ఉత్తరాంధ్రను నాగబాబు కు ఇచ్చేశారా ..!
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.. జిల్లాల్లో నాగబాబు హవా పెంచుకునేందుకు గత ఎన్నికలకు ముందు కూడా ప్రయత్నించారు.
By: Garuda Media | 29 July 2025 6:00 PM ISTజనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఇచ్చేశారా? ఇక, పార్టీ కార్యక్రమాలను.. పార్టీ తరఫున వాయిస్‌ను ఆయనే వినిపించనున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా నాగబాబు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తానే ఉత్తరాంధ్ర రాజకీయాలను చూస్తానని.. పార్టీని డెవలప్ చేస్తానని చెప్పారు.దీంతో ఉత్తరాంధ్రపై నాగబాబు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారన్న చర్చ సాగుతోంది. ప్రత్యేకంగా మూడు జిల్లాలపై ఆయన రాజకీయాలు విభిన్నంగా ఉంటాయని అంటున్నారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.. జిల్లాల్లో నాగబాబు హవా పెంచుకునేందుకు గత ఎన్నికలకు ముందు కూడా ప్రయత్నించారు. అయితే.. అనుకున్న విధంగా పట్టు రాలేదు. ముఖ్యంగా విశాఖలోని అనకాపల్లి నుంచి ఆయన పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ.. అనుకున్నట్టుగా ఆ ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాలేదు. దీంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. తాను అండగా ఉంటానన్నారు.
నెలకు ఓ వారం రోజులు పాటు.. ఉత్తరాంధ్రలోనే పర్యటిస్తానని కూడా కార్యకర్తలకు తెలిపారు. ఈ క్రమం లో నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ కు దారితీసింది. ఉత్తరాంధ్రలో గిరిజన సామాజిక వర్గాలు ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నా రు. గిరిజనులకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల వరకు నాగబాబు పరిమితం అయితే అది వైసీపీని దెబ్బ తీస్తుంది కాబట్టి.. కూటమి హ్యాపీ.
కానీ.. అలా కాదని.. మొత్తంగా మూడు జిల్లాల్లోనూ జనసేన దే ఆధిపత్యం అన్నట్టుగా ఆయన రాజకీయాలు చేస్తే.. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో బలంగా ఉన్న టీడీపీ నియోజకవర్గాల్లో మాత్రం.. వివాదాలకు ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఇప్పటికే పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో నాగబాబు.. చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. కూటమిలో సఖ్యతలేని పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నాగబాబు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందరినీ కలుపుకొని పోవాలని ఆయన నాయకులకు చెబుతున్నారు. కానీ, ఆయన వరకు వస్తే.. ఏమేరకు ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందో చూడాలి.
