Begin typing your search above and press return to search.

ప‌ట్టువ‌ద‌ల‌ని 'ఎన్నిక‌ల విక్ర‌మార్కుడు'.. ఇక‌లేరు.. ఎవ‌రు? చ‌రిత్ర ఎలా సృష్టించారు?

అలాంటిది ఏకంగా 284 ఎన్నిక‌ల్లో(స్థానికం, సార్వ‌త్రికం, అసెంబ్లీ, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు స‌హా) పోటీ చేసి.. ప‌ట్టువ‌ద‌ల‌ని ఎన్నిక‌ల విక్ర‌మార్కుడిగా పేరు తెచ్చుకున్న బిహార్‌కు చెందిన నాగర్మల్‌ బజోరియా ఇక లేరు. 97 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న శుక్ర‌వారం క‌న్నుమూశారు.

By:  Garuda Media   |   6 Sept 2026 8:49 AM IST
ప‌ట్టువ‌ద‌ల‌ని ఎన్నిక‌ల విక్ర‌మార్కుడు.. ఇక‌లేరు.. ఎవ‌రు? చ‌రిత్ర ఎలా సృష్టించారు?
X

ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడు అనే మాట వింటూనే ఉంటాం. అయితే.. ఇత‌ర విష‌యాల్లో ఎలా ఉన్నా.. ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. కొంత సాహ‌సం.. అంత‌కుమించిన మ‌నో ధైర్యం వంటివి ఉంటే త‌ప్ప‌.. వ‌రుస ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఎవ‌రూ ముందుకు రారు. అలాంటిది ఏకంగా 284 ఎన్నిక‌ల్లో(స్థానికం, సార్వ‌త్రికం, అసెంబ్లీ, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు స‌హా) పోటీ చేసి.. ప‌ట్టువ‌ద‌ల‌ని ఎన్నిక‌ల విక్ర‌మార్కుడిగా పేరు తెచ్చుకున్న బిహార్‌కు చెందిన నాగర్మల్‌ బజోరియా ఇక లేరు. 97 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న శుక్ర‌వారం క‌న్నుమూశారు.

ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా...

బ‌జారియా ఎన్నిక‌ల చ‌రిత్ర చూస్తే.. ఆయ‌న ఎవ‌రినీ వ‌ద‌ల్లేదు. ఎలాంటి బెదిరింపుల‌కు కూడా లొంగ‌లేదు. మాజీ ప్ర‌ధానులు వాజ‌పేయి, ఇందిర‌మ్మ వంటి దిగ్గ‌జ నాయ‌కుల‌పైనే బ‌జారియా పోటీ చేశారు. ఇక‌, రాష్ట్ర‌ప‌తిఎన్నిక‌ల్లోనూ ఇలానే త‌ల‌ప‌డ్డారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌తిసారీ ఆయ‌న పేరు వినిపించేది. ఎల్ కే అద్వానీపై పోటీ చేసిన‌ప్పుడు చంపేస్తామ‌న్న బెదిరింపులు వ‌చ్చాయ‌ని.. తాను లెక్క‌చేయ‌లేద‌ని గతంలో బ‌జారియా తెలిపారు. రాజీవ్‌గాంధీ, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీల‌పైనా ఆయ‌న పోటీ చేశారు. అయితే.. ఆయ‌న‌కు త‌క్కువ ఓట్లే రావొచ్చు.. ప్ర‌తిసారీ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ప్ర‌జాస్వామ్య దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ఎవ‌రైనా త‌ల‌ప‌డ‌వ‌చ్చ‌న్న స్ఫూర్తిని మాత్రం కొన‌సాగించారు.

30 ఏళ్ల వ‌య‌సు నుంచే..

వాస్త‌వానికి వ్యాపార వేత్త కుటుంబం నుంచి వ‌చ్చిన బ‌జారియా.. త‌న వ్యాపారాల‌తోపాటు సామాజిక సేవ‌ల‌ను కూడా కొన‌సాగిం చారు. అయితే.. ఎన్నిక‌ల్లో గెలిస్తే.. ఈ సేవ‌ను మ‌రింత పెంచుకునేందుకు అవ‌కాశంఉంటుంద‌ని ఆయ‌న అంచ‌నా వేసుకున్నా రు. ఇదే ఆయ‌న‌ను త‌న 30వ ఏట నుంచి ఎన్నిక‌ల్లోకి దింపింది. అప్ప‌టి నుంచి విరామం తీసుకోకుండా.. ఏ ఎన్నిక వ‌చ్చినా.. చివ‌ర‌కు వార్డుమెంబ‌రుఎన్నిక వ‌చ్చినా.. బ‌జారియా పోటీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న‌కు ఓటు వేయాల‌ని డ‌బ్బులు పంచ‌లేదు. భారీ హామీల‌ను కూడా గుప్పించ‌లేదు. ``మీకు తెలుసు నేను ఎలాంటి వాడినో.. ఓటు వేస్తే.. మ‌రింత సేవ చేస్తా`` అని బ‌జారియా చెప్పేవారు. కానీ, ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టారు.

ఏం చేసేవారు..

బ‌జారియా ప్ర‌జా సేవ‌లో పునీతుల‌య్యార‌నే చెప్పాలి. ఓటు బ్యాంకు ఆయ‌న‌కు క‌లిసి రాక‌పోవ‌చ్చు.. అధికారికంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేక‌పోవ‌చ్చు. కానీ, త‌న వ్యాపారాల ద్వారా వ‌చ్చే లాభార్జ‌న‌ను ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు చేశారు. పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించారు.. పేద‌ల కుటుంబాల‌కు చెందిన యువ‌తుల‌కు పెద్ద‌న్న‌గా మారి.. వంద‌లాది జంట‌ల‌కు సామూహిక వివాహాలు చేయించారు. గ్రామాల్లో పాఠ‌శాల‌లు నిర్మించారు. రైతులకు ఉచితంగా ఎరువు పంపిణీ చేయించారు. ఇలా.. ఆయ‌న స‌మాజ సేవ‌లో అనేక రూపాల్లో పేరును చాటుకున్నారు. కాగా.. బ‌జారియా మృతి ప‌ట్ల రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ నివాళులర్పిస్తుండ‌డం గ‌మ‌నార్హం.