ఢిల్లీ కారు పేలుళ్లలో.. వాహన యజమాని ఎవరో తేలింది
షాకింగ్ గా మారిన ఎర్రకోట కారు పేలుడుకు సంబంధించిన వాహన యజమానిని పోలీసులు గుర్తించారు.
By: Garuda Media | 11 Nov 2025 11:16 AM ISTషాకింగ్ గా మారిన ఎర్రకోట కారు పేలుడుకు సంబంధించిన వాహన యజమానిని పోలీసులు గుర్తించారు. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ పేలుళ్ల వెనుక ఎవరున్నారన్న విషయాన్ని గుర్తించేందుకు నిఘా వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పేలుడు చోటు చేసుకున్న కారుకు చెందిన పాత ఓనర్ ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ అతడు ఎవరు? ఎక్కడివాడు? అన్న విషయాలకు వెళితే.. ఆ వాహనానికి పాత యజమాని హర్యానాకు చెందిన నదీమ్ ఖాన్ గా గుర్తించారు.
కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. హుండయ్ ఐ20 కారులో ఈ భారీ పేలుడు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారి శరీరంలో ఎలాంటి పెల్లెట్ లను గుర్తించలేదన్న పోలీసులు.. బాంబు పేలుడులో ఇది అసాధారణంగా పేర్కొంటున్నారు.
పేలుడుకు కారణమైన కారును తొలుత మహ్మద్ సల్మాన్ కొన్నారు. అనంతరం నదీమ్ ఖాన్ అనే వ్యక్తికి అమ్మినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గుర్ గ్రామ్ కు చెందిన సల్మాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. పేలుడు చోటు చేసుకున్నది హ్యూందాయ్ ఐ20 కార్ గా కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు పేర్కొంటున్నారు. ఎర్రకోటకు సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సిగ్నల్ వద్దకు నెమ్మదిగా వచ్చి ఆగిన కారు.. ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకోవటం.. తొమ్మిది మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పేలుడు ఉదంతాన్ని అన్ని కోణాల్లో విచారణ చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారుల్ని ఆదేశించారు.
