శివాజీపై నాగబాబు... మెగా ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ కామెంట్స్ ఇవే!
అవును... హీరోయిన్స్ వస్త్రధారణపై వ్యాఖ్యానిస్తూ తప్పుడు పదాలు పలికిన వ్యవహారంలో నటుడు శివాజీ ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే! దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By: Raja Ch | 28 Dec 2025 2:41 PM ISTసీనియర్ నటుడు శివాజీ.. ఇటీవల "దండోరా" సినిమా ఫంక్షన్ లో హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీ జనాల నుంచి విమర్శలు, శివాజీ క్షమాపణలు, మహిళా కమిషన్ విచారణ వెరసి.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై నటుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన వేళ.. మెగా ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ కామెంట్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
అవును... హీరోయిన్స్ వస్త్రధారణపై వ్యాఖ్యానిస్తూ తప్పుడు పదాలు పలికిన వ్యవహారంలో నటుడు శివాజీ ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే! దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివాజీ వ్యాఖ్యలను పలువురు నటులు, నటీమణులు తీవ్రంగా ఖండించారు. మరికొంతమంది ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఇందులో భాగంగా.. వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగా హక్కు అని.. మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు!
ఇదే సమయంలో... దీనిపై తాను రాజకీయ నాయకుడిగా గానీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా గానీ మాట్లాడటం లేదని.. ఒక సామాన్య వ్యక్తిగా తన మనసులో ఉన్న మాటలను చెబుతున్నట్లు మొదలుపెట్టిన నాగబాబు... శివాజీని టార్గెట్ చేయాలనే ఉద్దేశం లేదని.. అయినప్పటికీ ఎవరైనా అలా భావిస్తే తాను ఏం చేయలేనని చెప్పుకొచ్చారు! ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయాలపై ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు!
ఇదే క్రమంలో... మహిళలను అవమానించిన వారు బాగుపడిన దాఖలాలు లేవని హెచ్చరించిన నాగబాబు.. మహిళలకు తను లాంటి వారు ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మహిళల గౌరవాన్ని కాపాడటం మన సమాజానికి అవసరమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా... రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు.. ఇప్పటివరకూ రాష్ట్రంలోని సమస్యలపై సరైన స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవని.. స్పందించడానికి పలు సమస్యలు ఉన్నప్పటికీ ఆయన మౌనాన్నే సమాధానంగా, స్పందనగా చేసుకున్నట్లు ఉంటున్నారని.. అలాంటప్పుడు శివాజీ వ్యాఖ్యలపై మాత్రం స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని.. అలాంటప్పుడు ఎమ్మెల్సీగా ముందు రాష్ట్రంలోని సమస్యలపై స్పందించాలని అంటున్నారు.
అయితే... శివాజీ కామెంట్స్ పై నాగబాబు.. ఒక ఎమ్మెల్సీ గానో, జనసేన పార్టీలోని కీలక సభ్యుడిగానో.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగానో కాకుండా.. ఓ సామాన్యుడిలా స్పందించారని.. ఓ ఆడ పిల్ల తండ్రిలా మాట్లాడారని.. ఇది అర్ధం చేసుకోకుండా ఆయనపై విమర్శలు తగదని.. ఈ విషయంలో స్పందించాల్సిన బాధ్యత అందరికీ ఉందని.. ఆయన అలా భావించే స్పందించారని మరికొంతమంది స్పందిస్తున్నారు! మరోవైపు.. నాగబాబు మాట్లాడితే వైరల్, మౌనంగా ఉంటే సంచలనం అంటూ మరికొంతమంది సరదా కామెంట్లు పెడుతున్నారు!
