Begin typing your search above and press return to search.

యూట్యూబర్ నందనపై కేసు ఎఫ్ఐఆర్ లో వెలుగులోకి సంచలన విషయాలు

సోషల్ మీడియాలో ‘నందూస్ వరల్డ్’ పేరుతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ జాగర్లమూడి రమానందన అలియాస్ నందనపై నమోదైన కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది

By:  A.N.Kumar   |   9 Sept 2026 9:32 AM IST
యూట్యూబర్ నందనపై కేసు ఎఫ్ఐఆర్ లో వెలుగులోకి సంచలన విషయాలు
X

సోషల్ మీడియాలో ‘నందూస్ వరల్డ్’ పేరుతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యూట్యూబర్ జాగర్లమూడి రమానందన అలియాస్ నందనపై నమోదైన కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. యూకే వీసా పొడిగింపు, ఉద్యోగాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (సీఓఎస్) ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబర్ 515/2025 కాగా 2025 నవంబర్ 22న కేసు నమోదైనట్లు వెల్లడైంది.

ఎఫ్ఐఆర్‌లో నందన భర్త జాగర్లమూడి మధుకర్‌ను ఏ1గా, రమానందన అలియాస్ నందనను ఏ2గా, మధుకర్ తండ్రి మోహన్ రావును ఏ3గా పేర్కొన్నట్లు సమాచారం. మామిళ్లపల్లి శివ క్రాంతికుమార్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

ఉద్యోగాలు, వీసా పేరుతో డబ్బులు?

ఫిర్యాదు ప్రకారం.. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరుతో కార్యాలయాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ఉన్న గుర్తింపును ఉపయోగించుకుని నిందితులు బాధితులకు నమ్మకం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. యూకేలో వీసా పొడిగింపు, ఉద్యోగం, సీఓఎస్ ఇప్పిస్తామని చెప్పి క్రాంతికుమార్ వద్ద నుంచి విడతల వారీగా సుమారు రూ.15 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

అయితే డబ్బులు తీసుకున్న తర్వాత అందించిన సీఓఎస్ పత్రాలు నకిలీవని తేలిందని బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నించగా రూ.2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

100 మందికి పైగా బాధితులా?

ఈ వ్యవహారం ఒక్క ఫిర్యాదుదారుడికే పరిమితం కాలేదని పోలీసులు అనుమానిస్తున్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. 100 మందికి పైగా నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి ఉండవచ్చని, మొత్తం వ్యవహారం సుమారు రూ.15 కోట్ల మేర ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మొత్తం బాధితుల సంఖ్యపై తుది నిర్ధారణ దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెలువడాల్సి ఉంది.

లుకౌట్ నోటీసులతో విమానాశ్రయంలో అదుపులోకి..

కేసు నమోదైన అనంతరం నిందితులు విదేశాలకు వెళ్లిన నేపథ్యంలో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో విదేశాల నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను ఏపీ పోలీసులకు అప్పగించనున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

నందనను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా వీసా, ఉద్యోగాల వ్యవహారాలతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని, మొత్తం వ్యవహారాన్ని తన భర్త మధుకర్ చూసుకునేవారని ఆమె పోలీసులకు తెలిపినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అనంతరం సీఆర్పీసీ నోటీసులు అందించి నందనను పంపించారు. కోర్టు విచారణకు హాజరు కమ్మని కోరారు. ఆమె నిన్న సాయంత్రం కోర్టులో హాజరై విచారణ ఎదుర్కొన్నారు.

ఆరోపణలను ఖండించిన నందన దంపతులు

మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలను నందన దంపతులు తిరస్కరించినట్లు సమాచారం. వ్యక్తిగత కక్షతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు కూడా సమాచారం.

ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీలు, కన్సల్టెన్సీ కార్యకలాపాలు, యూకే వీసా-ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించే అవకాశం ఉంది. ఈ కేసులో ఆరోపణలు నిజమా? ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారింది? వంటి అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం నమోదైన కేసు, ఫిర్యాదులు, వార్తా కథనాల్లో వెల్లడైన ఆరోపణలు మాత్రమే. దర్యాప్తు లేదా న్యాయస్థాన ప్రక్రియ పూర్తయ్యే వరకు వీటిలో నిజానిజాలేంటో బయటకు రావు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు