బ్రేకింగ్ న్యూస్ : మాజీ సీఎం నాదెండ్ల కన్నుమూత
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు.
By: Tupaki Political Desk | 22 April 2026 1:12 PM ISTఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 90 ఏళ్లు. నాదెండ్ల కుమారుడు మనోహర్ ప్రస్తుతం ఏపీలో మంత్రిగా పనిచేస్తున్నారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య వంటి దిగ్గజ నేతలతో కలిసి పనిచేశారు.
ఏపీ రాజకీయాల్లో దివంగత నేత నాదెండ్ల భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన భాస్కరరావు 1984లో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాదెండ్ల భాస్కరరావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2019లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం వయోభారంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టుభద్రుడు అయిన నాదెండ్ల భాస్కరరావు కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో 1978లో గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. గెలిచిన తొలిసారే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1982లో ఎన్టీఆర్ తో కలిసి తెలుగుదేశం పార్టీని స్థాపించడంలో నాదెండ్ల భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ పేరు ఎంపిక చేయడంలో ఆయన కృషి ఉందని చెబుతారు.
ఇక 1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే కొన్నాళ్లకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో విభేదించి 1984 ఆగస్టులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ వైద్యం కోసం విదేశాలకు వెళ్ళిన సమయంలో, అప్పటి గవర్నర్ రామ్ లాల్ సహాయంతో భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అలా ఆగస్టు 16, 1984 నుంచి సెప్టెంబర్ 16, 1984 వరకు కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఉమ్మడి ఏపీ 11వ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. భారీ ప్రజా వ్యతిరేకత కారణంగా రాజీనామా చేసి తిరిగి ఎన్టీఆర్ కి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఈ పరిణామాలతో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాదెండ్ల భాస్కరరావు 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.

