వైసీపీకి టచ్ లో మాజీ ఎంపీ ?
వైసీపీ చేసుకున్న ఖర్మ ఏంటో కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు పదవులు అందుకున్న వారు కానీ లేదా ఉన్నత స్థానాలకు ఆ పార్టీ ద్వారానె ఎగబాకిన వారు కానీ పార్టీ ఘోరంగా ఓడి కష్టాలతో సావాసం చేస్తున్న సమయంలో మాత్రం సైడ్ అయిపోయారు.
By: Satya P | 18 Dec 2025 6:00 PM ISTవైసీపీ చేసుకున్న ఖర్మ ఏంటో కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు పదవులు అందుకున్న వారు కానీ లేదా ఉన్నత స్థానాలకు ఆ పార్టీ ద్వారానె ఎగబాకిన వారు కానీ పార్టీ ఘోరంగా ఓడి కష్టాలతో సావాసం చేస్తున్న సమయంలో మాత్రం సైడ్ అయిపోయారు. అలా వారూ వీరూ అని కాదు ఏపీ అంతటా కనిపిస్తున్నారు. అయితే వైసీపీ పెద్దలకు తమ బాధలు చెప్పి కొందరు సైడ్ అయ్యారు అని మరికొందరు ఇక ఇప్పట్లో వద్దు రాజకీయం అని తాముగానే డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు.
కల నిజమైన వేళ :
విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన కలను సాకారం చేసుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి పదవులు అందుకోవాలని చూశారు వైసీపీలోకి ఇలా చేరి అలా ఎంపీ సీటు అందుకుని విశాఖ నుంచి 2019 నుంచి 2024 మధ్యలో ఎంపీగా అయిదేళ్ళ పాటు పనిచేశారు. అయితే పార్టీ ఓటమి చెందగానే ఆయన మాత్రం కనిపించకుండా పోయారు. అయితే ఆయన వ్యాపార వ్యవహారాల విషయంలో ఇబ్బందుల వల్లనే ఇలా చేశారు అని అంటున్నారు. ఆయన సన్నిహితులు ముఖ్య నేతలు వైసీపీతోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా సరైన సమయంలో తిరిగి ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు.
మళ్ళీ ఎంపీగానే :
ఇక 2029 ఎన్నికల మీద వైసీపీ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టేసింది. దాంతో ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఎంపీ సీటు మీదనే ఆ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే బలమైన నేతలను ఆర్ధికంగా తట్టుకునే వారిని అంగబలం చూపించిన వారిని తెచ్చి పోటీకి దించాలని భావిస్తోంది అని చెబుతున్నారు. బలమైన ఎంపీ అభ్యర్ధులు ఉంటే కనుక అది ఏడు అసెంబ్లీ నియోజకగవర్గాల మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అధినాయకత్వం లెక్క వేసుకుంటోందిట. దాంతో అన్ని విధాలుగా బలంగా ఉన్న ఎంవీవీని 2029 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీకి దించుతారని టాక్ అయితే నడుస్తోంది.
సీఎం రమేష్ మీదనే:
అయితే ఆయనను ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దించుతారు అని అంటున్నారు. అక్కడ సీఎం రమేష్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అంగబలం అర్ధబలంతో ఆయనతో సరితూగే నేత ఎవరూ లేరు. అయితే వైసీపీలో ఉన్న వారిలో బిగ్ షాట్ గా ఎంవీవీనే చెబుతున్నారు. మిగిలిన వారు ఎంతో మంది కనిపిస్తున్నా రమేష్ తో ఢీ కొట్టాలీ అంటే ఎంవీవీతోనే సాధ్యపడుతుందని పార్టీ ఆలోచిస్తోంది అని ప్రచారం అయితే సాగుతోంది. దాంతో ఆయనను అనకాపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారు అన్నది అయితే పుకారుగా షికారు చేస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉంది కాబట్టి ఆ సమయానికి ఏమి జరుగుతుందో ఈ పుకార్లు నిజం అవుతాయో లేదో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
