Begin typing your search above and press return to search.

కోర్టు విచారణకు యూట్యూబర్ నందన.. దేశం వదిలి వెళ్లడం ఇక కష్టమే..

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తన లాయర్‌తో కలిసి వచ్చిన ఆమెను పోలీసులు కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నిస్తున్నారు. నందన తన సొంత వాహనంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

By:  A.N.Kumar   |   8 Sept 2026 5:54 PM IST
కోర్టు విచారణకు యూట్యూబర్ నందన.. దేశం వదిలి వెళ్లడం ఇక కష్టమే..
X

వీసా స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందన పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తన లాయర్‌తో కలిసి వచ్చిన ఆమెను పోలీసులు కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నిస్తున్నారు. నందన తన సొంత వాహనంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

అంతకుముందు నందనను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 41ఏ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి నకిలీ వీసా లెటర్లను విక్రయించారనే ఆరోపణలు నందనపై ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది నవంబర్‌లో శివక్రాంతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో భాగంగానే ప్రస్తుతం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారిస్తున్నారు.

విచారణలో వీసా స్కామ్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ వీసా లెటర్ల వ్యవహారం, షెల్ కంపెనీల ఏర్పాటు, డబ్బుల లావాదేవీలు, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.

పాస్‌పోర్ట్ సీజ్ చేస్తారా?

ఇక ఈ కేసులో నందన విదేశాలకు వెళ్లగలరా? అనే చర్చ కూడా మొదలైంది. సాధారణంగా క్రిమినల్ కేసుల్లో నిందితులపై కోర్టు లేదా దర్యాప్తు సంస్థలు విధించే షరతులను బట్టి వారి ప్రయాణంపై ఆంక్షలు ఉండొచ్చు. అవసరమైతే పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవడం లేదా విదేశాలకు వెళ్లకుండా న్యాయపరమైన ఆంక్షలు విధించడం కూడా సాధ్యమవుతుంది.

ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తిపై కేసు నమోదై, దర్యాప్తు లేదా న్యాయ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కేవలం బెయిల్ రావడం వల్లే స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లే హక్కు లభించదు. కోర్టు విధించే బెయిల్ షరతులు, పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఆదేశాలు, కేసు తీవ్రత వంటి అంశాలు కీలకంగా ఉంటాయి.

నందనకు యూకే పౌరసత్వం ఉన్నా.. విదేశీ పౌరురాలైనా భారతదేశంలో నమోదైన కేసును ఎదుర్కోవాల్సిందేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆరోపణలు కోర్టులో నిరూపితమై శిక్ష పడితే, కోర్టు ఆదేశాలు, వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు ఉంటాయి.

అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను బట్టి చూస్తే.. వీసా స్కామ్ కేసు నుంచి పూర్తిగా బయటపడే వరకు నందన విదేశాలకు వెళ్లే విషయంలో చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే పాస్‌పోర్ట్ సీజ్ చేస్తారా? విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధిస్తారా? అనేది దర్యాప్తు, కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుంది.