Begin typing your search above and press return to search.

ఎక్కడ ఉంది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్? సీఎం రేవంత్ అనూహ్య ప్యాకేజీ ఎందుకు?

మూసీ పునరుద్ధరణకు సంబంధించిన పనులు ఒక పక్క జరుగుతున్న వేళలో.. బాపూ ఘాట్ వద్ద మధు పార్క్ రిడ్జ్ అనే భారీ అపార్ట్ మెంట్ ఒకటి ఉంది.

By:  Garuda Media   |   9 March 2026 10:43 AM IST
ఎక్కడ ఉంది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్? సీఎం రేవంత్ అనూహ్య ప్యాకేజీ ఎందుకు?
X

ఒక్కో ముఖ్యమంత్రి తీరు ఒక్కోలా ఉంటుంది. పాలకులు ఎవరైనా.. తమ చేతికి అధికారంవచ్చాక తమ మార్క్ కనిపించేలా ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాన్నే తీసుకుంటే.. సీఎం అవుతానన్న ఆశ ఆయనలో ఉన్నా.. అదెప్పటికి సాధ్యమన్న దానిపై ఆయనకు ఆయనకే స్పష్టత లేని పరిస్థితి. తాము సీఎం అయ్యాక.. తన సన్నిహితులతో మాత్రమే కాదు.. ఓపెన్ మీటింగ్స్ లోనూ తాను సీఎం అయ్యానని.. తాను సాధించాల్సింది సాధించేశానని.. ఇక ప్రత్యేకంగా సాధించాల్సింది ఏమీ లేదని.. ప్రజలకు వీలైనంత మంచి చేయటం మాత్రమే మిగిలి ఉందని చెప్పటం కనిపిస్తుంది.

అంతేకాదు.. హైదరాబాద్ మహానగరాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలన్న కలను ఆయన చెప్పినప్పుడు చాలామంది అసాధ్యమని.. అనవసరమైన విషయాల్లోకి వెళుతున్నట్లుగా విశ్లేషించారు. అయితే.. తాను చేసే పనులపై తనకు ఎంత స్పష్టత ఉందన్న విషయాన్ని సీఎం రేవంత్ విడతల వారీగా అందరికి అర్థమయ్యేలా చేస్తున్న పరిస్థితి. మాటలకే తప్పించి.. చేతలకు సాధ్యం కానీ మూసీ పునరుద్ధరణ పనులను దశల వారీగా పూర్తి చూసి.. హైదరాబాద్ మీద తన మార్క్ ను వేయాలన్న తపన ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

మూసీ పునరుద్ధరణకు సంబంధించిన పనులు ఒక పక్క జరుగుతున్న వేళలో.. బాపూ ఘాట్ వద్ద మధు పార్క్ రిడ్జ్ అనే భారీ అపార్ట్ మెంట్ ఒకటి ఉంది. దీని ప్రత్యేకత ఏమంటే.. ఈ భారీ భవన సముదాయంలో ఏకంగా 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందరూ మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతికి చెందిన వారే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమాజాన్ని ప్రభావితం చేసే.. పెద్ద పెద్ద జర్నలిస్టులు మాత్రమే కాదు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్ లు ఉన్నారు.

వీరు బయటకు రాకుండానే.. ప్రభుత్వం మీద భారీ ఒత్తిడి తీసుకొచ్చే స్థాయి వారి సొంతం. చివరకు బాపూఘాట్ వద్ద చేపట్టే డెవలప్ మెంట్ పనుల కారణంగా 600 కుటుంబాలు ప్రభావితం అవుతాయని.. ఆ ప్రాజెక్టును ఆపటమే మంచిదన్న రీతిలో జాతిపిత మహాత్మా గాంధీ మునిమనమడు సైతం సోషల్ మీడియాలో పోస్టు పెట్టించే సామర్థ్యం అక్కడ ఉన్న వాళ్ల సొంతం.

ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం ఏమంటే.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ లో కొంత భాగం బఫర్ జోన్ లో నిర్మించింది. నిబంధలనకు విరుద్దంగా కొంత ఉన్నప్పటికీ.. అప్పటి అధికారులు.. పాలకుల పుణ్యమా అని చట్టబద్ధంగా నిర్మాణం చేసినట్లుగా పత్రాలు ఉన్నాయి. మూసీ ప్రాజెక్టు.. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తునన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులను ఆవేదన.. వారి ఆక్రోసం ముఖ్యమంత్రి రేవంత్ వరకు వెళ్లటం.. అదే సమయంలో ఈ ఉదంతాన్ని రేవంత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పడేసిన కంచె గచ్చిబౌలి ప్రభుత్వ స్థలాన్ని అమ్మకుండా అడ్డుకున్న వైనంతో పలువురు పోల్చటం గమనార్హం.

కంచె గచ్చిబౌలి ఉదంతం రీపీట్ కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ ఏం చేస్తారన్న ఉత్కంట చాలామందిలో ఉంది. ఇలాంటి వేళ.. అనూహ్య రీతిలో మహిళా దినోత్సవం సందర్భంగా తాను చేసిన ప్రసంగంలో ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ ఉదంతాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ అనూహ్య రీతిలో ప్యాకేజీని ప్రకటించారు. ఆయన ప్యాకేజీ విన్న తర్వాత.. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఉండటం ఇక్కడ అసలు ట్విస్టుగా చెప్పాలి.

