ఉత్తరాంధ్రా సీటు మీద నాగబాబు కన్ను ?
మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఉత్తరాంధ్రాలో పర్యటించారు. ఆయన పర్యటన శ్రీకాకుళం జిల్లాలో సాగింది.
By: Satya P | 20 Oct 2025 9:13 AM ISTమెగా బ్రదర్ నాగబాబు ఇటీవల ఉత్తరాంధ్రాలో పర్యటించారు. ఆయన పర్యటన శ్రీకాకుళం జిల్లాలో సాగింది. ఆయన నేరుగా ఈ జిల్లాకు వచ్చి స్థానికంగా ఉన్న జనసేన నేతలతో కలసి రెండే రెండు నియోజకవర్గాలలో పర్యటించారు. అక్కడ ఉన్న స్థానిక సమస్యలను వచ్చే శాసన మండలి సమావేశంలో ప్రస్తావిస్తాను అని చెబుతూ నాగబాబు తన టూర్ ని చేపట్టారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యల మీద తాను ఫోకస్ పెడతాను అని ఆయన అంటున్నారు.
ఎమ్మెల్యేలు లేకుండానే :
తాజాగా నాగబాబు శ్రీకాకుళం అలాగే ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ రెండు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నాగబాబు పర్యటన గురించి వారికి సమాచారం ఉందా లేక ఆయన ఎవరికీ చెప్పకుండా తన సొంత ఆలోచనల మేరకు ఈ పర్యటనకు చేపట్టారా అన్న దాని మీద చర్చించుకుంటున్నారు. శ్రీకాకుళంలో నాగబాబు పర్యటించినపుడు టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆయన వెంట లేరు. అలాగే ఎచ్చెర్ల టూర్ లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు కూడా లేరు. దాంతో ఏమై ఉంటుంది అన్న చర్చ మొదలైంది. అంతే కాదు నాగబాబు ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారా అని కూడా ఆలోచిస్తున్నారుట.
ఎచ్చెర్ల మీదనే ఫోకస్ :
నాగబాబు 2025 మార్చిలో ఎమ్మెల్సీగా నెగ్గారు. ఆయన శాసన మండలి సభ్యత్వం 2031 దాకా ఉంటుంది. అయితే 2029లో వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నాగబాబు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఆయన ఎచ్చెర్ల సీటు మీద ఫుల్ ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు ఇక్కడ పెద్ద సంఖ్యలో కాపులు ఉండడం ప్రధాన కారణంగా ఉంది. అంతే కాదు రాజకీయంగా కీలకమైన సీటు, ఆర్ధికంగా అభివృద్ధి పరంగా చూస్తే శ్రీకాకుళానికి గేట్ వే లాంటి సీటు. ఇక్కడే అనేక ప్రగతి ప్రాజెక్టులు వస్తున్నాయి.
కళా సొంత సీటు :
ఇక ఈ సీటు మీద టీడీపీ సీనియర్ మేత మాజీ మంత్రి కళా వెంకటరావుకు ఎంతో మమకారం ఉంది. ఆయన 2014లో ఇక్కడ నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు ఆయన సొంత ఊరు ఉణుకూరు కూడా ఇందులోనే ఉంది అని అంటారు. ఆయన 2024లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటే చీపురుపల్లి పంపించారు. అయితే 2029లో తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకి ఈ సీటు కోరేందుకు కళా వెంకటరావు ప్లాన్స్ చేస్తున్నారు. మరో వైపు చూస్తే విజయనగరం ఎంపీగా ఉన్న కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎచ్చెర్లకు చెందిన వారే. ఆయన కూడా 2029లో ఇక్కడ నుంచి పోటీకి ప్లాన్స్ చేసుకుంటున్నారు. మరి ఈ సీటు మీద నాగబాబు కన్ను వేశారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇది సంచలనమే అంటున్నారు.
జనసేన ప్లాన్ :
ఉత్తరాంధ్రా జిల్లాలలో పట్టు కోసం నాగబాబుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయించడానికి ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఆరు ఎమ్మెల్యే సీట్లు జనసేన గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఆ నంబర్ ని డబుల్ చేసుకోవాలని ఆలోచిస్తోంది అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల తరువాత జనసేనకు ఉత్తరాంధ్రావే కీలక స్థావరంగా మారేందుకు స్కోప్ ఉంది. అందుకే నాగబాబు చిట్ట చివరి జిల్లా నుంచే తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారా అన్నది చర్చగా ఉంది.
