Begin typing your search above and press return to search.

ఇక బీజేపీ వంతు...జేపీ నడ్డా డైరెక్ట్ గా !

విశాఖను కూటమి నాయకులు అంతా ఒకటికి పదిసార్లు చుట్టేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు కూటమికి 2024 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టాయి.

By:  Satya P   |   8 Sept 2025 1:00 AM IST
ఇక బీజేపీ వంతు...జేపీ నడ్డా డైరెక్ట్ గా !
X

విశాఖను కూటమి నాయకులు అంతా ఒకటికి పదిసార్లు చుట్టేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు కూటమికి 2024 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టాయి. ఆ విజయాన్ని ఇంకా గట్టి పరచుకోవాలని కూటమి పార్టీలు చూస్తున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ కంచుకోటలు ఉన్నాయి. అలాగే జనసేనకు కూడా బలం ఉంది. బీజేపీకి పట్టణ ప్రాంతాలలో ఇపుడిపుడే ఆదరణ దక్కుతోంది. దాంతో టీడీపీ జనసేన బాటలోనే బీజేపీ కూడా తన ఫోకస్ మొత్తం ఇక్కడ పెడుతోంది.

ఇంట గెలవాలని :

ఇక ఉత్తరాంధ్ర ముఖ ద్వారంగా ఉన్న విశాఖ నుంచి కమల వికాసానికి బీజేపీ భారీ స్కెచ్ ని రూపొందించింది. ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ సీటు దక్కింది. విశాఖ నార్త్, శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల అసెంబ్లీ సీట్లు దక్కాయి. రానున్న కాలంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తన బలాన్ని మరింతగా విస్తరించేందుకు బీజేపీ చూస్తోంది. అందుకే విశాఖకు చెందిన బీసీ నాయకుడు పీవీఎన్ మాధవ్ కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెటింది. మాధవ్ సైతం ఉత్తరాంధ్ర నుంచే బీజేపీ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ముందు తాను ఉన్న చోటనే బీజేపీకి కొత్త బలాన్ని అందించడం ద్వారా తన అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేయాలని చూస్తున్నారు.

బీసీలు టార్గెట్ గా :

ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే బీసీలు అత్యధికంగా ఉంటారు. ఉమ్మడి మూడు జిల్లాలలో నూటికి ఎనభై శాతం వారే రాజకీయంగా సామాజికంగా ఆధిపత్యం చూపిస్తారు. బీసీల పార్టీగా ఉన్న టీడీపీకి ఉత్తరాంధ్ర రాజకీయంగా ఆదరించడానికి ఇది ప్రధాన కారణం. ఇక జనసేనకు సైతం ఉత్తరాంధ్రాలో ఉన్న ఒక బలమైన సామాజిక వర్గం మద్దతు లభిస్తోంది. బీజేపీ ఈ సామాజిక కోణాన్ని రాజకీయ సమీకరణలను అర్ధం చేసుకుంటోంది. దాంతో ఆ దిశగానే తన కార్యాచరణకు పదును పెడుతోంది. బీసీలను లక్ష్యంగా చేసుకుంటోంది వారిని ఆకర్షించడం ద్వారా కాషాయం పార్టీకి ఉత్తరాంధ్రాలో బలమైన పునాదులు వేసుకోవాలని చూస్తోంది.

సారధ్యం పేరుతో నడ్డా :

ఈ నేపధ్యంలో బీసీ నేత అయిన మాధవ్ కి పార్టీ పగ్గాలు దక్కాయి. మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరువాత సారధ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ జిల్లాలలోని కడప నుంచి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖలో సారధ్యం కార్యక్రమాన్ని ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఆ విధంగా జేపీ నడ్డా ఈ నెల 14న విశాఖలో జరిగే సారధ్యం సభకు హాజరవుతున్నారు. ఈ సభ ద్వారా నడ్డా ఉత్తరాంధ్ర ప్రజలకు ఏ రకమైన సందేశం ఇస్తారో చూడాల్సి ఉంది. అంతే కాదు బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులకు ఏ విధమైన దిశా నిర్దేశం చేస్తారో చూడాల్సి ఉంది. మొత్తానికి వరసబెట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ విశాఖ పర్యటనలు చేస్తున్నారు. ఇపుడు బీజేపీ వంతు అని అంటున్నారు. బీజేపీ కూడా తన ఫోకస్ ఇక్కడే పెడుతోంది ఏ రకమైన రాజకీయ ఫలితాలు అందుతాయో అన్న చర్చ అయితే సాగుతోంది.