Begin typing your search above and press return to search.

అమెరికా రహస్య స్థావరాలపై నల్లటి త్రిభుజాలు.. గంటకు 2,900 కి.మీ. వేగం.. అసలేం జరుగుతోంది?

గత ఏడాదికాలంలో కనీసం మూడు సందర్భాల్లో నల్లటి త్రిభుజాకారపు వస్తువులు ఈ కేంద్రాల వద్ద కనిపించినట్లు ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

By:  A.N.Kumar   |   24 Oct 2026 6:00 PM IST
అమెరికా రహస్య స్థావరాలపై నల్లటి త్రిభుజాలు.. గంటకు 2,900 కి.మీ. వేగం.. అసలేం జరుగుతోంది?
X

అమెరికా ఆకాశంలో ఇటీవల వెలుగుచూస్తున్న కొన్ని వింత వైమానిక వాహనాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. సాధారణ విమానాల ఆకారాం కానీ, డ్రోన్లకు ఉండే ప్రామాణిక కదలికలు కానీ లేని కొన్ని వింత వస్తువులు సున్నితమైన రక్షణ ప్రాంతాల సమీపంలో ప్రత్యక్షమవుతున్నాయి. వీటికి ఇంజిన్ శబ్దం లేకపోవడం.. పొగ లేదా ఎగ్జాస్ట్ ఆనవాళ్లు కనిపించకపోవడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత రహస్య సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే అమెరికా సైనిక కేంద్రాల పరిసరాల్లోనే ఇవి సంచరించడం ఆ దేశ భద్రతా వ్యవస్థపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గుర్తుతెలియని వైమానిక దృగ్విషయాలకు (యూఏపీ) సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే క్రమంలో అక్టోబర్ 23న వెలువడిన సమాచారం ఈ చర్చను మరింత వేడెక్కించింది. గత ఏడాదికాలంలో కనీసం మూడు సందర్భాల్లో నల్లటి త్రిభుజాకారపు వస్తువులు ఈ కేంద్రాల వద్ద కనిపించినట్లు ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఘటనలలో ప్రతిఒక్కరినీ విస్తుపోయేలా చేస్తున్న ప్రధాన అంశం ఆ వస్తువుల అసాధారణ వేగం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఒక నల్లటి త్రిభుజాకారపు వస్తువు కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే దాదాపు 2.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీనిని బట్టి లెక్కబడితే దాని వేగం గంటకు సుమారు 2,900 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అయితే ఇది కేవలం ప్రత్యక్ష సాక్షుల అంచనా మాత్రమే అయినందున శాస్త్రీయంగా నిర్ధారించడానికి రాడార్, ఇతర సెన్సార్ల డాటా అత్యవసరం కానుంది. 9 నుండి 15 అడుగుల వింగ్ స్పాన్ కలిగిన ఈ వాహనాల నిర్మాణం కూడా అత్యంత విచిత్రంగా ఉంది. ప్రామాణిక విమానాల్లో ఉండే కాక్‌పిట్, ఎయిర్ ఇంటేక్స్ లేదా ప్రత్యేక ఇంజిన్ భాగాలు వీటిలో ఏమాత్రం కనిపించలేదు. థర్మల్ పరికరాల ద్వారా పరిశీలించినప్పుడు కూడా విమానాల్లోలాగా ఇంజిన్ వద్ద అధిక ఉష్ణోగ్రత ఉండకుండా ఉపరితలమంతా ఒకే రకమైన ఉష్ణ సంకేతాలు నమోదు కావడం గమనార్హం.

ఈ పరిణామాలు అమెరికా జాతీయ భద్రతకు సంబంధించి పలు కీలక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇవి అమెరికా రక్షణ దళాలు రహస్యంగా రూపొందిస్తున్న నూతన తరం స్టెల్త్ సాంకేతికతకు చెందినవా లేక ప్రత్యర్థి దేశాలు ప్రయోగించిన అత్యాధునిక నిఘా సాధనాలా అనే దిశగా విశ్లేషణలు జరుగుతున్నాయి. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఇవి అమెరికా సాంకేతికత కాకపోవచ్చని కొందరు అధికారులు భావిస్తున్నప్పటికీ విదేశీ హస్తం ఉందనడానికి కూడా స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అలాగని వీటిని వెంటనే గ్రహాంతరవాసుల (యూఎఫ్ఓ) వాహనాలుగా నిర్ధారించడం తొందరపాటే అవుతుంది. వాతావరణ మార్పులు, సెన్సార్ లోపాలు లేదా దృశ్య భ్రమల వల్ల కూడా ఇలాంటి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. స్పష్టమైన డాటా అందుబాటులోకి వస్తేనే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం లభిస్తున్న సమాచారం సమాధానాల కంటే మరిన్ని సందేహాలనే రేకెత్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.