Begin typing your search above and press return to search.

నాగబాబుకే జాక్ పాట్ ?

మెగా బ్రదర్ గా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె నాగబాబు ఎమ్మెల్సీగా నామినేట్ అయి ఏడాది కావస్తోంది.

By:  Satya P   |   9 March 2026 9:16 AM IST
నాగబాబుకే జాక్ పాట్ ?
X

మెగా బ్రదర్ గా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె నాగబాబు ఎమ్మెల్సీగా నామినేట్ అయి ఏడాది కావస్తోంది. 2025 మార్చి 30 నుంచి ఆయన శాసన మండలి సభ్యుడు అయ్యారు. నాగబాబు ఇలా ఎమ్మెల్సీ కావడమేంటి అలా మంత్రి అవుతారు అని కూడా అప్పటికి కొన్ని నెలలుగా వినిపించాయి. దానికి కూటమి పెద్దలు కూడా పూర్తి సుముఖంగా ఉన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది అని ప్రచారం కూడా సాగింది. ఒకే మంత్రివర్గంలో అన్నదమ్ములు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు పార్టీలో తప్పుడు సంకేతం ఇస్తుంది అని ఆలోచించి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా మరో ప్రచారం సాగింది. వీటి అన్నింటి మధ్యనే గిర్రున ఏడాది తిరిగేసింది.

రాజ్యసభ కోసమేనా :

ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ లో రాజ్యసభకు నాలుగు ఖాళీలు ఏపీ నుంచి ఏర్పడబోతున్నాయి. అందులో జనసేనకు కచ్చితంగా ఒక సీటు ఖాయంగా దక్కుతుంది. దాంతో ఆ సీటు విషయంలో ఇప్పటిదాకా ఒక పేరు చక్కర్లు కొడుతూ వస్తోంది. అదే పారిశ్రామికవేత్తగా ఉన్న లింగమనేని రమేష్. అయితే ఇపుడు మరో కొత్త పేరు వెలుగు చూస్తోంది. అది ఎవరితో కాదు నాగబాబు అని అంటున్నారు. నాగబాబుని రాజ్యసభకు జనసేన కోటాలో పంపిస్తారు అన్నది లేటెస్ట్ గా జరుగుతున్న ప్రచారంగా ఉంది.

ఈక్వేషన్స్ సెట్ చేసేలా :

నాగబాబు కనుక రాజ్యసభకు వెళ్తే అన్ని రకాల ఈక్వేషన్స్ సెట్ అవుతాయని అంటున్నారు. రాష్ట్రంలో ఆయన ఉంటే మంత్రి కాలేరు, జస్ట్ ఎమ్మెల్సీగానే ఉండాలి. అదే ఎంపీగా పంపితే జనసేనకు కేంద్ర కేబినెట్ లో బెర్త్ కచ్చితంగా ఉంది. దానిని నాగబాబుకు ఖరారు చేస్తారు అని అంటున్నారు. అలా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉంటే నాగబాబు ఢిల్లీలో జనసేన రాజకీయాలను చక్కబెడుతూ కీలకమైన కేంద్ర మంత్రి పదవిలో ఉంటారు అని అంటున్నారు. ఇక ఏపీ మంత్రివర్గంలో జనసేన కోటాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామక్రిష్ణను తీసుకుంటారు అని చెబుతున్నారు.

నాగబాబు కోరిక :

ఇక నాగబాబు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా అయ్యారు కానీ ఆయన మొదటి నుంచి ఎంపీగా వెళ్లాలనే అనుకున్నారు. 2019లో కూడా నాగబాబు నరసాపురం లోక్ సభకు పోటీ చేశారు. ఇక 2024లో అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అనుకుంటే చివరి నిముషంలో బీజేపీకి ఆ సీటు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దాంతో నాగబాబుకు అప్పట్లోనే రాజ్యసభ హామీ ఇచ్చారు. అయితే 2024 లో రాజ్యసభ ఖాళీలు వచ్చినా నాగబాబుకు చాన్స్ ఇవ్వలేకపోయారు. ఈ మధ్యలో ఎమ్మెల్సీ అయినా నాగబాబుకు రాజ్యసభకు వెళ్ళాలన్న కోరిక ఉండనే ఉంది అంటున్నారు పైగా జనసేన కోటాలో కేంద్ర మంత్రి పదవి కూడా ఖాయమవుతున్న దశలో ఆయనకు ఇది గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే నాగబాబు తొందరలోనే కేంద్ర మంత్రి కాబోతున్నారు అన్నది పెద్ద ఎత్తున ప్రచారంగా ముందుకు వస్తోంది. ఇది జరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.