Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్‌లో 'నంది అవార్డు'ల పునరుద్ధరణపై APFDC కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది.

By:  Sivaji Kontham   |   22 Sept 2026 7:18 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల పునరుద్ధరణపై APFDC కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌
X

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రతిష్టాత్మక నంది అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు నంది అవార్డుల మహోత్సవానికి సంబంధించి ఏపీ ఎఫ్‌డీసీ (FDC) చైర్మన్ భరత్ భూషణ్ - ఎండీ విశ్వనాథన్ నేడు మీడియా సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. తెలుగు సినీ, టీవీ, నాటక రంగాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ పురస్కారాలను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు అధికారికంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పాటు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవతో ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో 2012 నుండి 2016 వరకు ప్రకటించి ఆగిపోయిన అవార్డులకు బహుమతి ప్రధానం ఉంటుందని.. అలాగే 2017 నుండి 2024 వరకు ప్రతి సంవత్సరానికి నాలుగు అవార్డుల చొప్పున (రెండు ప్రొడక్షన్, రెండు జ్యూరీ) అందజేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను తాజాగా పరిశీలించి ప్రకటిస్తామని.. పెండింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ తదితర నేషనల్ అవార్డులను కూడా డిసెంబర్ 25 నాటికి అందజేస్తామని తెలిపారు.

ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను వివరిస్తూ.. అక్టోబర్ 12 నాటికి అన్ని దరఖాస్తులను స్వీకరించి.. అదే నెల రెండో వారంలో జ్యూరీ .. అలాగే కమిటీ వివరాలను వెల్లడించనున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. గత మూడు నెలలుగా దీనిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. అలాగే తెలుగు సినిమా రంగానికి మరింత ప్రోత్సాహం అందించేలా రానున్న 20 నుండి 30 రోజుల్లో సింగిల్ విండో విధానాన్ని కూడా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. టీవీ - నాటక రంగానికి కూడా ఇదే తరహాలో అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఏపీ ఎఫ్‌డీసీ ఎండీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. అవార్డులకు సంబంధించిన సంఖ్యాపరమైన వివరాలను వెల్లడించారు. 2012 నుండి 2016 వరకు అవార్డులు ప్రకటించినా పంపిణీ జరగలేదని. ఇందులో చలనచిత్ర రంగానికి సంబంధించి సుమారు 288 అవార్డులు, 51 జ్యూరీ అవార్డులు, అలాగే టీవీ రంగానికి సంబంధించి 330 అవార్డులు, 54 జ్యూరీ అవార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2017-2024 మధ్య కాలానికి ప్రతి ఏటా ఉత్తమ మొదటి, రెండో చిత్రాలతో పాటు రెండు జ్యూరీ అవార్డులను అందించి ఆ తర్వాతి సంవత్సరం నుండి పూర్తిస్థాయిలో అవార్డులను పునరుద్ధరిస్తామని చెప్పారు.

ఈ గొప్ప కార్యక్రమం విజయవంతం కావడానికి చైర్మన్ భరత్ భూషణ్, మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణల తోడ్పాటు ఎంతో ఉందని విశ్వనాథన్ కొనియాడారు. అన్ని విభాగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా ఈసారి నంది ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని అమరావతి లేదా విజయవాడలో.. టీవీ అవార్డుల వేడుకను తిరుపతిలో నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు.