నందమూరి వారి కోడలు రాజకీయ ఎంట్రీ...నిజమేనా ?
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు అలాగే వారికి అవసరం అయిన పౌష్టిక ఆహారాన్ని ఆమె అందిస్తున్నారు. ఈ విధంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
By: Satya P | 3 Aug 2026 3:10 PM ISTనందమూరి వారికి రాజకీయాలు కొత్త కాదు. ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల క్రితం అన్న నందమూరి తారక రామారావు వెండి తెర వేలుపుగా ఉంటూ నేరుగా ప్రజల మధ్యకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ పేరుతో కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త రాజకీయ ప్రకంపనలు రేపారు. అది ప్రభంజనం గా మారి తెలుగుదేశం పార్టీ అన్నది ఈ రోజుకీ జనం గుండెలలో గూడు కట్టుకునేలా బలమైన పునాది అపుడే పడింది. ఇక ఎన్టీఆర్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పాలించారు, రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఆ తరువాత ఆయన కుటుంబంలోని వారు అంతా కూడా తమ ఆసక్తిని బట్టి రాజకీయ ప్రవేశం చేశారు.
ముగ్గురు వారసులు :
ఎన్టీఆర్ కుటుంబం నుంచి ముగ్గురు రాజకీయాల్లో ప్రవేశించి ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. 1995లో రవాణా మంత్రిగా చంద్రబాబు కేబినెట్ లో చేరిన ఎన్టీఆర్ మూడవ కుమారుడు హరికృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇక ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ తరఫున రాజకీయ అరంగేట్రం చేసి రెండు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఆ పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉంటూ రాజమండ్రి ఎంపీగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ అయిదవ కుమారుడు నందమూరి బాలక్రిష్ణ కూడా 2014లో రాజకీయ అరంగేట్రం చేశారు, హిందూపురం నుంచి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు.
మనవరాలు సైతం :
ఇక ఎన్టీఆర్ మనవరాలు అంటే హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఒకసారి పోటీ చేశారు. ఆమె తెలంగాణా టీడీపీలో నాయకురాలిగా ప్రస్తుతం ఉన్నారు. మనవడు తారకరత్న రాజకీయాల్లోకి రావాలని ఎంతో ఉబలాట పడ్డారు, ఆయన ఎన్టీఆర్ నాలుగవ కుమారుడు మోహన క్రిష్ణ ఏకైక కుమారుడు. 2023లో లోకేష్ పాదయాత్రలో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురి అయి ఆయన మరణించారు. ఆయనే కనుక బతికి ఉంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యే వారు అని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మరో పేరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు అని గట్టిగా వినిపిస్తోంది.
హరికృష్ణ పెద్ద కోడలుగా :
ఆమె ఎవరో కాదు దివంగత నందమూరి హరికృష్ణ పెద్ద కోడలు దీపిక అని ప్రచారంలో ఉంది. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ సతీమణి అయిన దీపిక తాజాగా ఫ్రెండ్ షిప్ డే న పెట్టిన ఒక మేసెజ్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జానకిరామ్ ని తలచుకుంటూ ఆయనే తనకు మొదటి స్నేహితుడని ఆమె భర్తకు నివాళి అర్పించారు. ఆమె తన భర్త జానకిరామ్ పేరు మీద ట్రస్ట్ ని ప్రారంభించి ఇప్పటికే సామాజిక సేవ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు అలాగే వారికి అవసరం అయిన పౌష్టిక ఆహారాన్ని ఆమె అందిస్తున్నారు. ఈ విధంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
రాజకీయ ఆసక్తి ఉందా :
నందమూరి కుటుంబంలో చాలా మంది తెర వెనక్కే ఉంటారు. వారు ఎక్కడా కనిపించారు. ప్రచారం కోరుకోరు. తమ కుటుంబంలో సినీ నటులు ఉన్నా అలాగే రాజకీయ నేతలు ఉన్నా కూడా పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. ఇక హరికృష్ణ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఉన్నా ఆయన తెర వెనకే ఉండిపోయారు. ఆయన సతీమణిగా దీపిక కూడా అలాగే ఉంటూ వచ్చారు. కానీ ఈ మధ్యనే ఆమె సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటున్నారు. దాంతో ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి ఉందని ప్రచారం మొదలైంది. నందమూరి హరికృష్ణ జానకిరామ్ ల పేరుని నిలబెడుతూ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న దీపిక రాజకీయాల్లోకి వస్తానంటే ఇంట్లోనే పార్టీ ఉంది. కానీ ఆమె ఆలోచనలు అయితే తెలియడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉండటం చూసిన వారు మాత్రం తప్పకుండా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. అదే నిజం అయితే హరికృష్ణ కుటుంబం నుంచి మరో మహిళా నాయకురాలు వచ్చినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఊహాగానాలలో నిజమెంత ఉందో.
