Begin typing your search above and press return to search.

బిగ్ ట్విస్ట్ : కేంద్ర మంత్రిగా నాగబాబు ?

మరో వైపు చూస్తే సమీకరణలు ఏ విధంగా చూసినా నాగబాబు రాష్ట్ర మంత్రిగా అయ్యేందుకు కుదరడం లేదని అంటున్నారు.

By:  Satya P   |   30 May 2026 11:56 PM IST
బిగ్ ట్విస్ట్ :  కేంద్ర మంత్రిగా నాగబాబు ?
X

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు త్వరలో కేంద్ర మంత్రి అవుతున్నారా అంటే పరిణామాలు ఆ దిశగా సాగే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. నాగబాబు ఎమ్మెల్సీ కదా అయితే గియితే రాష్ట్ర మంత్రి కావాలి కానీ కేంద్ర మంత్రి ఎలా అవుతారు అన్నది కదా బిగ్ క్వశ్చన్. అయితే అక్కడే ఉంది బిగ్ ట్విస్ట్ అని అంటున్నారు. నాగబాబు గత ఏడాది మార్చి 30న ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లో నెగ్గి ఆ పదవిని స్వీకరించారు. ఆయనకు రాష్ట్ర మంత్రి పదవి ఇస్తామని స్వయంగా చంద్రబాబే హామీ ఇచ్చారు. కానీ అది అమలు కాలేదు. దానికి జనసేన పవన్ కళ్యాణ్ ఆలోచనలు వ్యూహానే కారణం అని అంటున్నారు. తన పార్టీ మీద ఏ ముద్ర పడకూడదని ఎంతో పట్టుదలగా ప్రయత్నిస్తున్న పవన్ తానూ తన సోదరుడు ఇద్దరూ ఒకే మంత్రివర్గంలో మంత్రులుగా ఉండడం పార్టీ పరంగా తప్పుడు సంకేతాలు ఇస్తుందని భావించే ఆగిపోయారు అని అంటున్నారు.

కుదరని సమీకరణలు :

మరో వైపు చూస్తే సమీకరణలు ఏ విధంగా చూసినా నాగబాబు రాష్ట్ర మంత్రిగా అయ్యేందుకు కుదరడం లేదని అంటున్నారు. ఇప్పటికే జనసేనలో ముగ్గురు మంత్రులు ఉంటే పవన్ కందుల దుర్గేష్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దాని వల్ల ఈసారి విస్తరణలో మరో మంత్రి పదవి జనసేనకు దక్కితే దానిని బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే నాగబాబుని ఆపారని కూడా ఆ మధ్య దాకా చర్చ నడచింది. అంతా బాగానే ఉంది కానీ నాగబాబు సంగతి ఏమిటి అన్నదే కదా అసలు చర్చ. అందుకే జనసేనాని మరో ఆలోచన చేశారు అని అంటున్నారు. నాగబాబుని ఢిల్లీకి పంపించి జాతీయ రాజకీయాల్లో కీలకం చేయడమే ఆ నయా ఆలోచనగా చెబుతున్నారు.

రాజ్యసభ సీటుతో :

సరైన సమయానికి రాజ్యసభ సీటు కూడా జనసేనకు చేతిలో ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి జనసేనకు కచ్చితంగా దక్కుతోంది. ఆ సీటుని లింగమనేని రమేష్ కి ఇస్తారు అని ఇప్పటిదాకా వినిపించిన ప్రచారంగా ఉంది. కానీ ఇపుడు మాత్రం ఆ సీటు నాగబాబుకు దక్కుతుందని అంటున్నారు. నాగబాబుని రాజ్యసభకు పంపించడం ద్వారా ఢిల్లీ స్థాయిలో జనసేన గొంతుకను మరింత బలంగా వినిపించేలా చేయాలన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.

కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో :

ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కూడా జూన్ నెలలో ఉంటుందని అంటున్నారు. కేంద్ర కేబినెట్ లో కూడా జనసేనకు ఒక బెర్త్ రిజర్వ్ అయి ఎప్పటి నుంచో ఉంది. నిజానికి 2024 లో మోడీ ప్రమాణ స్వీకారం తరువాత మంత్రులను చేర్చుకున్నపుడే జనసేనకు ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. అయితే దానిని సరైన సమయంలో సరైన తీరున వాడుకోవాలనే జనసేన నాడు నో చెప్పింది అని అంటున్నారు. ఇపుడు ఆ సమయం వచ్చిందని గుర్తు చేస్తున్నారు. నాగబాబుకు కేంద్ర కేబినెట్ లో కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఆ విధంగా సోదరుడికి పార్టీలో పెద్ద పీట వేయడమే కాకుండా అధికారంలోనూ సముచిత స్థానం కల్పించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషించేలా చర్యలను పవన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.

త్వరలో రాజీనామా :

ఇక నాగబాబు తొందరలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఆయనకు చేసేందుకు పెద్దగా ఆస్కారం లేనందువల్లనే జనసేన అధినేత పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే అన్న నాగబాబు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవాలు ఏమిటన్నవి.