Begin typing your search above and press return to search.

బెంగళూరు మెట్రో 'లారీ సర్వీస్': ఐటీ ఉద్యోగులకు నయా అడ్వెంచర్!

మంగళవారం సాయంత్రం కబ్బన్ పార్క్ స్టేషన్ వద్ద మెట్రో కాస్త అలసిపోయి 'విశ్రాంతి' తీసుకోవడంతో వేలాది మంది ప్రయాణికులు రోడ్లపైకి వచ్చి సరికొత్త సాహసాలు చేయాల్సి వచ్చింది.

By:  A.N.Kumar   |   24 Jun 2026 2:14 PM IST
బెంగళూరు మెట్రో లారీ సర్వీస్: ఐటీ ఉద్యోగులకు నయా అడ్వెంచర్!
X

ఐటీ హబ్‌గా, స్టార్టప్‌ల రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతున్న నమ్మ బెంగళూరు... ట్రాఫిక్ కష్టాల్లో మాత్రం ఎప్పుడూ 'నెంబర్ వన్' అని నిరూపించుకుంటూనే ఉంటుంది. అయితే రోడ్లపై ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి "మాకు మెట్రో ఉంది కదా!" అని గర్వంగా చెప్పుకునే బెంగళూరు వాసుల ఆశలపై 'పర్పుల్ లైన్' మరోసారి నీళ్లు చల్లింది. మంగళవారం సాయంత్రం కబ్బన్ పార్క్ స్టేషన్ వద్ద మెట్రో కాస్త అలసిపోయి 'విశ్రాంతి' తీసుకోవడంతో వేలాది మంది ప్రయాణికులు రోడ్లపైకి వచ్చి సరికొత్త సాహసాలు చేయాల్సి వచ్చింది.

సాంకేతిక లోపం... సాఫ్ట్‌వేర్ బాబుల అవస్థలు

సాయంత్రం కరెక్ట్‌గా 6:30 గంటలు. ఆఫీస్ లాప్‌టాప్‌లు క్లోజ్ చేసి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని మెట్రో ఎక్కిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కబ్బన్ పార్క్ వద్ద ట్విస్ట్ ఎదురైంది. టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసించే ఐటీ సిటీలో... మెట్రో సాంకేతిక లోపంతో మొరాయించింది. వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్ వైపు వెళ్లాల్సిన రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో అధికారులు ప్రయాణికులను "దయచేసి దిగండి" అంటూ సాగనంపారు. దాంతో స్టేషన్లన్నీ క్షణాల్లో తిరుమల క్యూ లైన్లను తలపించాయి.

క్యాబ్‌లు లేవు... ఆటోలు రావు... లారీలే మా శరణ్యం!

మెట్రో ఎలాగో హ్యాండ్ ఇచ్చింది, పోనీ క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకుందాం అంటే... డిమాండ్ దెబ్బకు యాప్‌లలో రేట్లు అంతరిక్షాన్ని తాకాయి. రేట్లు భరించలేక, ఉన్న వాహనాలు దొరక్క విసిగిపోయిన ప్రయాణికులు... చివరకు రూట్ మార్చారు.

సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్

"మెట్రో ఎక్కితే ఇంట్లోకి... లారీ ఎక్కితే గమ్యానికి!" అంటూ ఐటీ ఉద్యోగులు గుంపులు గుంపులుగా రోడ్లపై వెళ్లే లారీలు, ట్రక్కులు, టిప్పర్లను ఆపి, వాటిపైకి ఎక్కి ప్రయాణించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. కోట్ల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇలా లారీ బాడీల్లో నిలబడి ప్రయాణించడం చూసి "ఇదా మన గ్లోబల్ సిటీ రేంజ్?" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

'థర్డ్ వరల్డ్' పాలన అంటూ ఎంపీ ఫైర్!

ఈ రచ్చపై బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వీ సూర్య సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్లు వేశారు. "ప్రపంచ స్థాయి టెక్నాలజీ ప్రతిభ ఉన్న మన నగరానికి, మూడో ప్రపంచ దేశాల తరహా పాలన దక్కింది. ప్రతిసారీ మెట్రో ఆగిపోతే నగరం మొత్తం ఎందుకు అస్తవ్యస్తమవుతోంది? ఐటీ ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ఇళ్లకు వెళ్లాల్సి రావడం సిగ్గుచేటు" అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అధికారులు ఏమన్నారంటే..?

మెట్రో ముచ్చట్లు ఇలా ఉంటే అధికారులు మాత్రం "మేము రాత్రంతా నిద్రపోకుండా కష్టపడ్డాం" అని చెప్పుకొచ్చారు. రాత్రికి రాత్రే మరమ్మతులు పూర్తి చేసి బుధవారం ఉదయం 5 గంటలకల్లా పర్పుల్ లైన్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తెచ్చామని ప్రకటించారు.

నగరవాసుల మనోగతం

"సరే సార్.. ఉదయం సేవలు పునరుద్ధరించారు బాగానే ఉంది. కానీ మళ్లీ ఈ రోజు సాయంత్రం ఆఫీస్ వదిలే సమయానికి మీ మెట్రో 'హ్యాంగ్' అవ్వదు కదా?" అని ప్రయాణికులు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా బెంగళూరు మెట్రో పుణ్యమా అని ఐటీ ఉద్యోగులకు ఒక మంచి 'ట్రక్ రైడింగ్' ఎక్స్‌పీరియన్స్ అయితే దొరికిందనే చెప్పాలి.