Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో నాదెండ్లకు తప్పిన సీఎం చాన్స్

ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారం 1977లో జారవిడుచుకున్న కాంగ్రెస్ కి 1978లో ఉమ్మడి ఏపీ ఘన విజయం తొలిసారిగా అందించింది.

By:  Satya P   |   22 April 2026 10:00 PM IST
కాంగ్రెస్ లో నాదెండ్లకు తప్పిన సీఎం చాన్స్
X

నాదెండ్ల భాస్కరరావు మంచి న్యాయవాది. పైగా మంచి వాగ్దాటి ఉన్న వారు. చెన్నారెడ్డికి బహు ఇష్టుడు. ఆయన స్నేహితుడిగా ఆంతరంగికుడిగా చాలా కాలం తెర వెనక రాజకీయంగా ఉంటూ వచ్చారు అయితే 1978లో నాదెండ్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు అలా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ మీదట చెన్నారెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. రెండేళ్ళ తరువాత చెన్నారెడ్డి దిగిపోయిన తరువాత సీఎం రేసులోకి నాదెండ్ల భాస్కరరావు వచ్చారు. అయితే ఆ సమయంలో టి అంజయ్యకు సీఎం చాన్స్ కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చింది.

నలుగురు సీఎంలు మారినా :

ఆ తరువాత వరసగా భవనం వెంకటరామ్ కోట్ల విజయభాస్కరరెడ్డిలకు సీఎం గా చేసే చాన్స్ వచ్చింది. అయితే నాదెండ్ల అంజయ్య కేబినెట్ లో పనిచేసిన తరువాత కాంగ్రెస్ కి దూరం జరిగారు. దానికి కారణం ఆయన పేరు హైకమాండ్ పరిశీలనలో సీఎం పదవికి ఉన్నా అనేక సామాజిక రాజకీయ కారణాల వల్ల పక్కన పెడుతూ రావడమే. దాంతో మనస్తాపం చెందిన నాదెండ్ల కాంగ్రెస్ లో ఉంటే సీఎం కాలేమని భావించి కొత్త పార్టీ పెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు.

ఇందిరమ్మకు ఇష్టుడిగా :

నాదెండ్ల భాస్కరరావు ఏపీలో చెన్నారెడ్డికి ఎంతో సన్నిహితుడు. అలాగే నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఇష్టమైన నేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ లో సీఎం పదవికి నాదెండ్ల పరుని ఒక దశలో హైకమాండ్ సీరియస్ గా పరిశీలించినా మరో బలమైన సామాజిక వర్గం వ్యతిరేకించడంతో ఆయనకు అవకాశం దక్కకుండా పోయింది. లేకపోతే నాదెండ్ల నెల రోజుల సీఎం కాదు ఎన్టీఆర్ కంటే ముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయి ఉండేవారు. కనీసంగా ఏడాది పాటు అయినా పాలించి ఉండేవారు అని చెబుతారు.

కాంగ్రెస్ తోనే ప్రయాణం :

మరో వైపు చూస్తే నాదెండ్ల భాస్కరావు కాంగ్రెస్ నుంచే ఎంట్రీ ఇచ్చారు. అదే కాంగ్రెస్ లోనే పదవులు అందుకుని ఎక్కువ కాలం అందులోనే ప్రయాణించారు. చివరి దశలో బీజేపీలో చేరినా ఆయన ఆ పార్టీలో క్రియాశీలంగా పనిచేయలేదు. కాంగ్రెస్ లోనే మంత్రి అయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యే ఒక సారి ఎంపీ అయ్యారు. టీడీపీలో మాత్రం ఒక సారి ఎమ్మెల్యే అయి మంత్రి అయి సీఎం గా నెల రోజుల పాటు పని చేయగలిగారు.

తొలి విజయం ఏపీ నుంచే :

ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారం 1977లో జారవిడుచుకున్న కాంగ్రెస్ కి 1978లో ఉమ్మడి ఏపీ ఘన విజయం తొలిసారిగా అందించింది. ఇందిరా కాంగ్రెస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసినపుడు అందులో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరూ చేరలేదు. కానీ మర్రి చెన్నారెడ్డి నాదెండ్ల భాస్కరరావు ఏపీలో ఆ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళారు. అలా ఓటమిలో ఉన్న ఇందిరకు మంచి విజయాన్ని ఏపీ నుంచి అందించారు. దాంతోనే కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు నాదెండ్ల భాస్కరరావు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటూ వచ్చింది. ఆయన్ని సీఎం గా చేయాలని కేంద్ర కాంగ్రెస్ పెద్దలు భావించినా ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ లో వర్గ పోరు బలమైన నేతల ఒత్తిడి వల్ల అది వీలు పడలేదు. ఒక విధంగా రాజకీయంగా నాదెండ్ల దురదృష్టవంతుడనే చెబుతారు. ఎంతో ప్రతిభ ఉండి కూడా సీఎంగా ఎక్కువ కాలం పని చేయలేక పోయారు అని అంటారు.