ఆంధ్రా నందులెపుడు...మెగాస్టార్ మాటలలో ఆవేదన !
ఇక రాష్ట్రం రెండుగా మారిపోయింది. మళ్ళీ పునరుద్ధరించాలని రెండు ప్రభుత్వాలు అనుకున్నా అది దీర్ఘ కాలం సాధ్యపడలేదు.
By: Satya P | 20 March 2026 11:03 AM ISTఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉగాది సందర్భంగా సినీ కళాకారులకు నంది అవార్డులతో సత్కరించేవారు. ఆ ముందు ఏడు వచ్చిన చిత్రాలలో మేలిమి బంగారం లాంటివి వెలికి తీసి ఉత్తమ చిత్రాలకు నందులు అందించేవారు. ఒదొక పండుగగా సాగిపోయేది. నిజానికి నంది అవార్డులను ప్రవేశపెట్టింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలా తెలుగు సినిమా, నాటక, టెలివిజన్ రంగాలలో ప్రతిభను గుర్తించే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో ఈ అవార్డులను స్థాపించి తొలిసారిగా ప్రదానం చేసింది . వివిధ కళాత్మక సాంకేతిక విభాగాలలో సాధించిన విజయాలను గౌరవించటానికి వీటిని ఏటా అందచేయడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆనాడు తొలి ఉత్తమ చిత్రంగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన డాక్టర్ చక్రవర్తి అవార్డుని సొంతం చేసుకుంది.
ఉగాదికి శ్రీకారం :
ఇక ఈ నంది అవార్డులను ఎపుడు ప్రదానం చేయాలన్న దానికి ఒక ముహూర్తం అంటూ లేదు, అయితే తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరాదిని సుముహూర్తంగా ఎంచుకుని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నంది అవార్డులను ఆ పవిత్రమైన రోజున ప్రదానం చేసేవారు. అలా కళాకారులు అంతా నిత్య నూతనంగా వెలుగొందాలని ఆయన ఆకాంక్షించేవారు. ఈ ఒరవడి ఏకంగా దశాబ్దాల పాటు సాగింది. చంద్రబాబు సీఎం గా ఉండగానూ ఉగాది పండుగ వేళనే నంది అవార్డులను ప్రదానం చేసేవారు.
విభజన తరువాత :
అయితే 2016 నుంచి ఈ అవార్డుల ప్రదానోత్సవం నిలుపు చేయబడింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక రాష్ట్రం రెండుగా మారిపోయింది. మళ్ళీ పునరుద్ధరించాలని రెండు ప్రభుత్వాలు అనుకున్నా అది దీర్ఘ కాలం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2025 నుంచి తిరిగి ఈ అవార్డులను అందచేసే కార్యక్రమం ఒక అనవాయితీగా మారింది. మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులను ఇవ్వాలని అనుకుంటోంది.
మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు :
ఇక ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని తెలంగాణా ప్రభుత్వం నుంచి అందుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వేదికపైన నుంచి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో తెలంగాణా కంటే ఏపీ ప్రభుత్వం వెనకబడి ఉందని ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయంశంగా మారాయి. సినీ కళాకారులకు అవార్డులను అందచేయడంతో ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని ఆయన కోరారు. ఎంతో మంది యువ కళాకారులను ఆంధ్రా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. ఇక తెలంగాణా ప్రభుత్వం సినీ పరిశ్రమను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది చిరంజీవి ప్రశంసించారు.
సినీ రంగంతో ఉపాధి :
సినిమా రంగంతో ఉపాధి అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు అంతే కాదు జీడీపీ పెంచుకోవచ్చు అని అన్నారు. మన సంస్కృతి మన సంప్రదాయాలకు సినిమా ప్రతిబింబం అని దానిని ఎంత వరకైనా తీసుకుని వెళ్ళవచ్చు అని అన్నారు. సినిమా ప్రభావం చాలా శక్తివంతమైనది అని అన్నారు. ఈ విషయం తెలంగాణా ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తోంది అని అన్నారు. సినిమా అన్నది తేలికగా తీసుకోవడానికి లేదని ఆయన అన్నారు. తెలంగాణా ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఇస్తున్న ప్రోత్సాహానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సినిమా తరఫున ఏ రకమైన సాయం చేయాలన్నా తాము చేస్తామని అన్నారు.
