టెక్నాలజీ ఫెయిల్ అవుతోందా? ఈశాన్య ప్రజలకు ఊహించని సమస్యలు!
ఉపాధి హామీ పథకం హాజరు నమోదు కోసం ఆధార్ ఈ-కేవైసీ, డిజిటల్ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నాం.
By: Madhu Reddy | 12 Aug 2026 5:17 PM ISTఉపాధి హామీ పథకం హాజరు నమోదు కోసం ఆధార్ ఈ-కేవైసీ, డిజిటల్ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నాం. అయితే ఈ టెక్నాలజీ అందరికీ ఒకేలా పని చేయడం లేదనే చర్చ ఇప్పుడు మొదలైంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజల శారీరక లక్షణాలకు తగినట్లుగా బయోమెట్రిక్ సిస్టమ్స్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలొనా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ సాంకేతిక లోపాలను ఎత్తిచూపుతోంది.
వైరల్ అయిన నాగాలాండ్ మంత్రి వీడియో:
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి కేవైసీ కోసం తీవ్రంగా కష్టపడుతూ కనిపించారు. ఈశాన్య భారత ప్రజలకు సహజంగానే కళ్లు చిన్నవిగా ఉంటాయి. ఐరిస్ స్కానింగ్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ సమయంలో కెమెరా కళ్లను సరిగ్గా గుర్తించలేకపోవడంతో, ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆయన కళ్లను పెద్దవిగా తెరపించాల్సి వచ్చింది. ఈ దృశ్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ, సాంకేతికతలో మార్పులు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధి హామీ కూలీలకు తీవ్ర ఇబ్బందులు:
నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా రోజువారీ అటెండెన్స్ వేసే సమయంలో ఈ ఫేషియల్ రికగ్నిషన్ వైఫల్యం పెద్ద శాపంగా మారింది. ఇక చిన్న కళ్లు ఉండటం వల్ల ఫొటో మ్యాచ్ కాక హాజరు పడటం లేదు. వయసు పెరగడంతో కంటి సమస్యలు, వేలిముద్రలు తగ్గిపోవడం వల్ల ఆధార్ ఆథెంటికేషన్ తరచూ ఫెయిల్ అవుతోంది.
కూలీలు, వేతనాలు కోల్పోయే ప్రమాదం :
డిజిటల్ కేవైసీ లేదా హాజరు నమోదు కాకపోతే గ్రామీణ పేదలు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, సాంకేతిక లోపాల వల్ల రోజువారీ వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన సిస్టమ్, ప్రాంతీయ శారీరక వ్యత్యాసాలను గుర్తించలేకపోవడం పెద్ద ప్రతిబంధకంగా మారింది.
పరిపరి విధాల సాంకేతిక పరిష్కారాలు:
ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించాలి. వెలుతురు సరిగ్గా ఉన్న ప్రదేశంలో మళ్లీ స్కాన్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ కళ్లు లేదా వేలిముద్రలు అసలే పడకపోతే, సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ వివరాలను రీ-అప్‌డేట్ చేయించుకోవడం మంచిది.
టెక్నాలజీ అనేది మనుషుల సౌకర్యం కోసం ఉండాలి తప్ప, వారి శారీరక అమరికల వల్ల ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఇక దేశంలోని ప్రాంతాల వారీగా ప్రజల శారీరక లక్షణాలను దృష్టిలో పెట్టుకుని బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది, పేదలకు ఇబ్బంది కలగకుండా చొరవ చూపాలని ఆశిద్దాం.
