ఆటగాడా నీ ఆట కట్టిస్తా...ఉక్రెయిన్ మహిళ వార్నింగ్
నా అన్వేషణ ఛానల్ తెలుగు ట్రావెల్ వ్లాగింగ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాలు తిరిగి, అక్కడి సంస్కృతి, ఆహారం, జీవన విధానం చూపించడం వల్ల లక్షలాది మంది ఫాలో అయ్యారు.
By: Tupaki Political Desk | 8 Jan 2026 3:26 PM ISTనాకొక్క చాన్స్ ఇవ్వండి...ఆ అన్వేష్ ను భరతమాత ముందు మోకాళ్ళపై కూర్చోబెడతా...అతనికి అంత సీన్ లేదు...గతంలో నేను హెచ్చరించగానే తోకముడిచి కంబోడియా నుంచి మలేసియా పారిపోయాడు. నేను థాయ్ లాండ్ లో ఉంటున్నా...ఊ అనండి అతగాడి పనిపడతా...అంటూ ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి అన్వేష్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకూ అన్వేష్ పై అందరూ ఎందుకింతగా విరుచుకుపడుతున్నారు. అతను చేసిన తప్పేంటి? ప్రఖ్యాత ప్రవచన కర్త గరికపాటిపై వరసగా సోషల్ మీడియాలో అన్వేష్ ఎందుకు వ్యంగ్య పోస్టింగ్ లు పెడుతున్నాడు. అన్వేష్ ఇండియా రా...నీ కతేంటో తేలుస్తాం అని వేలాది మంది ఆగ్రహంతో ఎందుకు ఊగిపోతున్నారు?
నా అన్వేషణ ఛానల్ తెలుగు ట్రావెల్ వ్లాగింగ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాలు తిరిగి, అక్కడి సంస్కృతి, ఆహారం, జీవన విధానం చూపించడం వల్ల లక్షలాది మంది ఫాలో అయ్యారు. ప్రపంచ యాత్రికుడిగా...డబుల్ మీనింగ్ డైలాగ్ చక్రవర్తిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నా అన్వేష్ ఈ మధ్య కాలంలో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాసకులు గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలపై, 'నా అన్వేషణ' యూట్యూబర్ అన్వేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దెబ్బకు అతని ఇన్ స్టా పాలోవర్లు అన్ ఫాలో అయి రిపోర్టులు కొట్టేశారు. సోషల్ మీడియాలో హీరోలా వెలిగిన అన్వేష్ ఈ ఒక్క ఘటనతో జీరోగా మారిపోయాడు. దండోరా సినీ ప్రమోషన్ వేదిక పై నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.కూడా 'నా అన్వేషణ' అన్వేష్ స్పందించారు. ఆ సమయంలో శివాజీని ఉద్దేశించి ఆయన విమర్శలు గుప్పించారు. అయితే అన్వేష్ నోటి వాగుడు కేవలం శివాజీపై విమర్శతోనే ఆగిపోలేదు. మహిళల దుస్తులు, వస్త్రధారణ గురించి కామెంట్లు చేస్తూ...పురాణంలోని ద్రౌపది, సీతల్ని విమర్శించడంతో కథ మరో మలుపు తిరిగింది. భారత ఇతిహాసాలుగా రామాయణం, మహాభారతాన్ని అత్యంత పవిత్ర సాహిత్య గ్రంథాలుగా పూజించే ప్రజలు అన్వేష్ వాగుడుకు ఘోరంగా రియాక్ట్ అవుతున్నారు. అన్వేష్ ఏదో నాలుగు దేశాలు తిరుగుతూ...తోచిన నాలుగు ముక్కలు చెప్పుకోక ఈ మాటలేంటి అని విరుచుకుపడుతున్నారు.
దండోరా సినీ ప్రమోషన్ వేదికపై నటుడు శివాజీ వ్యాఖ్యల ఉద్దేశం మంచిదే అయినా ఆ సందర్భంగా వాడిన పదాలు వివాదాస్పదంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యలపై యాంకర్ సినీ యాక్ట్రస్ అనసూయ తనదైన శైలిలో స్పందించింది. మహిళల్ని దుస్తుల పరంగా విమర్శించడం వారిపై ఆంక్షలు విధించడం...కట్టుబాట్లన్నీ మహిళలకే అన్నట్లు వ్యవహరించడం పురుషాధిక్యతను...పితృస్వామ్య వ్యవస్థను ప్రతిపలిస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే ప్రముఖ గాయని చిన్మయి కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...మహిళల దుస్తులు గురించి మాట్లాడ్డమంటే...వారిని ఆబ్జక్టిఫై చేయడమే అని అన్నారు. మహిళలకు కేవలం శరీరమే కాదు మనసు ఉంటుంది...మెదడు ఉంటుందన్న విషయాన్ని శివాజీ లాంటి వారు మరచిపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతను కోర్టు సినిమాలో ధరించిన మంగపతి పాత్ర నుంచి ఇంకా బైటికి రాలేకపోతున్నారని కూడా అన్నారు. ఇలా శివాజీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రెండు క్యాంపులుగా విడిపోయి పరస్పర విమర్శలు చేసుకుంటుండగా...సందిట్లో సడేమియాలా అన్వేష్ శివాజీపై బూతులతో విరుచుకుపడుతూ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. అందరూ శివాజీని వదలి అన్వేష్ పై పడిపోయారు. కథ అడ్డంగా తిరిగింది.
అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సరికావంటూ...సినీనటి, బీజేపీ నేత కరాటే కల్యాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే అన్వేష్ పై ఖమ్మంలో ఖానాపూర్ హవేలీలో కేసు నమోదు అయ్యింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అన్వేష్ హిందువులు పవిత్రంగా పూజించే సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత విమర్శలు చేస్తూ వీడియో రిలీజ్ చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అలాగే విశ్వ హిందూ పరిషత్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నా అన్వేష్ ఏమాత్రం తగ్గకుండా...గరికపాటిపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతూ వరసగా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.
ఎక్కడో నక్కి వీడియోలు చేయడం కాదు...ఒకసారి ఇండియాకు వచ్చి మాట్లాడు... నీ పని చెబుతాం అంటూ చాలా మంది సవాళ్ళు విసురుతున్న నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ కు చెందిన మహిళ లిడియా లక్ష్మి నాకో అవకాశం ఇవ్వండి అన్వేష్ ను భరతమాత ముందు మోకాళ్ళపై కూర్చోపెడతా అని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారుతోంది. ఈ ఆటగాడి ఆట ఎవరు కట్టిస్తారో చూద్దాం.
