వైసీపీకి కంటెంట్ ప్రొడ్యూసర్ చంద్రబాబేనా.. సీఎం స్టేట్మెంట్లే సాక్షి డిబేట్లు!
ఏపీ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా సాగుతుంటాయి. అధికార, విపక్షాల మధ్య ముఖాముఖి పోటీయే రాష్ట్ర రాజకీయాలను ఎప్పుడూ హీటెక్కిస్తుంటుంది.
By: Tupaki Political Desk | 8 Oct 2025 7:00 PM ISTఏపీ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా సాగుతుంటాయి. అధికార, విపక్షాల మధ్య ముఖాముఖి పోటీయే రాష్ట్ర రాజకీయాలను ఎప్పుడూ హీటెక్కిస్తుంటుంది. అయితే ఈ రాజకీయ వేడికి ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్ష కారణమవుతున్నారని విశ్లేషిస్తున్నారు. సీఎం అతిజాగ్రత్త విపక్షానికి కష్టం లేకుండా కంటెంట్ అందజేస్తోందని అంటున్నారు. గత పదహారు నెలలుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు, ఆయన తీసుకుంటున్న చర్యలే వైసీపీకి ఆయుధంగా మారుతున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. వైసీపీ పెద్దగా కష్టపడకపోయినా ఆ పార్టీకి బోలెడంత మాట్లాడే అవకాశం చంద్రబాబు కల్పిస్తున్నారని అంటున్నారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ పోకడలు కనిపించకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అతిజాగ్రత్తలు తీసుకోవడం టీడీపీ కేడర్ ను ఇబ్బందుల్లోకి నెడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత తమను తప్పుపడుతుండటం వల్ల విపక్షం అందివచ్చిన అవకాశంగా వాడుకుని తమను టార్గెట్ చేస్తోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. రాజకీయాల్లో బూతులు, రౌడీయిజం వంటివి ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని స్వాగతిస్తున్న కేడర్.. తమ దూకుడు, విపక్షం చేస్తున్న అసత్యప్రచారంపై ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు పట్ల దిగ్భ్రాంతికి లోనవుతున్నారని చెబుతున్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో దూకుడు లేకపోతే రాజకీయాలు కొనసాగించలేమని, విపక్షాన్ని కంట్రోల్ పెట్టడానికి అక్కడక్కడా కేడర్ స్పీడుగా ఉండటాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పుపట్టడం కరెక్టు కాదని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తాము ఏ తప్పు చేయకపోయినా విపక్షం చేస్తున్న ప్రచారాన్ని నమ్ముతూ ఎమ్మెల్యేలు కలెక్షన్లు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండటమే ఎక్కువ నష్టం చేస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఒకరిద్దరు విషయంలో వచ్చిన కథనాలను అందరికీ అపాదిస్తున్నారని, మంత్రివర్గ సమావేశాలు, పార్టీ నేతల భేటీల్లో అవే మాటలు చెబుతుండటం, వాటిని టీడీపీ మీడియా సైతం హైలెట్ చేస్తుండటం వల్ల విపక్ష పత్రికలు, ఆ పార్టీ మీడియాకు కంటెంట్ అందిస్తున్నట్లు అవుతోందని అంటున్నారు.
నిజానికి ఈ 16 నెలలో వైసీపీ ఎక్కడా బలపడలేదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అతి జాగ్రత్త వల్లే ఆ పార్టీ బలపడే పరిస్థితి వస్తోందని అంటున్నారు. తమ కాళ్లు, చేతులు కట్టేసేలా ముఖ్యమంత్రి పదేపదే హెచ్చరించడం, తాము తప్పుచేస్తున్నామనే భావనను అధినేతే ప్రజల్లోకి వ్యాప్తి చేస్తుండటం వల్ల రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో డైలమాలో పడిపోతున్నామని, దీటైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురవుతున్న భయం వల్ల విపక్షానికి అవకాశం ఇచ్చిన వారు అవుతున్నామని అంటున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలియని వారు హైదరాబాదులో కూర్చొని ఏపీలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, ఆ విషయం ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్నారని డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి తమకు సపోర్టు లేకపోతే ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గుకురాలేమని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇష్టానుసారం వ్యవహరించినట్లు ఇప్పుడు ఎవరూ లేరని, అలా ఉంటే వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో ఆందోళనలు చేసేది కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి కూడా లేని ఆలోచనతో చంద్రబాబు తన చుట్టూ ఉన్నవారి విషయంలో అతిగా భయపడుతున్నారని, దీనివల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
