పాపం! డోస్ ఎక్కువైంది.. స్టే ట్యూన్ : నాగబాబు ఇంట్రెస్టింగ్ వీడియో
జనసేన జనరల్ బాడీ సమావేశంలో అధినేత పవన్ ఇచ్చిన వార్నింగ్ పార్టీ నేతలను కదిలించిందా? అనే చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 4 Feb 2026 2:13 PM ISTజనసేన జనరల్ బాడీ సమావేశంలో అధినేత పవన్ ఇచ్చిన వార్నింగ్ పార్టీ నేతలను కదిలించిందా? అనే చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే పార్టీ నేతలు ఎవరూ మాట్లాడకపోవడంపై జనసేనాని పవన్ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. పార్టీ తరఫున తానొక్కడినే మాట్లాడాలా? పదవులలో ఉన్న నేతలు ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ విషయంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తోపాటు తన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుపైనా పవన్ అసంతృత్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్సీ నాగబాబు బుధవారం తిరుమల లడ్డూతోపాటు హిందూ మతం పట్ల విపక్ష వైసీపీ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో తాను నాస్తికుడినని పరిచయం చేసుకుంటూనే హిందూ మతం ఒక ధర్మమంటూ వ్యాఖ్యానించారు. వీడియోలో నాగబాబు మాట్లాడిన అంశాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
ప్రతిపక్షం వైసీపీని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్సీ నాగబాబు వీడియో విడుదల చేశారు. సోమవారం జనసేన సాధారణ సమావేశంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లాస్ పీకిన తర్వాత నాగబాబు ఈ వీడియో విడుదల చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అనేక వ్యవహారాలతోపాటు ప్రస్తుతం టీటీడీలో వివాదాస్పదంగా మారిన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై నాగబాబు మాట్లాడారు. వీడియో ప్రారంభంలో తాను ఒక సగటు భారతీయుడిని, హిందువుని అంటూ మొదలుపెట్టిన నాగబాబు హిందూ మత గొప్పతనాన్ని వివరించారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువుగానే పరిగణించాలని చెబుతూ, విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తున్నట్లు పలు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలకు ఇతరుల పర్సనల్ వ్యవహారాలపై ఉన్న ఇంట్రెస్టు మన దేవాలయాలపై లేదని చెప్పిన నాగబాబు 2020 సెప్టెంబరులో వైసీపీ అధికారంలో ఉండగా, అంతర్వేదిలో రథం తగలబడిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా అదే ఏడాది డిసెంబరులో రామతీర్థం ఆలయంలో రాముడి తలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు సంఘటనలతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. ఇక టీటీడీ అంశాన్ని ప్రస్తావిస్తూ గత పాలనలో టీటీడీని భక్తులను దూరం చేశారంటూ వైసీపీపై నాగబాబు మండిపడ్డారు. ప్రతి హిందువు ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భావిస్తారని, కానీ కొండపై అకామిడేషన్ చార్జీలు పెంచేసి భగవంతుడిని భక్తులకు దూరం చేశారని ఆరోపించారు.
‘‘కొండపై వసతి కోసం కేటాయించే అద్దె గదుల ధరలను రూ. 500 నుంచి వెయ్యికి పెంచారు. నారాయణగిరిపై వసతి గదుల ధర రూ. 1700 చేశారు. ఏ మాఫియాను సంతృప్తి పరచటానికి ఈ ధరలు పెంచారంటూ’’ నాగబాబు ప్రశ్నించారు. దర్శనాలు, సేవలపై మరీ ఘోరంగా వ్యవహరించారని నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాటలను రాష్ట్రం అంతా చూశారంటూ నాగబాబు విమర్శలు గుప్పించారు. ‘‘తిరుమలపై దోపిడీ అంతా ఇంతా కాదు. కొండ కనిపిస్తే గుండు కొట్టేయడమే అలవాటు.’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వాల్సివస్తుందని మాజీ సీఎం జగన్ తన తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవడాన్ని నాగబాబు గుర్తుచేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకున్నారని, ఆయన కన్నా నువ్వు (జగన్) ఏమైనా గొప్పొడివా? అంటూ నాగబాబు నిలదీశారు.
‘‘ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సివుంది. ఈ రోజు పాపం డోస్ ఎక్కువైంది. రేపు మాట్లాడుకుందాం.. స్టే ట్యూన్’’ అంటూ తన వీడియోను నాగబాబు ముగించారు. సినీ స్టైల్ లో నాగబాబు విడుదల చేసిన వీడియోను జనసేన వర్గాలు వైరల్ చేస్తున్నాయి. ఇక తిరుమల లడ్డూ వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ శ్రుతిమించిన సమయంలో జనసేన నుంచి నాగబాబు తొలిసారిగా మాట్లాడారు. అయితే ఆయన తన వీడియోలో ఎక్కడా కల్తీ నెయ్యి సరఫరాపై మాట్లాడలేదు. గత పాలనలో చోటుచేసుకున్న మూడు ఉదంతాలను ప్రస్తావించి వైసీపీ హిందూ ద్రోహిగా మారిందన్న విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారని అంటున్నారు. అయితే ఇదే అంశంపై రేపు మాట్లాడదామంటూ ఆయన వీడియోను ముగించడంతో నాగబాబు ఇక నుంచి సీరియల్ పద్ధతిలో వీడియోలు విడుదల చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
