Begin typing your search above and press return to search.

35 ఏళ్లుగా నిలిచిన విమానం.. స్పెషల్ స్టోరీ!

సాధారణంగా విమానం ల్యాండ్ అయిందంటే.. ప్రయాణికులు దిగిపోయాక అది తన తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతుంది.

By:  Madhu Reddy   |   25 April 2026 6:00 AM IST
35 ఏళ్లుగా నిలిచిన విమానం.. స్పెషల్ స్టోరీ!
X

సాధారణంగా విమానం ల్యాండ్ అయిందంటే.. ప్రయాణికులు దిగిపోయాక అది తన తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతుంది. కానీ నాగ్‌ పూర్ విమానాశ్రయంలో ఒక విమానం దిగి సరిగ్గా ఇప్పటికి 35 ఏళ్లు అవుతోంది. ఏ క్షణాన రన్‌వే మీద టైర్లు ఆనించిందో కానీ, అప్పటి నుంచి అది అక్కడే పాతుకుపోయింది. ఇంజిన్ లోపంతో మొదలైన ఈ కథ, చివరకు కోర్టు గొడవలు, కోట్ల రూపాయల పార్కింగ్ ఛార్జీల దగ్గర ఆగిపోయింది. ఈ వింత విమానం కథ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్‌గా మారింది.

ఆ ఒక్క ల్యాండింగ్ చరిత్రను మార్చేసింది:

అది 1991, జూలై 21. కాంటినెంటల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బోయింగ్ 720 విమానం ఇంజిన్ లోపం కారణంగా నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పట్లో రిపేర్లు చేసి విమానాన్ని తీసుకెళ్తారని అందరూ అనుకున్నారు. కానీ కాలం గడుస్తున్నా ఆ విమానం కదలలేదు. ఇక రన్‌వే పక్కనే ఏళ్ల తరబడి ఉండిపోవడంతో విమాన రాకపోకలకు ముప్పుగా మారింది. దీంతో అధికారులు దానిని రన్‌వే నుంచి కాస్త పక్కకు జరిపారు తప్ప, అక్కడి నుంచి పూర్తిగా పంపించలేకపోయారు.

కోర్టు గొడవలు.. కోట్ల రూపాయల అద్దె:

ఈ విమానం ఎందుకు కదలడం లేదనే దానికి ప్రధాన కారణం న్యాయపరమైన చిక్కులే. ఎయిర్‌పోర్ట్ అధికారులు, విమాన యజమాని శామ్ వర్మ మధ్య పార్కింగ్ ఫీజుల విషయంలో పెద్ద గొడవ నడిచింది. "మమ్మల్ని విమానం తీసుకుపోనివ్వకుండా ఆపి, ఇప్పుడు పార్కింగ్ చార్జీలు కట్టమంటే ఎలా?" అని యజమాని వాదిస్తే, "మీరు విమానాన్ని గాలికి వదిలేశారు" అని అధికారులు రిటార్ట్ ఇచ్చారు. ఇక ఇలా సాగిన ఈ పంచాయితీ వల్ల ఇప్పటివరకు ఆ విమానం కట్టాల్సిన పార్కింగ్ ఫీజు దాదాపు రూ.7 కోట్లకు చేరుకుందని సమాచారం.

మ్యూజియం కావాల్సిన విమానం మట్టిలో:

ఈ బోయింగ్ 720 మోడల్ విమానాలకు ఏవియేషన్ రంగంలో మంచి చరిత్ర ఉంది. 1960ల కాలంలో ఇవి అంతర్జాతీయ ప్రయాణాల్లో రారాజులుగా వెలిగేవి. నాగ్‌పూర్‌లో పాతుకుపోయిన ఈ విమానాన్ని ఒక రెస్టారెంట్‌గానో, మ్యూజియంగానో లేదా పైలట్ల శిక్షణ కేంద్రంగానో మారుద్దామని అధికారులు ప్లాన్ చేశారు. కానీ అప్పులు, ఖర్చులు చూసి ఎవరూ ముందుకు రాలేదు. ఇక ప్రస్తుతం ఈ విమానాన్ని నాగ్‌పూర్ ఫ్లయింగ్ క్లబ్‌కు తరలించారు. అక్కడ అది ఎండకు ఎండి, వానకు తడుస్తూ నిరాదరణకు గురవుతోంది.

కాలానికి సాక్ష్యంగా మిగిలిన బోయింగ్:

నేడు నాగ్‌పూర్ విమానాశ్రయానికి వెళ్లే వారికి ఈ విమానం ఒక ల్యాండ్‌మార్క్‌లా కనిపిస్తుంది. చక్రాలు నేలలో కూరుకుపోయి, రంగు వెలిసిపోయి, మసకబారిన అద్దాలతో ఆ విమానం చూస్తుంటే ఒకప్పుడు గాల్లో మేఘాలను చీల్చుకుంటూ వెళ్లిన విమానమేనా ఇది అనిపిస్తుంది. ఇక 35 ఏళ్లుగా ఒకే చోట నిలబడి, అటు యజమానికి ఇటు ప్రభుత్వానికి మధ్య నలిగిపోతున్న ఈ విమానం కథ, విమానయాన చరిత్రలో ఒక వింత అధ్యాయంగా మిగిలిపోయింది. ఇక ఆకాశంలో విహరించాల్సిన విమానం.. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.