Begin typing your search above and press return to search.

నేను చ‌చ్చిపోతే.. 'స‌స్పెండెడ్ డీఎస్పీ' అని రాయొద్దు: న‌ళిని క‌న్నీటి లేఖ‌

తాజాగా ఆమె త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకున్న సుదీర్ఘ లేఖ తెలంగాణ స‌మాజంలో చ‌ర్చ‌నీయాంశం అయింది.

By:  Garuda Media   |   22 Sept 2025 10:34 AM IST
నేను చ‌చ్చిపోతే.. స‌స్పెండెడ్ డీఎస్పీ అని రాయొద్దు:  న‌ళిని క‌న్నీటి లేఖ‌
X

డీఎస్పీ న‌ళిని!. ఈ పేరు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో డీఎస్పీగా ఉన్న న‌ళిని.. నాటి పోరా టానికి మ‌ద్ద‌తుగా త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. తొలిసారి ఆమోదం పొంద‌క‌పోవ‌డంతో రెండోసారి ఆమె రాజీనామా చేసి రాష్ట్ర సాధ‌న‌కు కృషి చేశారు. రాష్ట్రం అయితే.. సిద్ధించింది. కానీ, న‌ళిని ఉద్యోగ‌మే కాదు.. ఆమె జీవితం కూడా యూట‌ర్న్ తీసుకుంది. కేసీఆర్ హ‌యాంలో అస‌లు న‌ళినిని ప‌ట్టించుకున్న దిక్కేలేదు. ఇక‌, సీఎంగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. అనూహ్యంగా ఓ రోజు ఆమె ఆయ‌న‌ను క‌లుసుకుంది. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎప్పుడూ న‌ళిని ప్ర‌స్తావ‌న రాలేదు.

తాజాగా ఆమె త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకున్న సుదీర్ఘ లేఖ తెలంగాణ స‌మాజంలో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ సంద‌ర్భం గా న‌ళిని అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు. త‌న ఉద్యోగ జీవితం నుంచి ప్ర‌స్తుత ప‌రిస్థితి వ‌ర‌కు ప్ర‌తి మ‌లుపులో జ‌రిగిన అవ‌మా నాన్ని, అన్యాయాన్ని కూడా ఆమె వివ‌రించారు. అలాగ‌ని ఎవ‌రినీ జాలి ప‌డ‌మ‌ని కానీ, బాధ‌ప‌డ‌మ‌ని కానీ ఆమె కోరుకోలేదు. ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్న తాను.. మ‌రికొన్ని రోజుల్లోనే క‌న్నుమూయ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. త‌న‌కు తెలంగాణ స‌మాజం ఉద్యోగం ఇచ్చింద‌ని, కానీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు త‌న‌కు వెన్నుపోటు పొడిచాయ‌ని వివ‌రించారు.

''ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది.`` అని ప్రారంభించిన న‌ళిని పోస్టు.. క‌న్నీరు పెట్టిస్తోంది. నెల రోజులుగా త‌న ఆరోగ్యం సీరియస్ గా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్న‌ట్టు వివ‌రించారు. గ‌త ఎనిమిదేళ్ల కింద‌ట సోకిన విలక్షణ కేన్స‌ర్‌, గత రెండు నెలలుగా టైపాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్‌ల‌ వల్ల తీవ్ర స్థాయికి చేరిందన్నారు. ప్ర‌స్తుతం చికిత్స చేయించుకునే స్థోమ‌త కూడా త‌న‌కు లేద‌న్నారు. ``25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది.'' అని వివ‌రించారు.

ఇక‌, త‌న గతమంతా వ్యధ భరితమ‌ని న‌ళిని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల త‌న‌ నిలువెల్లా గాయాలే అయ్యాయని తెలిపారు. ''రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను.'' అని న‌ళిని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం యజ్ఞ బ్రహ్మగా, వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగిన‌ట్టు తెలిపారు. తాను రాజీనామా చేసిన త‌ర్వాత ఇవ్వాల్సిన అల‌వెన్సులు 2 కోట్ల రూపాయ‌లు ఉంటాయ‌ని వాటిని కూడా ఎగ్గొట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అనేక సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వానికి మొర పెట్టుకున్నా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేద‌న్నారు. ''నేను చ‌నిపోవ‌డం ఖాయం. కొన్ని రోజులు మాత్ర‌మే. మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చనిపోయాక‌.. `సస్పెండెడ్ ఆఫీసర్` అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేర‌వ‌ద్దు. బ‌తికుండగా నన్ను పట్టించుకొని వారు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.`` అని న‌ళిని విన్న‌వించారు. ఇక‌, త‌న పేరుతో ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలాన్ని రాసిన‌ట్టు వివ‌రించారు. ``నా జీవితపు అంతిమ లక్ష్యమైన `మోక్ష` సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను.`` అని న‌ళిని పేర్కొన్నారు.