Begin typing your search above and press return to search.

రాజ్ భవన్ లోకి నల్లారి వారి ప్రవేశం ఎపుడు ?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం. చివరి సీఎం గా కూడా ఆయనకే రికార్డు ఉంది.

By:  Satya P   |   14 Oct 2026 8:00 AM IST
రాజ్ భవన్ లోకి నల్లారి వారి ప్రవేశం ఎపుడు ?
X

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం. చివరి సీఎం గా కూడా ఆయనకే రికార్డు ఉంది. మొత్తం రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ లోనే అధికార పదవులు అందుకుంటూ సాగింది. సీఎం గా పనిచేసిన తరువాత ఆయన రాజకీయ దశ ఏ మాత్రం తిరగలేదు. అంతే కాదు రాజకీయంగా టర్నింగ్ పాయింట్ ఏదీ లేకుండా పోయింది. సొంత పార్టీ అంటూ జై సమైక్యాంధ్రా పేరుతో విభజన ఏపీలో కొంత హడావుడి చేసినా మళ్లీ కాంగ్రెస్ లో చేరినా ఆ తరువాత బీజేపీలోకి వచ్చినా రాజకీయ కిరణాలు మాత్రం పరచుకోవడం లేదు, కొత్త వెలుగు అయితే ఎక్కడా కనిపించడం లేదు. విశేష రాజకీయ అనుభవం ఉంది, పాలనాపరమైన దక్షత ఉంది. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారిగా గుర్తింపు ఉంది. వివాదరహితుడిగా మంచి పేరు ఉంది. అన్ని ఉన్నా కూడా రాజకీయ సిరి మాత్రం ఇంకా పలకరించడం లేదని అంటున్నారు.

ఆరుగురిలో లేరు :

లేటెస్ట్ గా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను ప్రకటించింది. అందులో చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఎక్కడా లేరు. వారంతా బీజేపీకి చెందిన వారే కావడం విశేషం. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వారు కాదా అంటే ఆయన కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతగానే కాషాయం పార్టీలో గుర్తిస్తారు అని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వారికి అసలైన బీజేపీ నేతలకే కమలం పార్టీలో అధిక ప్రాధాన్యత అని చెబుతారు. పైగా బీజేపీ రాజ్ భవన్ లలో ప్రవేశించే గవర్నర్లను కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది అని గుర్తు చేస్తున్నారు. బీజేపీ ఫిలాసఫీ పూర్తిగా ఒంటబట్టించుకున్న వారికే ప్రయారిటీ అని కూడా చెబుతున్నారు.

మైనస్ అక్కడే మరి :

సరిగ్గా ఇక్కడే కిరణ్ కుమార్ రెడ్డికి మైనస్ అవుతోంది అని అంటున్నారు. ఆయన బేసికల్ గా చూస్తే కాంగ్రెస్ వాది. ఆయన తండ్రి నుంచి కాంగ్రెస్ వాదమే ఉంది. దాంతోనే ఆయనను బీజేపీలోకి చేర్చుకున్నా కూడా కీలక పదవుల దగ్గరకు వచ్చేసరికి ఈ అంతరాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ సీటు ఇచ్చారు. అది ఆయన సొంత ఇలాకా. అయినా ఆయన కూటమి ప్రభంజనంలో సైతం ఓటమి పాలు అయ్యారు. దాంతో బీజేపీ పెద్దలకు ఆయన మీద ఉన్న గట్టి నమ్మకాలు కొంత సడలిపోయాయని అంటున్నారు. బీజేపీ ఎపుడూ ఫలానా వారికి పదవి ఇస్తే ఏమిటి రాజకీయ లాభం అని లెక్కలు వేసుకుంటుంది అని చెబుతున్నారు. కేవలం బీజేపీ మాత్రమే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా అదే చూస్తుంది అని అంటున్నారు.

టచ్ లో ఉన్నా కూడా :

ఇక కిరణ్ కుమార్ రెడ్డి మొదట్లో రాజ్య సభకు వెళ్లాలని చూశారు. అలా పెద్దల సభ నుంచి నేరుగా కేంద్ర మంత్రి పదవిని పట్టాలని అనుకున్నారు. అయితే బీజేపీలో సమీకరణలకు అది కుదరదు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. తనకు ఉన్న అనుభవంతో రాజకీయాల్లో సీనియారిటీతో మాజీ సీఎం హోదాతో గవర్నర్ పదవి అయితే బెటర్ అని భావించారు. దాంతో ఆయన రాజ్ భవన్ వైపే ఆశగా చూస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఢిల్లీలో బీజేపీ కేంద్ర పెద్దలకు ఆయన టచ్ లో ఉంటున్నారు అని చెబుతున్నారు. అలాగే ఏపీలో కూటమి సారధి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలను కూడా ఆయన బాగానే నెరుపుతున్నారు. అయినా సరే అనుకున్నది మాత్రం సాధించడంతో ఆయన వెనకబడుతున్నారనీ అంటున్నారు.

వారి దయ మాత్రమే :

ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్ భవన్ యోగం ఉందా అంటే అదంతా బీజేపీ పెద్దల దయ అని అంటున్నారు. కేంద్ర నాయకత్వం అయితే అన్నీ ఆచీ తూచీ ఎంపిక చేస్తోంది. దాంతో కిరణ్ కుమార్ విషయంలో వారు సానుకూల నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆయన మరో విడతలో అయినా గవర్నర్ నల్లారి వారు అవుతారు. మరి ఆ రోజు ఎపుడు వస్తుందో తెలియదు, అంతవరకూ కిరణ్ కుమార్ రెడ్డి వేచి ఉండడమే అని అంటున్నారు అంతా.