Begin typing your search above and press return to search.

నాగబాబు ఆన్ డ్యూటీ.. ఏపీ గ్రీన్ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ

జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

By:  Tupaki Political Desk   |   28 Aug 2026 5:54 PM IST
నాగబాబు ఆన్ డ్యూటీ.. ఏపీ గ్రీన్ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ
X

జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ కమిటీ చైర్మనుగా కేబినెట్ హోదాలో నాగబాబు సేవలు అందించనున్నారు. ఏపీ గ్రీన్ చైర్మన్ గా నాగబాబును నియమిస్తూ దాదాపు 20 రోజుల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మంచి ముహూర్తం కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన నాగబాబు శ్రావణ శుక్రవారం సందర్భంగా పండితుల వేది మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు స్వీకరించారు.





మంగళగిరిలోని అరణ్య భవన్ లో ఏపీ గ్రీన్ చైర్మనుగా నాగబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో నాగబాబు పక్కనే ఆయన భార్య పద్మజ ఉన్నారు. పలువురు జనసేన నాయకులు, అటవీశాఖ అధికారుల సమక్షంలో నాగబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అటవీ, వృక్ష సంపదను విస్తరించి 2047 నాటికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా పని చేస్తానని నాగబాబు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యమయ్యే మహోద్యమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.





50 శాతం పచ్చదనం పెంచుతా..

ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96 శాతంగా ఉందని, 2047 నాటికి పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే మా ప్రధాన లక్ష్యమని నాగబాబు స్పష్టం చేశాు. ఇది కేవలం గణాంకాల కోసం పెట్టుకున్న లక్ష్యం కాదని, భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమని ఆయన అభివర్ణించారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఈ సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యతగా నాగబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రతి పౌరుడిని భాగస్వాములను చేసేలా పనిచేస్తామన్నారు.





నాగబాబు కాదు నాగేంద్రరరావు

ఏపీ గ్రీన్ చైర్మనుగా నాగబాబు ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఆయన టేబుల్ పై ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు చర్చకు తావిచ్చింది. సినీ రంగంలో నాగబాబుగా అందరికీ తెలిసిన నాగబాబు అసలు పేరు నాగేంద్రరావు అన్న విషయం శుక్రవారమే స్పష్టమైంది. ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన అప్పటికీ అందరూ ఆయనను నాగబాబు అనే వ్యవహారిక నామంతోనే పిలుస్తున్నారు. కానీ, అధికారికంగా నాగబాబు అసలు పేరు నాగేంద్రరరావు అని సూచిస్తూ నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. ‘‘కొణిదెల నాగేంద్రరరావు, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఏపీ గ్రీన్ అంటూ బోర్డుపై స్ఫష్టంగా రాశారు. కాగా, చైర్మనుగా బాధ్యతలు స్వీకరించిన నాగబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.