Begin typing your search above and press return to search.

పాత ఫార్ములా వర్తించదు.. లోకల్ ఎలక్షన్స్ పై మంత్రి నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికలలో పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Garuda Media   |   24 July 2026 3:25 PM IST
పాత ఫార్ములా వర్తించదు.. లోకల్ ఎలక్షన్స్ పై మంత్రి నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
X

స్థానిక ఎన్నికలలో పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ బలానికి తగినట్లు సీట్లు కేటాయించాలని డిమాండు చేస్తున్న నాదెండ్ల.. ఈ సారి త్యాగాలు చేయడానికి జనసేన కార్యకర్తలు సిద్ధంగా లేరన్న సంకేతాలు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ జనసేన సర్దుబాటు చేసుకుందని, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పాత ఫార్ములా పూర్తిగా వర్తించదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ, గెలుపు అవకాశాలు ఉన్న ప్రతిచోటా జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపుతామని ఆయన తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో జనసేన పార్టీ తరఫున మంత్రి నాదెండ్ల తరచూ చేస్తున్న ఈ తరహా వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు 80:15:5 ఫార్ములాతో పోటీ చేస్తాయని కొద్దిరోజుల క్రితం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన జనసేనకు 15 శాతం సీట్లు మాత్రమే ఇస్తామని టీడీపీ ప్రకటించినట్లైందని అంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై జనసేనలో అసంతృప్తి వ్యక్తం కాగా, తమకు 15 శాతం ఇస్తామంటే అంగీకరించేది లేదని మంత్రి నాదెండ్ల గతంలోనే తేల్చిచెప్పారు. ఇక శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యకర్తల సమీక్షా సమావేశంలో మరోసారి అవే తరహా వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని మంత్రి చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది.

మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని పరిశీలకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఓటు చీలకూడదనే ఏకైక ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటులో పెద్దఎత్తున త్యాగం చేశారని మంత్రి నాదెండ్ల గుర్తుచేశారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ అప్పట్లో సర్దుబాటు చేసుకున్నప్పటికీ, స్థానిక ఎన్నికల్లో మాత్రం అదే పాత ఫార్ములా కొనసాగబోదని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని బట్టి అభ్యర్ధులను బరిలోకి దించడమే తమ లక్ష్యమని ఆయన తేల్చిచెప్పారు.

గ్రూప్ రాజకీయాలకు ఆస్కారం లేదు

పార్టీ కేడర్‌ను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యంత గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో ఎలాంటి అంతర్గత కుమ్ములాటలకు, గ్రూప్ రాజకీయాలకు అసలు తావులేదని ఆయన తేల్చిచెప్పారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా ప్రాబల్యం కోసం విడిగా గ్రూపులు కట్టాలని ప్రయత్నిస్తే, వాటిని ప్రారంభ దశలోనే కార్యకర్తలు తుంచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కేవలం ఒకే ఒక్క గ్రూప్ ఉంటుందని, అదే పవన్ కల్యాణ్ గ్రూప్ అని ఆయన ఉద్ఘాటించారు. మేమంతా కూడా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా పవన్ కల్యాణ్ ప్రతినిధులుగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించే నిజమైన కార్యకర్తలు, నాయకులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఎక్కడా నిరుత్సాహపడకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. విజయవాడ కేంద్రంగా పార్టీ బలాన్ని మరింత ఇనుమడింపజేసేలా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.