను," అని దొర్నిపాడుకు చెందిన ఓ రైతు కన్నీరుమున్నీరయ్యారు. రుద్రవరం మహిళ కూడా, "ఏజెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మా డబ్బులు ఎవరు ఇస్తారు?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

* కంపెనీ బోర్డు తిప్పేసి పరారీ

దాదాపు 10 నెలల పాటు కొందరికి జీతాలు చెల్లించిన తర్వాత, "వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సాల్యూషన్స్" సంస్థ అకస్మాత్తుగా మూతపడింది. నిర్వాహకులు కంపెనీ బోర్డును తొలగించి, ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.

* కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా...

నిందితులు వాడుతున్న ఒక బ్యాంక్ ఖాతా నుంచి రోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ముందే నంద్యాల పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినా, ఆ తర్వాత కూడా మోసం కొనసాగినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు తక్షణమే స్పందించి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకుని, మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.