నక్కపల్లి స్టీల్ సిటీ.. ఎక్కడి వరకు వచ్చిందంటే..!!
అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో నిర్మిస్తున్న ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
By: Tupaki Political Desk | 15 Sept 2026 1:05 PM ISTఅనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో నిర్మిస్తున్న ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్దది అయిన గ్రీన్ ఫీల్డ్ మెగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ఈ ఏడాది మార్చిలో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్టీల్ ప్లాంట్ ను నిర్దేశించిన గడువులోగా నిర్మించాలని ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం సైట్ క్లియరెన్స్ పనులు దాదాపు కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. శంకుస్థాపన జరిగిన కొన్నిరోజులకే ప్లాంట్ యాజమాన్యం భారీ నిర్మాణ సామగ్రిని తరలించడంతో రికార్డు సమయంలోనే గ్రౌండ్ క్లియరెన్స్ పూర్తయినట్లు చెబుతున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ ఉక్కు దిగ్గజాలైన ఆర్సెలార్ మిట్టల్ - నిప్పన్ స్టీల్ సంయుక్తంగా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నాయి. గత మార్చి 23, 2026న ఈ భారీ పరిశ్రమకు అధికారికంగా శంకుస్థాపన జరగగా, నాటి నుంచి పనులు వేగవంతమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. మొదటి దశలో రూ.70,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్లాంట్ పూర్తయితే తొలివిడతలో ఏడాదికి 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. మొత్తం ప్రాజెక్ట్ విలువ సుమారు రూ. 1,35,964 కోట్లుగా అంచనా వేస్తుండగా, తొలి దశలో ఏకంగా రూ.70 వేల కోట్లతో పనులు చేస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు & లాజిస్టిక్స్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను మించిపోయేలా నక్కపల్లిలో మెగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2029 నాటికల్లా తొలి దశ పూర్తిచేయాలనే ఉద్దేశంతో పనులలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోందని చెబుతున్నారు. నక్కపల్లి మండల పరిధిలో చందనాడ, రాజయ్యపేట, వేంపాడు, బుచ్చిరాజుపేట, డీఎల్‌పురం ప్రాంతాల్లో సుమారు 5,465 ఎకరాల విశాలమైన భూమిని ఇప్పటికే కేటాయించారు. అలాగే, ఎగుమతి, దిగుమతులు, రవాణా లాజిస్టిక్స్‌ను అత్యంత వేగవంతం చేసేందుకు ఏకంగా రూ. 11,198 కోట్లతో ప్రత్యేకంగా ఒక కేప్టివ్ ఓడరేవును, 16వ నంబర్ జాతీయ రహదారి నుండి నేరుగా ప్లాంట్‌కు అనుసంధానించేలా నాలుగు వరుసల ప్రత్యేక రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
లక్ష మందికి ఉపాధి!
ఈ పరిశ్రమ కేవలం ఉక్కు ఉత్పత్తికే పరిమితం కాకుండా, ఉత్తరాంధ్ర రూపురేఖలను పూర్తిగా మార్చేయనుందని ఆశిస్తున్నారు. ప్రాజెక్ట్ ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అంటున్నారు. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, 2029 నాటికి ఈ మెగా ప్లాంట్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశ పారిశ్రామిక భవిష్యత్తులో మైలురాయిగా నిలవబోతున్న ఈ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ వర్క్స్ ప్రారంభం కావడం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి సరికొత్త ఊపునిస్తోందని విశ్లేషిస్తున్నారు.
