Begin typing your search above and press return to search.

ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీలు: PM మోదీ కొత్త 'టాస్క్ ఫోర్స్' విద్యార్థులకు న్యాయం చేస్తుందా?

దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల లీకేజీలు, అవకతవకలపై విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.

By:  Sivaji Kontham   |   27 July 2026 8:37 AM IST
ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీలు: PM మోదీ కొత్త టాస్క్ ఫోర్స్ విద్యార్థులకు న్యాయం చేస్తుందా?
X

దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల లీకేజీలు, అవకతవకలపై విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వంటి పరిణామాల మధ్య ప్రధాని ఈ ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే అక్రమార్కులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. కొత్త చట్టాలను సైతం తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణలో పారదర్శకతను, విశ్వసనీయతను పెంచేందుకు సాంకేతిక రంగానికి చెందిన నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు ఆధునిక సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించడంపై దృష్టి సారిస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రశ్నాపత్రాల భద్రతను పటిష్టం చేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) .. బయోమెట్రిక్ విధానాల ద్వారా మాస్ కాపీయింగ్... ఇతరులతో పరీక్ష రాయించే ఆల్ట్రేషన్లను అరికట్టడం ఈ విధానంలో భాగం కానున్నాయి. అయితే కేవలం డిజిటల్ భద్రత మాత్రమే సరిపోదని... ప్రింటింగ్ ప్రెస్‌లు, లాజిస్టిక్స్ .. స్థానిక కేంద్రాల సిబ్బంది స్థాయిలో జరిగే మానవ లోపాలను, అవినీతిని అరికట్టేందుకు కూడా కఠినమైన ప్రోటోకాల్స్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నందన్ నీలేకని సారథ్యంలోని ఈ కమిటీలో దేశంలోని ఇత‌ర పాపుల‌ర్ రంగాల‌కు చెందిన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కత్వాల్ , లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా ఈ బృందంలో భాగస్వాములుగా ఉన్నారు. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి, UIDAI (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్‌గా భారీ స్థాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను విజయవంతంగా నిర్వహించిన అనుభవం నీలేకనికి ఉంది. సాంకేతిక, భద్రతా , పరిపాలనా రంగానికి చెందిన ఈ దిగ్గజాల అనుభవం పరీక్షల వ్యవస్థ పునరుద్ధరణకు బలమైన పునాది వేస్తుందని భావిస్తున్నారు.

వ్యవస్థాగత మార్పులు సుదీర్ఘ ప్రక్రియ అయినందున... ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తక్షణ విశ్వసనీయతను అందించడం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఇందుకోసం ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలను చేపడుతోంది. లీకేజీలకు పాల్పడే ముఠాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షలు పడేలా చేయడం... పార్లమెంట్‌లో కొత్త చట్టపరమైన నిబంధనలు తేవడం.. మునుముందు అత్యవసర పరీక్షల వద్ద పోలీస్ బందోబస్తు, సెంటర్ వెరిఫికేషన్ వంటి తాత్కాలిక భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయడం ద్వారా విద్యార్థులలో నమ్మకాన్ని నింపే ప్రయత్నం జరుగుతోంది.

సమగ్రమైన సాంకేతిక పరిష్కారాలు వ్యవస్థలోని లోపాలను సరిదిద్దితే.. ప్రభుత్వం తీసుకునే కఠినమైన చట్టపరమైన చర్యలు నేరస్థులలో భయాన్ని కలిగిస్తాయి. నందన్ నీలేకని కమిటీ సిఫార్సులు త్వరితగతిన అమలులోకి వచ్చి... క్షేత్రస్థాయి పర్యవేక్షణతో తోడైనప్పుడే పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు పూర్తిస్థాయి విశ్వసనీయత తిరిగి ఏర్పడుతుంది. కేవలం నివేదికలకే పరిమితం కాకుండా ఈ సంస్కరణలు ఎంత వేగంగా అమలవుతాయనే దానిపైనే విద్యార్థుల భవిష్యత్తు .. వారికి జరిగే న్యాయం ఆధారపడి ఉంటాయి.