Begin typing your search above and press return to search.

రైతు రుణ మాఫీ...జగన్ పవర్ ఫుల్ ఆయుధం ?

వచ్చే ఎన్నికల్లో రైతు రుణ మాఫీని వైసీపీ ఒక కీలక హామీగా జనం ముందుకు తేనుందా అంటే దాని మీద ప్రచారం అయితే సాగుతోంది.

By:  Satya P   |   23 Sept 2026 9:00 AM IST
రైతు రుణ మాఫీ...జగన్ పవర్ ఫుల్ ఆయుధం ?
X

వచ్చే ఎన్నికల్లో రైతు రుణ మాఫీని వైసీపీ ఒక కీలక హామీగా జనం ముందుకు తేనుందా అంటే దాని మీద ప్రచారం అయితే సాగుతోంది. ఏపీలో రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఈ కీలక హామీ ఇస్తే 2029 లో అధికారం ఫ్యాన్ పార్టీదే అని వైసీపీ నాయకులు అయితే బలంగా నమ్ముతున్నారు. 2029 ఎన్నికలకు 2019 హామీలతో వెళ్తే లాభం లేదని కొత్త హామీలను ఇవ్వాల్సిందే అని వైసీపీలో వాదిస్తున్న నాయకులు ఎక్కువగా ఉన్నారని భోగట్టా. అంతే కాదు కీలకమైన వర్గాలను చేరువ చేయడానికి మరిన్ని హామీలతో వైసీపీ మేనిఫేస్టో తయారు కావాలని సూచిస్తున్నారు.

అతి పెద్ద వర్గంగా :

ఏపీ ప్రధానంగా వ్యవసాయిక రాష్ట్రం. రైతులు చూస్తే అరవై లక్షల మంది దాకా ఉన్నారు. ఇక ఏపీ ఆర్థిక వ్యవస్థలోనూ ప్రజల జీవనోపాధిలోనూ వ్యవసాయ రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. మొత్తం అరవై లక్షల మంది రైతులలో అత్యధిక భాగం చిన్న సన్నకారు రైతులే కావడం గమనార్హం. ఇక రైతు కుటుంబాలకు అండగా ఉండాలన్నది వైసీపీలో వినిపిస్తున్న మాట. రైతులకు వైఎస్సార్ ఉచిత విద్యుత్ తో పాటు ఇతర ఆర్ధిక భరోసాను కల్పించి మేలు చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ భరోసాతో హామీ ఇచ్చి అమలు చేసారని చెబుతున్నారు. ఇపుడు చూస్తే మరింతగా ముందుకు వెళ్ళి రైతులను ఆదుకోవాల్సి ఉందని అంటున్నారు. దీని వల్ల వైసీపీ రైతు మద్దతు పార్టీ అన్న బలమైన ముద్ర వేసుకునే చాన్స్ ఉంటుందని అంటున్నారు.

టీడీపీకి రెండవ వైపు :

ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి పెట్టుబడులు అభివృద్ధి పేరుతో భూములను సేకరిస్తోందని అలాగే రైతులు కూటమి పాలన విషయంలో అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక టీడీపీ అభివృద్ధి అంటే వైసీపీ వ్యవసాయక రాష్ట్రంగా ఏపీని ముందుకు తీసుకుని వెళ్ళే అజెండాను అమలు చేయడమే మేలైన విధానం అని కూడా చెబుతున్నారు. ఇది ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ ని చూపించేదిగా ఉంటుందని అంటున్నారు. ఎంత చేసినా ఎన్ని పెట్టుబడులు వచ్చినా వ్యవసాయం అందించే ఉపాధి వేరు అని అంతే కాకుండా ఏపీకి అదే ఎప్పటికీ ఎక్కువ జీవనోపాధి వ్యవసాయం కాబట్టి ఆ రైతాంగాన్ని మచ్చిక చేసుకోవాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు.

రెండు లక్షల రుణమాఫీ :

ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రైతు రుణ మాఫీగా రెండు లక్షల రూపాయలు పేర్కొంటూ జనంలోకి వెళ్ళాలని జగన్ కి సూచించారు. దీని వల్ల రైతాంగానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో రైతుల పరిస్థితి బాగా లేదు, వారంతా వ్యవసాయం కోసం అప్పులు చేసి తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. దీని మీద తానే స్వయంగా జగన్ ని కలిసి మాట్లాడుతాను అని అంటున్నారు.

హిట్ అవుతుందని ధీమా :

ఇక రైతు రుణ మాఫీ అన్నది అతి పెద్ద ఆర్థిక కార్యక్రమం. అయితే ఇది ఈ సమయంలోనే హామీగా వైసీపీ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఎల్ నినోతో ఏపీలో రైతాంగం మొత్తం ఇబ్బందులో ఉంది. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. దాంతో 2027లో పాదయాత్రకు వెళ్ళే జగన్ ఈ మేరకు అతి పెద్ద హామీ ఇస్తే అది ఎన్నికల ముందు రైతులను ఆకర్షిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఎల్ నినో దెబ్బ రైతులకు రెండు మూడేళ్ళ పైదాకా ఉంటుందని అందువల్ల రుణ మాఫీ వారి పాలిట సంజీవిని అవుతుందని వైసీపీని అధికారంలోకి తెస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి దీని మీద జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.