హైదరాబాద్ లోనే కాదు బెజవాడలోనూ డాక్టర్ నమ్రత లీలలు!
అయితే.. డాక్టర్ నమ్రత పాపాలు ఒక రేంజ్ లో ఉన్నాయని ఆమెకు వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా తప్పుడు పనుల నెట్ వర్కు ఉందన్న వాదన వినిపిస్తోంది.
By: Garuda Media | 30 July 2025 11:23 AM ISTమీకు పిల్లల్లేరా? ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టటం లేదా? మరేం ఫర్లేదు. పిల్లలు పుట్టటం లేదన్న వేదన వద్దు. మా దగ్గరకు వస్తే.. మేమిచ్చే ట్రీట్ మెంట్ తో మీకు పక్కాగా పిల్లలు అంటూ పదే పదే అందమైన మాటల్ని చెప్పే ఫెర్టిలిటీ సెంటర్లకు తెలుగు రాష్ట్రాల్లో కొదవ లేదు. అయితే.. అన్ని కావు కానీ కొన్ని సెంటర్లు చేసే పాపాలు.. ఘోరాల చిట్టా అత్యంత దారుణంగా ఉంటాయన్నది మర్చిపోకూడదు. మూడు రోజుల క్రితమే హైదరాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పాపం బయటకు రావటం.. డాక్టర్ నమ్రత ఎలియాస్ నీరజ పాపం పండి.. ఆమె చేసిన తప్పుడు పని బయటకు వచ్చి అవాక్కు అయ్యేలా చేసింది.
సరగోసి అని చెప్పి.. సంబంధం లేని పిల్లాడ్ని దంపతుల చేతులో పెట్టి.. మీ బిడ్డేనంటూ మాయ చేసిన మోసం వెలుగు చూడటం.. పోలీసుల విచారణలో మరిన్ని దారుణాలు బయటకు వచ్చాయి. అయితే.. డాక్టర్ నమ్రత పాపాలు ఒక రేంజ్ లో ఉన్నాయని ఆమెకు వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా తప్పుడు పనుల నెట్ వర్కు ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు చెందిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఒకటి విజయవాడలో ఉంది. ఆ సెంటర్ లో అరాచకాలు తాజాగా వెలుగు చూశాయి.
కొన్నేళ్ల క్రితం డాక్టర్ నమ్రత తమను మోసం చేశారని.. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయటమే కాదు.. తమ ఆరోగ్యం దెబ్బ తిన్నట్లుగా నలుగురు మహిళలు సూర్యారావు పేట పోలీసులకు కంప్లైంట్ చేయటం.. కేసులు నమోదైన వైనం వెలుగు చూసింది. మరి.. ఇంత తీవ్ర ఆరోపణలు వచ్చినా.. వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు పట్టించుకోలేదు? అన్నది ఇప్పుడు ప్రశ్నగామారింది.
అంతేకాదు.. విజయవాడలో మరో పేరుతో కూడా ఒక ఫెర్టిలిటీ సెంటర్ ను ఆమె నడుపుతున్న వైనం వెలుగు చూసింది. ఆమె తప్పుడు పనులు చేస్తున్నట్లుగా కేసులు నమోదైన తర్వాత తెరిచిన ఈ సెంటర్ పేరు కూడా సృష్టి పేరు మీదే ఉండటం.. దానికి డాక్టర్ నమత్రతాస్ సృష్టి.. ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరుతో బోర్డు పెట్టి నడిపిస్తున్నా అధికారుల కళ్లకు ఎందుకు కనిపించలేదు? అన్నది ఇప్పుడు ప్రశ్న. హైదరాబాద్ లో నడుపుతున్న సెంటర్ కు ప్రభుత్వ అనుమతి లేదన్న విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తేలిస్తే.. ఆమెకు చెందిన మరో సెంటర్ విశాఖపట్నంలోనూ ఉంది. దానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదన్న విషయం తాజాగా వెలుగు చూసింది.
నమత్ర నెట్ వర్కు ఎంత పెద్దదంటే.. ఆమెకు సికింద్రాబాద్.. విజయవాడ.. విశాఖపట్నం.. కోల్ కతా.. ఒడిశాలలోనూ సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నట్లుగా తేలింది. పిల్లల కోసం తపించే వారి బలహీనతను ఆయుధంగా చేసుకొని.. తప్పుడు మాటలతో మోసం చేసే డాక్టర్ నమ్రత లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. గతంలోని కేసుల విచారణ ఎక్కడ వరకు వచ్చింది? ఆమెపై చర్యల విషయంలో అధికారులు చూసి చూడనట్లు ఎందుకు ఉంటున్నారు? అన్న అంశంపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టాల్సి ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
