దేశంలోనే ఫస్ట్.. ఏపీ యువత కోసం చంద్రబాబు సర్కార్ అదిరిపోయే ప్లాన్!
ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా యువత ఉద్యోగాలకు ఎంపికయ్యేలా అన్నివిధాలుగా తీర్చిదిద్దనున్నారు.
By: Tupaki Political Desk | 5 Nov 2025 5:04 PM ISTఏపీ యువత కోసం కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాల హామీతో గద్దెనెక్కిన కూటమి నేతలు.. వారిలో నైపుణ్యం వెలికితీతకు టెక్నాలజీని సమర్థంగా వాడుకోవాలని నిర్ణయించారు. యువతకు చదువుతోపాటు ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు తగ్గట్లు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను గతంలో నెలకొల్పారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు యువతలో ‘నైపుణ్యం’ ఏ మేరకు ఉందో తెలుసుకోవడంతోపాటు ఉద్యోగాలకు అవసరమైన ‘నైపుణ్యం’ కోసం వారి తీర్చిదిద్దేలా అదే పేరుతో అంటే నైపుణ్యం పోర్టల్ ను ఆవిష్కరించాలని నిర్ణయించారు.
ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా యువత ఉద్యోగాలకు ఎంపికయ్యేలా అన్నివిధాలుగా తీర్చిదిద్దనున్నారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో ఇంటిగ్రేట్ అయిన ఈ పోర్టల్ అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేస్తుంది. పదో తరగతి చదువుకున్న విద్యార్థి నుంచి బీటెక్ పూర్తి చేసిన వారి వరకు ఎవరు, ఏం చేస్తే వారి అర్హతలకు తగ్గ ఉద్యోగం లభిస్తుందనేది ఈ పోర్టల్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. ప్లంబర్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వరకు అవసరమైన సలహాలు సూచనలు చేయనున్నారు.
ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా నిరుద్యోగులు తమ రెజ్యూమో తయారు చేయడం నుంచి ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధమవ్వాలనేది ఏఐ ద్వారా తెలుసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఏఐ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్లో ఎక్కడ లోపం ఉంది? ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాలను సూచించనుంది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలతోపాటు ఇతర సమాచారాన్ని ఈ పోర్టల్ కు అనుసంధానించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఈ-శ్రమ కార్డు, ఆధార్, డీజీ లాకర్, ఈఫీఎఫ్, ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను ఈ పోర్టల్ తో అనుసంధానిస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల ఎవరైనా ఉద్యోగం పొందిన వారితోపాటు వారి అనుభవానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే వీలుందని చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సమాచారం ‘నైపుణ్యం పోర్టల్’లో అప్ లోడ్ చేస్తామని చెబుతున్నారు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు వివిధ విభాగాల సమాచారం నైపుణ్యం పోర్టల్ ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా ఆర్థిక శాఖ వద్ద ఉణ్న ఉద్యోగుల సమాచారం కూడా లింక్ చేయనున్నారు. నౌకరీ, విజన్ ఇండియా, యునిసెఫ్, ఇన్ఫోసిస్ వంటి ప్లాట్ ఫాంలు ఈ పోర్టల్ లో కనిపించనున్నాయి. ఆయా సంస్థల వద్ద ఉండే ఖాళీల వివరాలను తెలుసుకునే వీలు కల్పించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలను సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక పోర్టల్ ద్వారానే ఉద్యోగ దరఖాస్తు చేసేకునే పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. మొత్తానికి ఒకే ఒక్క పోర్టల్ ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఉద్యోగాలకు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని ట్రాక్ చేసి రాష్ట్ర యువతకు మార్గదర్శకం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అభ్యర్థులు దరఖాస్తులను ఇంగ్లీషుతోపాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా పోర్టల్ ద్వారానే తయారు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలను అప్ లోడ్ చేస్తే, అభ్యర్థుల అర్హతలకు తగ్గ విధంగా రెజ్యూమో పోర్టల్ లో తయారైపోతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక నైపుణ్యం పోర్టల్ లో అభ్యర్థులు, విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రం, అంచనా కేంద్రం, శిక్షకులు, అడ్మినిస్ట్రేటర్ అని వేర్వేరు విభాగాల లాగిన్లు ఉంటాయి. అభ్యర్థులు ఏం నేర్చుకున్నారో చెబితే ఏం రంగంలో ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్నీ పోర్టల్ చెప్పేస్తుందని అంటున్నారు.
