Begin typing your search above and press return to search.

నాగబాబుకు మంత్రి పదవి...అదే జరుగుతోందా ?

ఇదిలా ఉంటే తాజాగా విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన నాగబాబు క్యాడర్ తో చెప్పిన మాటలు చూస్తే ఆయనకు మంత్రి పదవి కంటే పార్టీ బాధ్యతలే అప్పగిస్తారు అని అంటున్నారు.

By:  Satya P   |   9 Aug 2025 7:39 PM IST
నాగబాబుకు మంత్రి పదవి...అదే జరుగుతోందా ?
X

మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఎంతెంత దూరం అంటే జవాబు మాత్రం దొరకడం లేదు. ఆయన ఎమ్మెల్సీగా పెద్దల సభకు నెగ్గి అయిదు నెలలు ఇట్టే గడచిపోయాయి. అసలు ఆయన ఏ చట్ట సభలో సభ్యుడు కాక ముందే గత ఏడాది లోనే ఆయన మంత్రి పదవి కంఫర్మ్ అయింది. అలా ప్రకటించిన వారు కూడా కూటమి సారధి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. ఆయన తన ట్విట్టర్ ద్వారా స్వయంగా ఈ విషయం ప్రకటించినపుడు ఇంకేముందు రేపో మాపో నాగబాబు మంత్రి అయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఈ ప్రకటన వచ్చి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఈ మధ్యలో ఎన్నో పరిణామాలు జరిగాయి కానీ నాగబాబు మాత్రం మంత్రి కాలేకపోయారు.

ఆటంకాలు అవరోధాలు :

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జనసేన బలమైన మిత్రపక్షంగా ఉంది. పవన్ కళ్యాణ్ కోరుకుంటే జరగనిది ఏదీ లేదు పైగా చంద్రబాబే వరం ఇచ్చేశారు. మరి మధ్యలో వచ్చిన అవరోధాలు ఆటంకాలు ఏమిటి అన్నదే చర్చగా ఉంది. ఏపీ మంత్రివర్గంలో జనసేన నుంచి ముగ్గురుకి ఇప్పటికే చోటు ఉంది. అందులో నాదెండ్ల మనోహర్ ని పక్కన పెడితే మిగిలిన ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఇపుడు నాగబాబుకు కూడా మంత్రిగా అవకాశం ఇస్తే ఒకే సామాజిక వర్గం పార్టీగా జనసేన మీద గట్టి ముద్ర పడుతుంది అన్న ఆలోచన ఏదో ఆ పార్టీ పెద్దలలో ఉంది అంటున్నారు. బహుశా అదే అసలైన కారణం అని అంటున్నారు. పార్టీ సుదీర్ఘమైన భవిష్యతు దృష్ట్యా ఈ రాకమైన సంకేతాలు మంచివి కావని అంటున్నారు.

పార్టీ కోసమేనా అలా :

మరో వైపు చూస్తే జనసేన పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. అలాగే ఆయన సినిమాలను కూడా చేస్తూ వస్తున్నారు. అలా ఆయన తీరిక లేకుండా ఉండడం వల్ల జనసేన గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. అదే నాగబాబు లాంటి వారిని జిల్లాలలో టూర్లకు పంపించి పార్టీ కోసం వాడుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది అన్న చర్చ కూడా ఉందని అంటున్నారు. నాగబాబుకు మెగాభిమానులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అంతే కాదు ఆయన జనసేన క్యాడర్ కి కూడా అందుబాటులో ఉంటే గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలోపేతం అవుతుంది అని అంటున్నారు

పవన్ తలచుకుంటేనే :

నాగబాబు మంత్రి కావడం అన్నది పవన్ చేతిలోనే ఉంది అని అంటున్నారు. పవన్ అనుకుంటే ఈ రోజుకి ఈ రోజు ఆయన మంత్రి అవుతారు అని చెబుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ అదే విషయం చెప్పారు. నాగబాబు విషయం తాను ఆలోచిస్తున్నాను అని అన్నారు. పార్టీ కోసమే నాగబాబుని వాడుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు అని కూడా వినిపిస్తోంది. అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారు అని చెబుతున్నారు. నిజానికి రాజ్యసభకు నాగబాబుని పంపించి కేంద్ర మంత్రిగా చేయాలన్నది కూడా పవన్ ఉద్దేశ్యంగా ఉంది అని అంటున్నారు. కానీ ఈలోగా ఎమ్మెల్సీగా చేశారు. అయితే ఆయనకు రాష్ట్రంలో కంటే కేంద్రంలో కీలక స్థానం కల్పించాలని తద్వారా జాతీయ రాజకీయాల్లో జనసేన ఎలివేట్ అయ్యేలా చూసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

నాగబాబు మాటలను బట్టి :

ఇదిలా ఉంటే తాజాగా విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన నాగబాబు క్యాడర్ తో చెప్పిన మాటలు చూస్తే ఆయనకు మంత్రి పదవి కంటే పార్టీ బాధ్యతలే అప్పగిస్తారు అని అంటున్నారు. తాను ఇక మీద నెలలో వారం రోజుల పాటు ఉత్తరాంధ్రాలో పర్యటిస్తాను అని నాగబాబు చెప్పారు. అంతే కాదు పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాను అన్నారు. దీంతో నాగబాబు పార్టీలో కీలకం అవుతారని అంటున్నారు. రానున్న కొద్ది రోజులలో నాగబాబు విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.