Begin typing your search above and press return to search.

కేంద్రం నుంచి వెయ్యి కోట్లు: బీజేపీ నేత‌లకంటే మంత్రికెలా తెలిసింది?

తెలంగాణలోని ఫ్లోరైడ్ ప్ర‌భావిత న‌ల్ల‌గొండ జిల్లాకు కేంద్ర ప్ర‌భుత్వం 1000 కోట్ల రూపాయ‌ల‌ను ఇస్తోంద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

By:  Garuda Media   |   3 Aug 2026 8:00 PM IST
కేంద్రం నుంచి వెయ్యి కోట్లు: బీజేపీ నేత‌లకంటే మంత్రికెలా తెలిసింది?
X

తెలంగాణలోని ఫ్లోరైడ్ ప్ర‌భావిత న‌ల్ల‌గొండ జిల్లాకు కేంద్ర ప్ర‌భుత్వం 1000 కోట్ల రూపాయ‌ల‌ను ఇస్తోంద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి ఈ విష‌యాన్ని బీజేపీ నేత‌లు కానీ.. కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డికానీ ప్ర‌క‌టించాల్సి ఉంది. కానీ..వారెవ‌రూ స్పందించ‌కుండానే.. ప‌న్నెత్తు మాట కూడా ప్ర‌క‌ట‌న చేయ‌కుండానే.. మంత్రి కోట‌మిరెడ్డి ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. న‌ల్ల‌గొండ‌కు నిధులు రావ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌డం లేదు. కానీ, రాజ‌కీయంగా ఏం జ‌రుగుతోంద‌న్న‌దే కీల‌కంగా మారింది.

న‌ల్ల‌గొండ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ డెవ‌ల‌ప్‌మెంటు కోసం కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే వెయ్యి కోట్ల రూపాయ‌ల నిధులు ఇవ్వ‌నుంద‌ని.. కోమ‌టి రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. ఇది ఆయ‌న సొంత జిల్లా కావ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసిన ఆయ‌న‌.. జిల్లా అభివృద్ధి, ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్ర‌భావిత గ్రామాల్లో వాట‌ర్.. వంటి అంశాల‌పై స్థానికంగా నాయ‌కుల నుంచి వ‌చ్చిన సూచ‌న‌లు, అభిప్రాయాల‌ను ఆయ‌న ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగానే త్వ‌ర‌లోనే కేంద్రం 1000 కోట్లు ఇవ్వ‌నుందని చెప్పారు. ఈ నిధుల‌తో న‌ల్ల‌గొండ ఎదుర్కొంటున్న సుదీర్ఘ‌కాల స‌మ‌స్య‌లు ఒక్క‌సారిగా ప‌రిష్కారం అవుతాయ‌ని చెప్పారు.

ఎలా తెలిసింది?

వాస్త‌వానికి కేంద్రం నుంచి ఏదైనా ఇలాంటి స‌మాచారం ఉంటే.. ముందుగా బీజేపీ నాయ‌కుల‌కు తెలియాలి. పోనీ.. కేంద్ర మంత్రులుగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంజ‌య్‌, కిష‌న్ రెడ్డిల‌కైనా తెలిసి ఉండాలి. దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, మంత్రికి ఎలా తెలిసింద‌న్న‌ది ప్ర‌శ్న‌. అంతేకాదు.. దీనిలో నిజం లేకుండా పోద‌న్న వాద‌న ఉంది. అయితే.. ఇంత పెద్ద మొత్తం ఇచ్చే స‌మ‌యంలో కేంద్రం రాజ‌కీయంగా ఎందుకు వాడుకోద‌న్న‌ది ప్ర‌శ్న‌. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా అధికారంపైనే దృష్టిపెట్టిన బీజేపీ.. ఈ స్థాయిలో నిధుల‌ను ఇచ్చేప్పుడు.. ఖ‌చ్చితంగా దీనిపై ప్ర‌చారం చేసుకుంటుంది. కానీ.. మంత్రి కోమ‌టి రెడ్డి ప్ర‌క‌టించ‌డం, దీనిపై బీజేపీ నేత‌లు మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇదొక్క‌టే కాదు..

ఇక‌, తెలంగాణ బీజేపీ నాయ‌కులు చాలా విష‌యాల్లో వెనుక‌బ‌డ్డారన్న వాద‌న ఉంది. ప్ర‌ధాని స్వ‌యంగా ఖ‌మ్మం-దేవ‌ర‌ప‌ల్లి అనుసంధాన ర‌హ‌దారి ప్రాజెక్టును ప్రారంభించిన‌ప్పుడు కూడా వారు వినియోగించుకోలేకపోయారు. క‌నీసం దీనిపై ప్ర‌చారం కూడా చేయ‌లేదు. ఇదేకాదు.. ఫ్యూచ‌ర్ సిటీని అనుసంధానిస్తూ.. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్టు వ‌ర‌కు నిర్మిస్తున్న ఆరు లేన్ల ర‌హ‌దారికి కేంద్రం అనుమ‌తించిన విష‌యం.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పే వ‌ర‌కు బీజేపీ నాయ‌కుల‌కు తెలియ‌లేదు. మెట్రో ప్రాజెక్టును ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్నాక కానీ.. మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించ‌లేక‌పోయారు. సింగ‌రేణి బొగ్గుగ‌నుల వ్య‌వ‌హారం ర‌చ్చ అయ్యే దాకా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ఇలా.. అనేక విష‌యాల్లో బీజేపీ నాయ‌కులు వెనుక‌బ‌డ‌డం.. రాజ‌కీయంగా పుంజుకోలేక పోవ‌డం గ‌మ‌నార్హం.