బాలయ్య నామ సంవత్సరం...2025 !
తాజాగా నందమూరి బాలక్రిష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.
By: Satya P | 24 Aug 2025 11:08 PM ISTబాలయ్య అని అంతా ముందుగా పిలుచుకునే నందమూరి బాలక్రిష్ణకు ప్రస్తుతం జాతకంలో మహర్దశ నడుస్తోంది. ఆయన మొత్తం కెరీర్ లో ఎన్నడూ చూడని వరస విజయాలు ఇటీవల కాలంలో దక్కుతున్నాయి. అంతే కాదు ఆయనకు ఏది ముట్టుకున్నా బంగారం అవుతోంది. ఆయనకు ఎపుడో దక్కాల్సిన అవార్డులు అన్నీ ఇపుడు క్యూ కట్టుకుని దక్కుతున్నాయి. బాలయ్య అభిమానులకు ఇవన్నీ పరమానందం కలిగించే విషయాలుగా ఉన్నాయి.
వన్ అండ్ ఓన్లీగా :
తాజాగా నందమూరి బాలక్రిష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. బ్రిటన్ కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనకు గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్ ఇవ్వడం గొప్ప విషయంగా అంతా ప్రశంసిస్త్గున్నారు. . భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ అవార్డుకి ఎంపికైన తొలి నటులు బాలకృష్ణ కావడం మరో విశేషంగా ఉంది. ఆయనకు అరుదైన గౌరవం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
వరసగా అన్నీ :
ఇక 2025 బాలయ్యకు ఎంతగానో కలసివచ్చింది అని అంటున్నారు. ఇదే ఏడాది ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం అందచేసింది. ఇది ఆయన ప్రతిభకు కలికి తురాయి లాంటి గౌరవంగా అంతా భావిస్తున్నారు. పౌర పురస్కారాలలో ఇది రెండవ అవార్డుగా ఉంది. ఇక ఇదే ఏడాదిలో చూస్తే కొద్ది రోజుల క్రితం 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో బాలయ్య నటించి 2023లో విడుదల అయి హిట్ అయిన భగవంత్ కేసరికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా గౌరవం దక్కింది. దీంతో ఇవన్నీ బాలయ్య అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తునాయి.
అలుపెరగని కళా కార్మికుడు :
బాలయ్య విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్ తనయుడు. ఆయన సినీ అరంగేట్రానికి ఇది ఎంతగానో ఉపయోగపడినా ఆ మేరు నగధీరుడి వారసత్వం అన్న భారాన్ని మోయడం చాలా కష్టం. తండ్రికి తగిన తనయుడిగా జనం చేత మెప్పు పొందాలి అంటే అది ఎంతటి టఫ్ జాబ్ అన్నదో అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య తన నిత్య కృషితో సినిమాల మీద పాత్రల మీద తనకు ఉన్న అభిమానంతో ఈ ఫీట్ ని సాధించారు. ఈ రోజున బాలయ్య తండ్రికి తగిన తనయుడుగా సినీ సీమలో నిలిచి అందరి మెప్పుని సంపాదించుకున్నారు.
అంతే కాదు ఆయన అలుపు ఎరగని కళా కార్మికుడు. దాదాపుగా యాభై ఏళ్ళకు పైగా ఆయన సినిమా రిలీజ్ కాని క్యాలెండర్ ఇయర్ లేదు అంటే బాలయ్య షూటింగులలో ఎంత బిజీగా ఉంటారో అర్ధం అవుతుంది. ఒక విధంగా ఈ తరం నటులకు ఆయన ఎంతో స్పూర్తి. సినిమాల పట్ల తనకు ఉన్న ప్రేమను ఈ రోజుకీ అలాగే ఉంచుకుంటూ తెలుసు సినీ పరిశ్రమకు ఆయన అందిస్తున్న సహకారం చేస్తున్న కృషికి అవార్డులు సరైన సమయంలో వస్తున్నాయని అంటున్నాయి అని అంటున్నారు.
అవర్ డియర్ బాలయ్య అంటూ :
తాజాగా బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్ గౌరవం దక్కడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. అవర్ డియర్ బాలయ్య అని ఆయన కితాబు ఇచ్చారు. బాలయ్య సినీ రంగానికి ఎంతో సేవ చేశారని అయిదు తరాలకు ఆయన తనదైన నటనల్తో వినోదాన్ని పంచి ఇచ్చారని బాబు గుర్తు చేశారు. ఇక బాలయ్యకు ఈ గౌరవం లభించడం గొప్ప విషయం అని సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు ఇటీవలే హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటన్ కు చెందిన ప్రతిష్టాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ఆయనకు ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ ఇవ్వడం గ్రేట్ అన్నారు.
