Begin typing your search above and press return to search.

అయ్యో: గణపతి పూజ కోసం పంతం.. మనస్తాపంతో పురోహితుడి మృతి

అయ్యో అనిపించే ఉదంతం ఒకటి వినాయక చవితి సందర్భంగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మీడియా కారణంగా వెలుగు చూసింది.

By:  Garuda Media   |   16 Sept 2026 9:40 AM IST
అయ్యో: గణపతి పూజ కోసం పంతం.. మనస్తాపంతో పురోహితుడి మృతి
X

అయ్యో అనిపించే ఉదంతం ఒకటి వినాయక చవితి సందర్భంగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మీడియా కారణంగా వెలుగు చూసింది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే దేవుడి పూజ దగ్గర ఈ పంతాలు.. పట్టింపులు ఏంటి? అన్నది ప్రశ్న. అధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంతో దురుసుగా వ్యవహరించటమే కాదు.. 65 ఏళ్ల వయసున్న పురోహితుడికి తీవ్ర మనస్తాపానికి గురి చేసేలా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. ఆయన మరణానికి కారణం ఈ పంతమే అన్నదిప్పుడు చర్చగా మారింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఉదంతంలోకి వెళితే..

నల్గొండ జిల్లా చింతపాలెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా పలు మండపాల్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన 65 ఏళ్ల దత్తుప్రసాద్ స్థానిక రామాలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో పౌరహిత్యం వహిస్తున్నారు. వినాయకచవితి పండుగ సందర్భంగా గ్రామంలో ఆరుచోట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. సోమవారం (పండుగరోజు ఉదయం) రామాలయంలో పూజాదికాలు పూర్తి చేసిన తర్వాత.. మండపాల్లో పూజలు చేసేందుకు దత్తుప్రసాద్ సమాయుత్తమవుతుున్నారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రవి.. పున్నయ్యలు ఆలయం వద్దకు చేరుకొని.. తమ మండపంలోనే మొదటి పూజ చేయాలంటూ వాదనలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మొదలైన వాదన కాస్తా తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో వారిని సర్దుబాటు చేసేందుకు దత్తుప్రసాద్ ప్రయత్నించారు. ఆవేశంతో ఉన్న వారు ఆయన్ను తోసేశారు. దీంతో.. కిందపడిపోయిన ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో.. గణేష్ మండపాల వద్ద తాను పూజలు నిర్వహించలేనని చెప్పి ఆలయం వద్దే కూర్చుండిపోయారు.

దీంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు పూజారి దత్తుప్రసాద్ కు నచ్చజెప్పి.. వాగ్వాదానికి దిగిన యువకులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద పూజ చేయించేందుకు తీసుకెళ్లారు. ఏ యువకుల కారణంగా ఆయన మనస్తాపానికి గురయ్యారో.. చివరకు వారి మండపాల్లోనే పూజ చేయటానికి ఆయన వెళ్లాల్సిన రావటం ఆయనకు తీవ్ర మనో వేదనకు గురి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మండపంలో పూజ నిర్వహిస్తున్న క్రమంలో ఆయన కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు ఆయన్ను నాగార్జునసాగర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలని పూజ చేయాల్సిన పురోహితుడికి మనస్తాపానికి గురి చేసిన వైనం అందరిని కలిచివేసేలా చేసింది.