ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. అక్కడ మున్సిపల్ ఎన్నికలు వాయిదా
రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
By: Tupaki Political Desk | 19 Oct 2026 7:20 PM ISTరాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28న మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాల్సివుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదుకూరులో కొన్ని వార్డుల్లో నామినేషన్ పత్రాలు చిరిగిపోవడంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్వయంగా వెల్లడించారు. సోమవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై కొన్ని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, మైదుకూరులో నామినేషన్ పత్రాలు చిరిగిపోవడంతో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మైదుకూరులోనే ఎందుకు?
రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి చెందిన పులివెందుల, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పుంగనూరు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలతోపాటు అన్నమయ్య జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా దర్శి, తిరుపతి నగరపాలక సంస్థల్లో నామినేషన్ల సందర్బంగా హింసాత్మక ఘటనలు నమోదైనట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల తీరుపై విపక్షం వైసీపీ ఫిర్యాదులు చేసింది. పుంగనూరు, పులివెందుల, దర్శిల్లో కొన్నివార్డులకు వైసీపీ నామినేషన్లు వేయలేకపోయిందని అంటున్నారు. దీనిపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం మైదుకూరు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడమే అంతుచిక్కడం లేదని అంటున్నారు.
మైదుకూరు మున్సిపాలిటీలో కూడా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని చెబుతున్నారు. అయితే ఎన్నికల అధికారులకు అందిన నామినేషన్ పత్రాలు చిరిగిపోవడం వల్ల అక్కడ ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. అంటే కూటమి నుంచి అందిన నామినేషన్లు చిరిగిపోవడం వల్లే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నామినేషన్ పత్రాలు చిరిగిపోవడానికి కారణమేంటి? చెరిగిన పత్రాలను అధికారులు ఎందుకు తీసుకోవాల్సివచ్చిందనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేకపోవడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఉద్రిక్త పరిస్థితులపై కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. దీంతో హింసాత్మక ఘటనలు జరిగిన చోట ఎన్నికలను నిలిపివేసే అవకాశం ఏమైనా ఉందా అనే ఉత్కంఠ నెలకుందని అంటున్నారు. కడప జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో అవాంఛనీ ఘటనలు జరిగాయని ఎన్నికల సంఘం స్వయంగా ప్రకటించడం, వీటిపై జిల్లా కలెక్టర్ల నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేయడంతో ఆయా చోట్ల ఎన్నికల నిర్వహణపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