ఇక్కడే కేసీఆర్ - రేవంత్ రెడ్డిల పాలనా తీరును ప్రస్తావించాలి. తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా ప్రశ్నించినా.. ఎవరైనా కాదన్నా.. వ్యతిరేకించినా.. వారిని ఉపేక్షించకపోవటం.. వారిని తన చేతిలో ఉన్న అధికారంతో నోరు తెరవకుండా చేయటం కేసీఆర్ స్టైల్. అలా అని ఆయన మరీ అంత దుర్మార్గం వ్యవహరిస్తారా? అంటే.. కాదని చెప్పాలి. ఎవరైనా సరే.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా తమ వాదనను వినిపించాలని అనుకుంటే.. ఆ విషయాన్ని డిమాండ్ రూపంలో కాకుండా విన్నపం రూపంలో చెప్పుకోవాలి. మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా.. విభేదిస్తున్నా అన్నట్లు కాకుండా.. మీరే చేస్తున్నది సరైనదే.. కాకుంటే..ఇంత మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.. వారిని మీ పెద్ద మనసుతో మాత్రమే ఆదుకోగలరు.. మీరు మాత్రమే వారికి దిక్కు.. ఏదో ఒక సాయం చేస్తారా సార్.. అన్నట్లుగా వినమ్రతతో అడిగితే.. సానుకూలంగా స్పందించే వీలుంది.

అందుకు భిన్నంగా పోరుబాటకు వెళతాం.. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలదీస్తాం..ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ను ప్రశ్నిస్తాం.. ప్రజాపోరుతో ఆయన మెడలు వంచుతాం లాంటి మాటలు వస్తే మాత్రం.. ఆయనలో మరో మనిషి నిద్ర లేవటమే కాదు.. వారు కోరుకున్నది ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వని తత్త్వం గులాబీ బాస్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం అందుకు భిన్నం. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. తన డ్రీం ప్రాజెక్టును తప్పులు పడుతూ..ఆందోళనలు చేస్తున్నా.. వాటిని ఫీడ్ బ్యాక్ రూపంలో తీసుకొని.. అందరిని కలుపుకుపోవటానికి వీలుగా ఏం చేయొచ్చు అన్నట్లు వ్యవహరించటం.. ఆందోళనల్ని ఒకస్థాయి వరకు తీసుకెళ్లి.. వారి నోటి నుంచి మాట రాని విధంగా పరిహారాన్ని ప్రకటించే ఎత్తుగడను సీఎం రేవంత్ అనుసరిస్తారు.

తాజాగా మధు పార్క్ రిడ్జ్ విషయంలోనూ అదేపని చేశారు. ఆ భారీ అపార్ట్ మెంట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించే ఈ అపార్ట్ మెంట్ వాసుల యూట్యూబ్ వీడియోల్లో లేవనెత్తిన ఎన్నో అంశాల్ని తన తాజా ప్రసంగంలో పేర్కొన్న ప్యాకేజీతో మాట రాకుండా చేయటమే కాదు..ఇంతకు మించి ప్రపంచంలో మరే ప్రభుత్వం పరిహార ప్యాకేజీ ఇవ్వరన్నట్లుగా ఉండటం రేవంత్ ప్రత్యేకతగా చెప్పాలి.

ఇంతకూ ఆయన తాజాగా ప్రతిపాదించిన ప్యాకేజీ ఏమంటే.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ కు మదగ్గర్లోనే మరో ఏడు ఎకరాల ప్రభుత్వభూమిని ఈ అపార్ట్ మెంట్ వాసులకు ఇవ్వటం.. ఇప్పుడు ఎలా అయితే అపార్ట్ మెంట్ ఉందో.. సరిగ్గా అదే రీతిలో అపార్ట్ మెంట్ ను నిర్మించుకునేందుకు అవసరమైన నిధులను.. ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ లో ప్రభుత్వం వేస్తుందని.. అపార్ట్ మెంట్ వాసులు సంఘంగా ఏర్పడి నిర్మాణం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అదేసమయంలో మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ ను ఇప్పటికిప్పుడు తొలగించమని.. దశల వారీగా కూలగొడతామని చెప్పటం ద్వారా తక్షణ ప్రమాదం ఏమీ లేదన్న అభయాన్ని ఇచ్చేశారు.అంటే.. ఇప్పుడు వాళ్లు ఉండే ప్రాంతానికి చాలా దగ్గర్లో.. వారున్న అపార్ట్ మెంట్ తరహాలోనే మరో భారీ నివాస సముదాయాన్ని నిర్మించుకొని .. అక్కడకు షిప్టు అవ్వండి. అప్పుడే ఈ అపార్ట్ మెంట్ ను ప్రభుత్వం తీసుకుంటుందన్నట్లుగా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని చెప్పాలి. కేసీఆర్ మాదిరి తన మాట ఎలా అయినా నెగ్గాలన్న పట్టుదల ముఖ్యమంత్రి రేవంత్ విషయంలో మరోలా ఉంటుంది. నా మాట నెగ్గాలి.. నేను అనుకున్నది జరగాలి. అలా అని నువ్వు నష్టపోవాల్సిన అవసరం లేదు. నీ ముఖంలోచిరునవ్వు చెదరకుండా.. నేను చేయాలనుకున్నది చేస్తా మిత్రమా.. అన్నట్లుగా రేవంత్ అప్రోచ్ ఉంటుందని చెప్పొచ్చు.