కేబినెట్ హోదాతో నాగబాబు...జీతం ఎంతో తెలుసా ?
జనసేనలో కీలక నాయకుడు, ఎమ్మెల్సీ అయిన నాగబాబుని ఈ మధ్యనే ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ పదవి వరించింది.
By: Satya P | 10 Sept 2026 12:40 PM ISTజనసేనలో కీలక నాయకుడు, ఎమ్మెల్సీ అయిన నాగబాబుని ఈ మధ్యనే ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ పదవి వరించింది. ఈ పదవితో పాటు ఇపుడు కేబినెట్ హోదా కూడా కూటమి ప్రభుత్వం ఆయనకు కట్టబెట్టింది. దాంతో మంత్రులతో సమానంగా నాగబాబు కూడా అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. అంతే కాదు ఆయనకు ప్రోటోకాల్ వర్తిస్తుంది. అలాగే జీతభత్యాలు కూడా పెద్ద ఎత్తున లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన జీత భత్యాలు అదే విధంగా సిబ్బంది నియామకం ఇతర ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం 2025 జనవరి 10న జారీ చేసిన జీవో నంబర్ 7ను ప్రస్తావించింది. దాంతో ఆ జీవో ప్రకారం నాగబాబుకు జీతంగా రెండు లక్షల రూపాయలు నెలకు దక్కనుంది. సిబ్బంది ఇతర అలవెన్సులు కింద మరో రెండున్నర లక్షల రూపాయలు కూడా లభిస్తాయి. ఈ లెక్కన ఆయనకు నెలకు నాలుగున్నర లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దక్కనుంది.
పచ్చదనం కోసం :
ఏపీలో పచ్చదనం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా నాగబాబుని నియమించారు. దానికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ గా పేరు పెట్టారు. దీంతో నాగబాబుకు కూడా ఏపీలో అధికారిక కేబినెట్ హోదా లభించినట్లు అయింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలువురుని వివిధ అంశాలకు సంబంధించి సలహాదారులుగా నియమించింది. వారికి కేబినెట్ హోదా ఇచ్చింది. అదే క్రమంలో నాగబాబుకు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ హోదా ఇచ్చారు అని అంటున్నారు.
మంచి హోదాతో :
ఇక నాగబాబు ఎమ్మెల్సీగా ఇప్పటికే ఉన్నారు. ఆయనకు దానితో పాటు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ పదవి కూడా తోడు అయింది. ఇక ఆయన కేబినెట్ హోదాతో ఏపీవ్యాప్తంగా పర్యటించేందుకు వీలు అవుతుంది. అలాగే అధికారిక సమావేశాలు నిర్వహించడం ద్వారా తనకు అప్పగించిన బాధ్యతలను కమిటీ చైర్మన్ గా నెరవేర్చేందుకు వీలు ఉంటుంది. నాగబాబుని నిజానికి ఏపీలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా తీసుకోవాల్సి ఉంది. ఆ మేరకు ఆయనకు హామీ కూడా ఉంది. అయితే అది కొన్ని సమీకరణల వల్ల కుదిరే అవకాశం లేకపోవడంతో ఈ విధంగా ఆయనకు తగిన హోదా గౌరవం ఇచ్చి సముచితమైన స్థానం కల్పించారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో ప్రభుత్వంలో కూడా నాగబాబుకు ప్రాధాన్యత మరింతగా పెరగనుంది అని అంటున్నారు.
