అడ్రస్ లేని పార్టీలు .. అడ్డగోలు విరాళాలు !
అనామికా అశ్వన్ 2020లో పాట్నాలో ఆమ్ జన్మత్ పార్టీని స్థాపించారు. ఆమె ప్రస్తుతం బీహార్ బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
By: Garuda Media | 7 Sept 2026 9:37 AM ISTరాజకీయా పార్టీలకు విరాళాల గురించి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 2018 నుండి 2024 మధ్యలో ఎలక్టోరల్ బాండ్ల పేరుతో విరాళాలు వెల్లువెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ విధానాన్ని రద్దు చేసింది. ఈ సమయంలో బీజేపీకి రూ.6986 కోట్లు, టీఎంసీకి రూ.1609 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ.1421 కోట్లు, బీఆర్ఎస్ పార్టీకి 1322 కోట్లు, బీజేడీకి రూ.944 కోట్లు, డీఎంకేకు రూ.656 కోట్లు, వైసీపీకి రూ.442 కోట్లు, టీడీపీకి రూ.211 కోట్లు విరాళాలు వచ్చాయి.
ప్రధానంగా ఫ్యూచర్ గేమింగ్, మెగా ఇంజనీరింగ్, క్విక్ సప్లై చైన్ వంటివి ఈ విరాళాలు అందజేసిన వాటిలో ప్రధానంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కార్పోరేట్, వ్యక్తిగత విరాళాలను డీడీలు, చెక్కుల రూపంలో అందజేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల విరాళాలు ఏకంగా మూడు రెట్లు పెరగడం విశేషం.
అనామికా అశ్వన్ 2020లో పాట్నాలో ఆమ్ జన్మత్ పార్టీని స్థాపించారు. ఆమె ప్రస్తుతం బీహార్ బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమ్ జన్మత్ పార్టీ ఆ తరువాత బీహార్ నుండి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు తరలిపోయింది. దీంతో ఆమె తన పదవికి అప్పుడే రాజీనామా చేసినట్లు చెబుతుంది. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో బరిలోకి దింపింది కేవలం ఒక్క అభ్యర్థినే. కానీ ఆ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.620 కోట్లు. 2022 - 23 సంవత్సరంలో ఈ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.216 కోట్లు.
సత్యవాదీ రక్షక్ అనే పార్టీ గుజరాత్ లోని ఆనంద్ లో స్వాతిబెన్ అనే ఆమె నామమాత్రపు అధ్యక్షురాలిగా పేర్కొంటూ స్థాపించింది. ప్రస్తుతం ఈ పార్టీ కార్యాలయం మూసివేయబడింది. ఈ పార్టీ 2022 - 2023లో వచ్చిన విరాళాలు రూ.85.67 కోట్లు, 2023 - 24లలో వచ్చిన విరాళాలు రూ.330.55 కోట్లు మొత్తం రెండేళ్లలో వచ్చిన విరాళాలు రూ.416 కోట్లు.ఈ పార్టీ తరపున కూడా మొత్తంగా ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీ చేయడం విశేషం. వీటితో పాటు మరికొన్ని పార్టీలకు కూడా వందల కోట్లలో విరాళాలు రావడం మిస్టరీగా ఉంది.
జాతీయ పార్టీలు, ప్రధానమైన ప్రాంతీయ పార్టీలకు మించి ఈ పార్టీలకు విరాళాలు అందాయి. ఇన్ ఫ్రా, మైనింగ్, ఎనర్జీ, లాటరీ, టెలికాం రంగాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఈ విరాళాలను ఇస్తున్నాయి. కొన్ని ప్రధాన పార్టీలు ఇలాంటి ఊరు పేరులేని పార్టీలను అడ్డుపెట్టుకుని విరాళాలు సేకరిస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఈ విరాళాలు ఈ పార్టీల పేరుతో ఎవరి ఖాతాలకు వెళ్తున్నాయి ? ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
