‘డాక్టర్’ మావోయిస్ట్.. దండకారణ్యంలో అన్నల పాలిట సంజీవుడు
గతంలో మావోయిస్టులకు బహిరంగ సమాజంలోని మేధావి వర్గం మద్దతు ఉండేది. కొందరు ప్రొఫెషనల్స్ కూడా వీరిలో ఉండేవారు.
By: Tupaki Political Desk | 29 Dec 2025 3:52 PM ISTఆయన పుట్టింది ఎక్కడో పంజాబ్ లో... చదివింది ఎంబీబీఎస్... కానీ ఎంచుకున్నది మావోయిస్టు ఉద్యమ మార్గం..! అలా అడవి బాట పట్టి అన్నలకు ఆప్తుడు అయ్యారు..! వారి ప్రాణాలు నిలిపే డాక్టర్ గా మారారు..! కొన్ని నెలల నుంచి మావోయిస్టు అగ్రనేతల ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల గురించి.. కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ల గురించి కథనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటి మధ్య విభిన్నమైన స్టోరీ ఈ డాక్టర్ ది. వైద్య విద్య చదివినా.. ఉద్యమంతోనే సమసమాజం అంటూ అడవి బాట పట్టిన ఆయన చాలామంది మావోయిస్టులకు ప్రాణ దాతగా మారారు. ఇటీవల లొంగిపోయిన ఓ మావోయిస్టు చెప్పడంతో ఆ డాక్టర్ మావోయిస్ట్ గురించిన ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. అయితే, ఇంతవరకు ఆయన ఎలా ఉంటారో అని కానీ, ఎక్కడ ఉన్నారు అని కానీ భద్రతా దళాలు, పోలీసులు గుర్తించలేకపోయాయి. నిఘా వర్గాలు కూడా ఆయన జాడను పసిగట్టలేకపోయాయి. దీంతో ఆయన మిస్టరీ డాక్టర్ గానూ పేరొందారు.
ఉద్యమంలో ఏకైక డాక్టర్..
గతంలో మావోయిస్టులకు బహిరంగ సమాజంలోని మేధావి వర్గం మద్దతు ఉండేది. కొందరు ప్రొఫెషనల్స్ కూడా వీరిలో ఉండేవారు. అయితే, నిర్బంధం పెరిగాక మాత్రం పరిస్థితులు మారాయి. ఇలాంటి సమయంలో డాక్టర్ రఫీక్ ఉద్యమంలో చేరారు. పంజాబ్ కు చెందిన ఈయన మావోయిస్టుల్లో చేరిన ఏకైక ట్రైన్డ్ డాక్టర్ కావడం విశేషం. అలా అగ్రనేతలతో పాటు ఎందరికో విప్లవకారులకు వైద్యం చేశారు. అడవిలో ఎలాంటి వసతులూ లేకున్నా డాక్టర్ రఫీక్ తన నైపుణ్యంతో మావోయిస్టుల ప్రాణాలు కాపాడారని చెబుతుంటారు.
12 ఏళ్ల కిందటే సమాచారం అందినా..
డాక్టర్ రఫీక్ గురించి 2013లోనే భద్రతా దళాలకు తెలిసింది. కానీ, ఇప్పటికీ ఆయనను పట్టుకోలేకపోయారు. నిఘా విభాగానికి కూడా డాక్టర్ రఫీక్ వివరాలు దొరకలేదు. ఇప్పటికీ ఎలా ఉంటారో కూడా తెలియదు. రఫీక్ 2016నే ఛత్తీస్ గఢ్‌లోని దండకారాణ్యాన్ని విడిచి జార్ఖండ్ చేరారు. ఇప్పుడు అక్కడే ఉన్నట్లుగా భావిస్తున్నారు. అంతేకాదు.. డాక్టర్ రఫీక్ భార్య రింకీ కూడా డాక్టరే. ఆమె సైతం 2018లోనే కమాండర్ స్థాయి మావోయిస్టుకు వైద్యం అందించినట్లుగా తెలిసింది.
మావోయిస్టులకే వైద్యం నేర్పారు..
ఎంబీబీఎస్ చదివాక వైద్యం బదులు ఉద్యమం ఎంచుకున్నారు డాక్టర్ రఫీక్. ఆయన మరో పేరు మణిదీప్. ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టులకు వైద్యం చేయడమే కాదు.. వారికి వైద్యం మెలకువలు కూడా నేర్పారు. అక్కడ ఓ ప్రాథమిక వైద్య వ్యవస్థనే నెలకొల్పారు. ఎదురుకాల్పుల్లో గుండె పక్కకు తూటా దిగిన మావోయిస్టు ప్రాణాలను టార్చిలైట్ వెలుగులోనే సర్జరీ చేసి అత్యంత చాకచక్యంగా కాపాడారని చెబుతారు. దట్టమైన అడవుల్లో వైద్య సాయం అందని ఆదివాసీలకు డాక్టర్ రఫీక్ వైద్యం అందించారని కొనియాడుతుంటారు.
